Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పుట్టపర్తి స్మృతులు.. శేఫాలికలు

$
0
0

పుట్టపర్తివారి శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా..
------------------------------------
జననం: 28-3-1914 మరణం: 1-9-1990
=============================
అది జనవరి నెల 1972వ సంవత్సరం. ఓ రోజు రాత్రి 12 గంటల సమయం. ఇంట్లో వాళ్లందరు మిద్దెపైన నిద్రపోతున్నారు. అంతా నిశ్శబ్దం. ఇంతలో... బయట గేటు తీసిన చప్పుడు. తరువాత కాసేపటికి తలుపు దబదబ కొట్టిన చప్పుడు. ‘ఎవరది?’ గట్టిగా అడిగాను. ‘టెలిగ్రాం’ అన్న సమాధానం. తలుపు వేసి పడసాల (హాలు)లోకి వచ్చి టెలిగ్రామ్ తెరిచాను. ‘కంగ్రాట్యులేషన్స్ ఫర్ కన్‌ఫరింగ్ పద్మశ్రీ -ఇందిరాగాంధీ’! నా గుండె వేగం హెచ్చింది. అయ్య (పుట్టపర్తి నారాయణాచార్యులు) గారికి పద్మశ్రీ ప్రకటించినందుకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంపిన శుభాకాంక్షల టెలిగ్రామ్ అది. ఆనందం... బ్రహ్మానందం... సహజంగానే నా కాళ్లు గాలిలో తేలిపోతున్నాయి. రెండు మూడు అంగల్లో మిద్దెపైకెక్కిపోయి అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్నట్టు, కదులుతున్న అయ్యవారిని ‘అయ్యా అయ్యా’ అంటూ లేపేశాను కుదుపుతూ! మామూలుగా అయితే వారి శాంత గంభీరమూర్తిని చూస్తే మాకందరికీ కాస్త భయమే! కానీ.. ఆ క్షణంలో అవేవీ గుర్తుకు రాలేదు నాకు. అయ్య చేయి పట్టుకుని వూపేస్తూ టెలిగ్రాం వచ్చిన సంగతి, ‘పద్మశ్రీ’ వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పి- వెంటనే అమ్మనూ లేపేశాను- ఈ శుభవార్త చెప్పడానికి! తను కూడా సంతోషంగా టెలిగ్రాం చదివి అయ్యగారికేసి ఆరాధనగా చూసింది. కానీ అయ్య- ‘అయ్యో! దీనికేనా ఇంత హడావుడిగా నిద్రలేపేశావు? పొద్దున్న చెబితే ఏం కొంపలు మునిగేవి?’ అంటూ విసుక్కుని నీళ్లిప్పించుకుని తాగి కాసేపు పచార్లు చేసి మళ్లీ మామూలుగా పడుకున్నారు.
సారస్వత లోకంలోకి అడుగుపెట్టిన క్షణంనుంచి ఎనె్నన్నో అనుభవాలనెదుర్కొన్న అయ్యగారు ఇలాంటి స్థితప్రజ్ఞను అలవరుచుకోవడం సహజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు!
