ఎన్నెన్ని కోల్పోయాను
కాకి గూట్లో పిల్లకోయిలనై
రాగాలు కోల్పోయాను
అనురాగాలు కోల్పోయాను
అమ్మ అందం కోసం తల్లిపాలనీ
నాన్న సంపాదన కోసం చిటికెన వేలినీ
ఇంటి ప్రిస్టేజీ కోసం స్నేహితుల్నీ
వొకటనేమిటి -
నిషేధింపబడ్డ చిరునవ్వు చాటున
తన్నుకొచ్చే కన్నీటి వూటకి
బిగి పిడికిళ్ల ఆనకట్ట వేస్తూ
నా చేతుల్లో లేని జీవితం కోసం
చర్మంలోంచి చొచ్చుకుపోయే
వెచ్చని స్పర్శ కోల్పోయాను
మాటలు రాని బొమ్మల ముందు
ఆటలు రాని మూగ బోధిలా
వైకల్యం వెక్కిరించే క్షణాన
పలకరింపుకి పరితపించిపోతూ
గుండె కొలిమిలో కుమిలిపోయాను
బుడిబుడి అడుగులు తడబడ్డప్పుడు
నిట్టాడిలా నిలబెట్టే చేతులు కోల్పోయాను
ఎదిగే స్థారుూ భేదాల చిరసమరంలో
సాటి స్నేహితుల సాంత్వన కోల్పోయాను
ఇల్లు మనుషుల పంజరమైపోతే
ఎగిరే రెక్కల స్వాతంత్య్రం కోల్పోయాను
ఇప్పుడీ మనుషుల వింత సంతలో
అలంకరించిన బసవన్నలా తిరుగుతూ
సహజ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాను!
ఎనె్నన్ని కోల్పోయాను కాకి గూట్లో పిల్లకోయిలనై
english title:
kallapi
Date:
Monday, March 24, 2014