‘పోటీ’ - ఈ పదానికి చాలా విస్తృతార్థం ఉంది. అసలు పోటీ లేకుండా ఈ ప్రపంచమే లేదు. అవును పోటీ ఉంటేనే ఎవరి ప్రతిభైనా వెలుగులోకి వస్తోంది. అది ఏ రంగంలోనైనా సరే. రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటేనే ప్రజలకు సుపరిపాలన దక్కే అవకాశం ఉంటుంది. ఇక సాహితీ క్షేత్రంలో అక్షర హాలికులకు కూడా పోటీతత్వం ఉండాలి. అందుకే వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థలు కవులు, రచయితలకు వివిధ కవితలు, కథల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహిస్తున్నాయి. కాని చాలా సంస్థలు ఉత్తుత్తి పోటీలు నిర్వహించి ఎంట్రీ ఫీజుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయడమే కాక అసలు ఫలితాలు ప్రకటించక, సభలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ కవులు, రచయితలను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. పుబ్బలో పుట్టి మఖలో మాయమయ్యే సంస్థలు కోకొల్లలు. చాలా సంస్థలు జీవిత సభ్యత్వాలు కట్టించుకొని అటువంటి వారిని విజేతలుగా ప్రకటించి కవి సామ్రాట్‌ల బిరుదులు అందజేస్తూ కవిత్వానికి ఉన్న స్థాయిని చులకన చేస్తున్నాయి. తెలుగు భాష రాయడం కూడా రాని వారికి ‘కవితా శిరోమణి’ లాంటి అవార్డులు ఇస్తూ వారిని కొండపై కూర్చోబెడుతున్నారంటే అవార్డులంటేనే హేయభావం వస్తోంది. ఇటీవల నెల్లూరుకు చెందిన ఒక సంస్థ వృద్ధుల సేవకోసం ఆశ్రమాన్ని ప్రారంభించి కవులకు ప్రోత్సాహాన్నిస్తామంటూ ‘కాశీ విశాలాక్షి’ పేరుతో వచ్చే ఓ పత్రిక రాష్టస్థ్రాయి కవితలు, కథల పోటీల ప్రకటనలు గుప్పించింది. దీంతో రాష్టవ్య్రాప్తంగా వందలాది మంది కవులు, రచయితలు తమ రచనలు పంపారు. ఇక అప్పటినుంచి కవులు, రచయితలకు ఎదురుచూపులే మిగిలాయి. అసలు పోటీలు నిర్వహిస్తున్నారో, ఫలితాలు ప్రకటించారో కూడా తెలియదు. సుమారు ఏడాది కాలం సాగదీసి, సాగదీసి చివరకు ఫలితాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఆ పోటీల్లో బహుమతి లభించిందన్న సంగతి విజేతలకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రెండు నెలల ముందు పోటీల విజేతల వివరాలు పత్రికలో ప్రకటించింది. తర్వాత వ్యక్తిగతంగా విజేతలకు ఎటువంటి ఆహ్వాన పత్రికలు పంపలేదు. ఆ ప్రకటనే ఆధారం చేసుకొని విజేతలు కొంతమంది పడరాని పాట్లు పడి నెల్లూరు వెళ్లారు. అయితే అక్కడ వారికి జరిగిన అవమానం పోటీల పదానికి తలవొంపు తెచ్చేదిగా ఉంది.