1956-57 సంవత్సరాలలో కేరళ విశ్వవిద్యాలయంలో దక్షిణ భారత భాషలపై పట్టువున్నవారి కోసం సూరనాథ్ కుంజన్ పిళ్లైగారు గాలిస్తున్న సమయంలో తెలుగు పండితులు చాలామంది పుట్టపర్తివారి పేరునే సూచించారట! అలా 23-7-1954లో తిరువాన్కూర్‌నుండి విశ్వవిద్యాలయం తరఫున దక్షిణాది భాషల పదకోశ నిర్మాణ కమిటీలో పనిచేయమని ఆహ్వానం వస్తే ఆగస్టులో వెళ్లి చేరారట! ఒక పదం-అన్ని దక్షిణాది భాషలలో దానికున్న సమానార్ధక పదం-ఇప్పుడు పెద్ద పెద్ద గ్రంథాలయాలలోని గ్రంథాల వివరాలుంచే కప్‌బోర్డ్ లాంటి వాటిలో వరసగా కార్డులలో వ్రాసి వుంచే పద్ధతిని పాటించేవారట అక్కడ! పుట్టపర్తి వారి ప్రజ్ఞాపాటవాలను చూసి-అక్కడి వారికి కొంతమందికి కన్ను కుట్టిందట! కొన్ని రోజుల తరువాత అయ్యగారు కడపకు వెళ్లినపుడు వారు తయారుచేసిన వివరణలు ఉన్న కప్‌బోర్డులో అగ్గిపుల్ల గీచి వేసారట ఎవరో! అందులోవున్న కార్డులలో చాలాభాగం కాలిపోయింది. అయ్యగారు సెలవు తరువాత వెళ్లి చూస్తే-ఇదీ పరిస్థితి! బాగా కలత చెందిన వారు రెండురోజుల్లో తగలబడిపోయిన విషయమంతా తిరిగి తయారుచేశారట! రెండు రోజుల తరువాత కమిటీ మీటింగ్ వుంది మరి! ఈ సంఘటన తరువాత మరి అక్కడ ఉండ బుద్ధికాలేదట వారికి! రాజీనామా సమర్పించి వచ్చేసారు నిర్వేదంగా.
అంతకుముందు 1944 ప్రాంతాలలోఅనంతపురం ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు విద్యార్థులకు అయ్యగారంటే ప్రాణమట! శివతాండవాన్ని వ్రాతప్రతి రూపంగా వుండగానే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా వినే భాగ్యం కలిగిందట అప్పట్లో! అయ్య వ్రాసిన గ్రంథమే పాఠ్యాంశంగా వుండడంవల్ల వారే పాఠం చెప్పాలని విద్యార్థుల పట్టు. పుట్టపర్తి ఇంకా ట్యూటరే! లెక్చరర్ మాత్రమే పాఠం చెప్పాలని ప్రిన్సిపాల్ పంతం. విద్యార్థులు దీక్షలు పూనే వరకూ వెళ్లింది పరిస్థితి. ‘పిల్లల్ని తనపైకి ఉసికొల్పుతున్నారు పుట్టపర్తి’ అని ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయానికి అయ్యగారే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెనక్కి వచ్చేశారట!
అయ్యగారిలో జన్మతః అబ్బిన సంస్కృతాంధ్రాలలో అభినివేశం, పిట్ దొరసాని (పెనుగొండ సబ్ కలెక్టర్ సతీమణి) శిష్యరికం వల్ల కలిగిన ఆంగ్ల సాహిత్య అభిమానం, దూరపు బంధువైనా ‘పిన్నయ్య’గా అయ్యగారు పిలుచుకునే రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారి సౌజన్యంతో మరి కొంత స్వయంకృషి వల్ల శౌరసేని, మాగథి, అర్ధమాగథి, పైశాచి ఇత్యాది ప్రాకృత భాషా సాహిత్యాలలో ప్రావీణ్యం, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెరగడంవల్ల తమిళ, కన్నడ భాషలలో అధికారం-ఇవన్నీ అయ్యగారికి బాల్యానే్న అందివచ్చిన అపురూప వరాలు! తాతగారు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు సాయంత్రాలు గుడిలో పురాణ కాలక్షేపం చేసేవారట! కుమారుడు పుట్టపర్తి నారాయణ భారత, భాగవత పద్యాలు చదువుతుంటే కథాభాగం తాతగారు కొనసాగించేవారు! ఇలాంటి వాతావరణంలో పెరిగిన అయ్యగారి ప్రప్రథమ రచన ‘పెనుగొండ లక్ష్మి’ ఆయన 14వ సంవత్సరంలోనే వెలుగు చూసిందంటే ఆశ్చర్యం ఏముంది? అంతేనా ‘రంజకం మహాలక్ష్ముమ్మ’ అనే నాట్య కళా ప్రవీణురాలివద్ద నాట్యం, పక్కా హనుమంతాచార్యుల వారి వద్ద సంగీతాభ్యాసం ఇవి కూడా బంగారానికి తావి అబ్బినట్టు అందివచ్చాయి వారికి! సంగీతం, సాహిత్యం, నాట్యం ఈ మూడు కళల సమాహారంగా ‘శివతాండవం’ అయ్యగారి కీర్తిని అజరామరంగా నిలిపిందంటే దానికి పునాది బాల్యానే్న పడింది.
