
కవిత్వమంటే
ఆకాశాన్ని దున్ని
ఆలోచనల్ని నాటడం
అమావాస్య చీకటిలో
నిండు చంద్రుడికి
జనం మధ్య పురుడు పోయడం
దొంగ మబ్బులపైకి
గురిచూసి రాయిసిరి
రాలుతున్న చినుకుల్ని
దోసిలి పట్టడం
పిడుగుల ముఖంమీద
పిడి గుద్దులు గుద్ది
ఉరుములు మెరుపులను
పరుగులు పెట్టించడం
జైలు గోడల మీద
చెరిగిపోని సంతకాలను చేసి
కొత్త పాఠాలకు
అక్షరాలను చెక్కడం
ఉరికొయ్యను ముద్దాడిన
అమరుల శిరస్సులను
కాగడాలుగా వెలిగించడం
తెగ్గోసిన నాలుకల
నిగ్గదీసె పాటలను
ఆయుధాలుగా సంధించడం
కవిత్వమంటే
కాలక్షేపం కబుర్లో
కాకమ్మ కథలో కాదు
కాలం కార్నియాని
కనురెప్పై మేల్కొల్పడం
రేపటి ఉదయం కోసం
గుడిసె గుమ్మం ముందు
త్రీడి సూర్యుడ్ని లాగిన్ చేయడం
మనిషి జెండాని
స్వేచ్ఛగా ఎగరేయడం
కవిత్వమంటే ఆకాశాన్ని దున్ని
english title:
kavithvamante
Date:
Monday, March 24, 2014