బెజవాడలోని ఒక సంస్థ నెల నెలా కార్యక్రమం నిర్వహించి కవితాగానం ఏర్పాటుచేస్తోంది. అయితే ఆ సంస్థలో కవులకన్నా వ్యాపారులే ఎక్కువ. మరి వారు పాడేది కవితా గానమా, వేలం పాటలో నిర్వాహకులకే తెలియాలి. దానికితోడు సాహితీ సదస్సు తరహాలో కాక చందా కట్టిన వారికి సత్కారాలు, టిఫిన్లు, భోజనాలు పెళ్లిలా నిర్వహిస్తూండడంతో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. అయితే అక్కడకు వచ్చేవారు భోజనాలకే వస్తున్నారా అన్న మీమాంస కూడా కలగక మానదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న తరహాలో అందరికీ ఆదర్శం అభ్యుదయంగా ఉంటామంటున్న మరో సంస్థ కూడా ఇదే బాట పట్టి వీరు కూడా నెలలో ఒక రోజు కార్యక్రమాలు చేస్తోంది. తీరా ఆ కార్యక్రమాలకు ఆ సంస్థ సభ్యులే అతిథులు, ప్రేక్షకులు. బయట వారితో వారికి సంబంధం ఉండదు. వారు చెప్పిందే వేదం. వారి చెప్పినట్లు నడిచేవారికే అక్కడ ఎర్ర తివాచీ.
ఎర్రజెండా పేదలకు అండ అంటూ ఎర్ర అంచు శాలువాలు కప్పే జన జీవనస్రవంతిలో మేమూ ఉన్నామంటూ ఉగాది సంబరాలను మూడు నక్షత్రాల హోటళ్లల్లో నిర్వహిస్తోంది. అయితే అక్కడ వచ్చే కవులకు మాత్రం ఉగాది సంభావన కాదు కదా తాంబూలమైనా ఇవ్వలేదు. మరి మూడు నక్షత్రాల హోటళ్లలో కార్యక్రమం అవసరమా? నిర్వాహకులకే తెలియాలి. అక్కడ కూడా తమ సంస్థ సభ్యులకే పెద్దపీట. ఇజాలు, వర్గాలు, వాదాలు, పేరుతో ఎవరికివారు వేరుకుంపట్లు పెట్టుకుంటూ కవి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరికొన్ని పత్రికలు కవితల పోటీలు పెట్టకుండానే తమ సంస్థ జీవిత చందా కట్టిన వారికి జీవిత సాఫల్య పురస్కారాలు, అవార్డులు ప్రకటిస్తున్నాయి. ఆ పోటీలు నిజమైన పోటీలని భావించి పంపే కవులకు మాత్రం తీరని దుఃఖం మిగులుతుంది. కొన్ని చిన్న పత్రికలు వాటి మనుగడ కోసం వ్యాపార లక్షణాలను అణువణువుగా ఒంటపట్టించుకోవడంతో వారి ఆశయాలు, ప్రయోజనాలు గాలిలో కలిసిపోతున్నాయి. అంతర్జాల పత్రికలు కూడా సాహిత్య పత్రికలకు తీసిపోవడంలేదు. ఇటీవల ఎన్‌ఆర్‌ఐలమంటూ కవితలు పంపాలంటూ ఓ అంతర్జాల పత్రిక పోటీలు నిర్వహించగా అనేకమంది వారి కవితలను పంపారు. పోటీలనంతరం మీకు బహుమతి వచ్చిందంటూ మెయిల్‌కు సందేశం పంపినా సదరు సంస్థలు విజేతల కవితలు ప్రచురించడం కాని, బహుమతి మొత్తం పంపడం కాని చేయకపోవడంతో వారు నిరుత్సాహానికి గురికావాల్సి వస్తోంది. పోటీల వ్యాపారం జోలికిపోకుండా అప్పుచేసైనా సరే తమ కవితలన్నీ సంకలనంగా తెచ్చుకోవడమే ఉత్తమ మార్గమని పలువురు కవులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని చిన్న పత్రికల యజమానులే పబ్లిషర్స్ అవతారం ఎత్తి అందినకాడికి దిగమింగుతున్నారు. పురస్కారాలు, అవార్డులు, పోటీల ప్రకటనలకు స్పందించే కవులూ జర జాగ్రత్త. కింద కండీషన్స్ అప్లై... అని చిన్న అక్షరాలనూ కూడా వెతుక్కుంటే మంచిది.
‘పోటీ’ - ఈ పదానికి చాలా విస్తృతార్థం ఉంది
english title:
bahumati
Date:
Monday, March 24, 2014