28-2-1935న ధన్నవాడ కనకవల్లి (మా అమ్మ)తో వివాహమై ప్రొద్దుటూరుకు వచ్చి, అక్కడి అమ్మవారి శాలలో సంస్కృతోపాధ్యాయుడైనారు. అగస్తేశ్వరస్వామికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడే ‘శివతాండవమ్’ గేయాకృతి దాల్చింది. ఈ ‘శివతాండవమ్’ ఒక రసావేశ జలపాతం. ఈ గేయకావ్యం - కేవలం ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశం మొత్తం బహుళ ప్రచారం పొందింది. ‘ఇతర భాషల వారు సైతం ఇందులోని శబ్ద సమ్మేళన శక్తి ముందు మోకరిల్లేవారని’ అయ్యగారు పలు సందర్భాల్లో చెప్పేవారు. ఎన్నో వందల వేదికలమీద ఉద్ధృతమైన ఆవేశంతో నాట్యాభినయంతోపాటు వారు గానం చేస్తుంటే నిశే్చష్టంగా నిరుత్తరంగా సంభ్రమాశ్చర్య ముగ్ధ హృదయులయ్యారు ప్రేక్షకులు! ఎన్నో అభినయాలు, ఆంగిక విన్యాసాలు- దీనికి తోడు నాట్య సంగీత రహస్యాల నిధులు! క్షణక్షణానికీ ఊపిరి సలుపుకోనివ్వక జలపాతాల్లా విరుచుకుపడే నుడికారపు సొగసులు! ఎక్కడికి వెళ్లినా విషయం ఏదయినా సభ చివర ‘శివతాండవ’ గానం అనివార్యం. అందులోని ఆకర్షణ అంతటిది మరి! అందుకే దానిని ఒక సహృదయ విమర్శకుడు ‘న్యూరో పొయిట్రీ’గా అభివర్ణించారు. శివతాండవ పఠనం, పుట్టపర్తివారి గళంలో వినడమే గొప్ప అదృష్టంగా ఆనాటి సాహితీ పిపాసులు భావించేవారు!
అయ్య రచనా వ్యాసంగమంతా పై గదిలోనే జరిగేది. అక్కడున్న చెక్క బీరువాలలో కాళిదాసు మొదలు కార్ల్‌మార్క్స్ వరకూ అందరూ కొలువుతీరి వుండేవాళ్లు! తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ప్రాకృత, ఆంగ్ల, రష్యన్ గ్రంథాలెన్నో అయ్య గారి స్పర్శకోసం తహతహలాడుతున్నట్టనిపించేవి! అయ్య వ్రాతబల్లకు దగ్గరగా చిన్న అల్మారాలో తాను సొంతంగా రాసుకున్న వివిధ భాషా పదకోశాలూ, కొటేషన్స్ ఈ నోటు పుస్తకాలలో అందంగా చెక్కినట్లున్న వ్రాతలో ఎప్పుడు రాసుకునేవారో అర్ధమే అయ్యేది కాదు. జీవితంలో ఏ ఒక్క నిముషాన్నీ వృధా చేసుకున్నట్టనిపించేది కాదు. వ్రాత బల్లకు దగ్గరగా, నీలం సిరా, ఆకుపచ్చ సిరా, ఎర్ర సిరా బుడ్డీలు, వాటిలో ముంచి వ్రాసుకునే పాళీల పెన్నులు! ఏకాగ్ర చిత్తంతో వ్రాతబల్ల దగ్గరున్న అయ్యగారి దగ్గరకు హఠాత్తుగా ఎవరైనా వెళ్తే ఉలిక్కిపడిపోయేవారు. అంతగా తన పనిలో లీనమైపోయి వుండేవారన్న మాట!
జమ్మలమడక మాధవరాయ శర్మగారి ఇంట్లో దిగేవాళ్లం-గుంటూరు, విజయవాడవైపు అయ్య సభలు వున్నప్పుడల్లా. గుంటూరు మిరపకాయలు, గోంగూర అయ్యకిష్టం. అంతేకాదు అక్కడి పొగాకు చుట్టలు కూడానండోయ్! అయ్యకు గొంతులో కఫం వల్ల పొడిదగ్గు బాగా వచ్చేది. దానికి ‘పొగాకు చుట్టలు మంచివి’ అని ఎవరో చెప్పారుట! పొగాకును చుట్టలుగా చుట్టడమే ఒక కళ. అమ్మకు ఈ విద్య త్వరలోనే అలవడింది. అప్పట్లో అయ్య వ్రాతపనులు ఇంటి పనులతోపాటు ఈ పనీ చేసేది ఓపిగ్గా మా అమ్మ! కొన్నిరోజుల తరువాత చుట్టల వాసన పడక ఇల్లంతా ‘ఆ ఘుమఘుమలతో’ నిండిపోవడంలోని ఇబ్బందిని గమనించి అయ్యే మానుకున్నారు.
అన్నిటికన్నా సరదా ఆట గుర్రప్పందాలు. అప్పట్లో కడప ‘అప్పు అయ్యర్ హోటల్’ దగ్గరో ఏజెంట్ ఉండేవాడు. నిర్ణీత సమయంలో ‘్ఫలానా గుర్రంపై నిర్ణయించిన మొత్తం టికెట్ తీసుకునేవాళ్లు’ ఈ గుర్రప్పందాల వ్యామోహం వుండేవాళ్లు! మద్రాస్‌లో జరిగే ఈ పందాలకు కడపలో టికెట్లు అమ్ముతారన్నమాట! రఘోత్తమరావు సారు జ్యోతిష్యంలో అందెవేసిన చేయి. అయ్య జాతకాన్ని బహుకోణంలో ఎప్పటికప్పుడు విశే్లషించడమే కాకుండా గుర్రప్పందాలలో పాల్గొనే గుర్రాలను బట్టి వాటి గెలుపు ఓటముల అవకాశాలను అంచనా వేయటమూ, దానిని బట్టి అయ్య, అప్పుడప్పుడు చేతులు కాల్చుకోవడమూ జరుగుతుండేది. పదైనా, పరకైనా పోవడమే కానీ కాస్తో కూస్తో కలిసి వచ్చిన దాఖలాలే వుండేవి కావు. ‘అమ్మ ఈ వ్యవహారమంతా కొన్నిరోజులు భరించింది. కానీ ఇలా అయితే ఇల్లు గుల్లవుతుందని భయపడి ఒకరోజు నిరాహార దీక్ష మొదలుపెట్టేసరికి అయ్య నెమ్మది నెమ్మదిగా తన ఈ మోజును తగ్గించుకున్నారు. ఇవన్నీ ఇలా వచ్చి అలా మాయమైన అలవాట్లే కానీ నిరంతమూ అయ్యనంటిపెట్టుకునే వున్నది-వాగ్దేవి ఉపాసనే!
ఏమాటకామాటే చెప్పుకోవాలి. అయ్య సాహితీ సామ్రాజ్యం అనంతంగా విస్తరించింది. కవిగా, విమర్శకునిగా వాగ్గేయకారునిగా, వ్యాఖ్యాతగా, అనువాదకునిగా అయ్యను విశే్లషించాలంటే అటువైపు వారు సైతం పదునాలుగు భాషలలో కౌశలాన్ని కలిగి ఉండాలని ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారన్న మాటలు అక్షర సత్యాలు. ‘తానింతటి పండితుడినని గానీ, కవిననిగానీ ఎలాంటి ధిషణాహంకారానికి ఏనాడూ వారు లోనుకాలేదు. తనను తాను నిత్య విద్యార్థిగానే పరిగణించుకునేవారాయన! అరవై ఏళ్ల వయసులోనూ, ఎదురింటి భాస్కర భట్ల కృష్ణమూర్తి (ఆకాశవాణి కడపలో నిలయ కళాకారుడు) వద్ద మృదంగ జతులు నేర్చుకునేవారు! ఎన్ని భాషలు నేర్చినా, ఉర్దు లిపిని వ్రాయడం చదవడం నేర్వలేకపోయానని తరచూ అంటూ వుండేవారు! తన డెభ్భై ఏళ్ల వయసులో పలకపై ఉర్దూ అక్షరాలను వ్రాయడం, ఉర్దూ పుస్తకాలను చదివే ప్రయత్నం చేసే అయ్యగారిని చూస్తుంటే ఆశ్చర్యం వేసేది నాకు!
ఇన్ని అర్హతలున్నా నిరాడంబరంగా వుండడమే ఆయనకు చాలా ఇష్టం! కాస్త నేర్చితే చాలు అందలాలపై ఎక్కేవారిని చూస్తూ నిరాసక్తతతో నవ్వేవారాయన! ఆడంబరానికీ, అలంకార ప్రియత్వానికీ పదవులపై వ్యామోసానికీ ఆమడదూరంలో వుండేవారు పుట్టపర్తివారు. ముతక పంచె, జుబ్బా..ఇదే వారి వేషధారణ! మా ఇంట్లో మా అమ్మ పట్టుబట్టి కొనిన రెండు మూడు చెక్క కుర్చీలు, టేబుళ్లే ఫర్నిచర్! ఎవరొచ్చినా అవే ఆసనాలు. ఎక్కువమంది వస్తే చాపలు ఉండనే ఉన్నాయి. అయ్య తన గదిలో మిద్దెపైన వ్రాసుకుంటున్నారంటే చనువుగా అక్కడికే వెళ్లి వారితో మాట్లాడేవారు శ్రీయుతులు రాచమల్లు రామచంద్రారెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, వై.సి.వి.రెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి, జానమద్ది, బంగోరె, రాజన్నకవి, వేలమూరి ప్రసాదరావు... ఇలాంటి పెద్దలంతా! వాళ్లంతా అయ్యగారితోపాటు చాపలపైన కూర్చునేవారు. వాళ్లొచ్చినప్పుడు తన దగ్గరనున్న గంట మోగించేవారు క్రింద అమ్మకు వినపడేలా. ఇక వచ్చినవారికి కాఫీలు తయారుచేస్తే-పైకి అందించేవంతు నాది. అప్పటికి (1960-1970) మా అక్కయ్యలు ముగ్గురికీ పెళ్లిళ్లయిపోయాయి మరి. నేనూ, మా చిన్న చెల్లెలు రాధ.. మేమిద్దరమే ఇలాంటి పనులకు పలికేది. అప్పటికే అయ్య లబ్ధప్రతిష్టులు కావడంవల్ల- నాకూ ఈ పనులు చేయడంలో ఆనందమే ఆనందం. కాఫీలందించి అక్కడే కూర్చునేదాన్ని వాళ్ల సంభాషణలు వింటూ.
నేను స్వయంగా చూసిన సంగతులు... సంఘటనలూ బోలెడు. కంచి కామకోటి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి 1965 ప్రాంతాలలో ప్రొద్దుటూరు పట్టణానికి విచ్చేసారు. అప్పుడు వేదాంత చర్చలు శాస్త్ర చర్చలు విరివిగా జరిగాయి. విచ్చేసిన పండితవర్యులందరినీ యధోరీతి స్వామివారు సత్కరించారు. అయ్యగారికి శాలువ ఇవ్వలేదు. సత్కారమూ జరగలేదు. పరమాచార్యులవారు పట్టణం నుండి వెళ్లిపోయే రోజు.. పండితులంతా తమకిచ్చిన శాలువాలు కప్పుకుని ముందు వరసల్లో కూర్చుని ఉన్నారు. వెనకవైపుకూర్చుని వున్న పుట్టపర్తి వారిని పరమాచార్య సైగచేసి పిలిచారు. దగ్గరికి వచ్చిన తరువాత ‘‘ముప్ఫై సంవత్సరాల క్రితం కాబోలు తిరుపతిలో నిన్ను ఆశీర్వదించాం గుర్తుందా?’’ అని అడిగారు. అయ్య ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ‘‘ఈరోజు నా మాట నిజమైంది కదూ!’’ అంటూ అక్కడి నటరాజస్వామిపై కప్పివుంచిన బంగారు జరీ శాలువ తెప్పించి అయ్యగారికి కప్పి ఆశీర్వదించారు ఆ నడిచే దేవుడు. మైసూరు మహారాజా వారిచ్చిన బంగారు జరీ శాలువ అది! అపురూపమైన ఈ సన్మానం అయ్యగారికి జరగడం చూసి అప్పటిదాకా చెవులు కొరుక్కున్న పండితుల ముఖాలు మాడిపోయాయి.
అయ్యగారి ఆత్మీయుల్లో దేవులపల్లి రామానుజరావుగారు ప్రముఖులు. నిత్యమూ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. దాశరధి అయ్యను ‘అన్నయ్యా’ అని పిలిచి ఆలింగనం చేసుకుంటే, సినారె గారిని ‘ఒరే నారాయణరెడ్డీ’ అని అయ్య ప్రేమతో పిలిచేవారు. శ్రీయుత డాక్టర్ దివాకర్ల వెంకటావధాని, జమ్మలమడక, డా. జి.ఎన్.రెడ్డి, డా. రామమూర్తి, గౌరిపెద్ది.. వీరంతా అయ్యకు ఆప్తులు. రాళ్లపల్లి వారినీ, వేటూరి వారినీ చూస్తే అయ్యకు అపారమైన గౌరవం. వేటూరి వారు ఒక సందర్భంలో-‘ఇంత చిన్న వయసులో ఇన్ని భాషలలో అఖండ శక్తిని సంపాదించిన ఈ యువకుడు అశేష ప్రతిభాశాలి, ఇతని యోగ్యతలు మన యూనివర్సిటీలవారు వాడుకొనవలసి వున్నది. కానీ వాడుకొందురను విశ్వాసము నాకు లేదు- అని వారన్నట్టు చదివానెక్కడో! అలాగే జరిగింది మరి! చిన్ననాడు వ్రాసిన ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యమే తనకు పాఠ్య గ్రంథంగా, విద్వాన్‌లో వుండడం-ఏ కవి జీవితంలోనైనా మళ్లీ జరుగుతుందా? ‘పారడైజ్ లాస్ట్’ను, తులసీ రామాయణాన్ని ఆసాంతం కంఠతా పట్టడం ఎవరైనా చేస్తారా? తిరువాన్కూరు, ఢిల్లీలాంటి మహానగరాల్లో బంగారంలాంటి ఉద్యోగాలను ఆత్మాభిమానంతో త్యజించి ఎక్కడో కడపలోని రామకృష్ణ హైస్కూల్‌లోని మర్రిచెట్టు కింద నెలకు మూడువందల బడిపంతులు ఉద్యోగాన్ని కోరి వరిస్తారా ఎవరైనా? ఇన్ని భాషలు నేర్చి, సాహిత్యం ప్రక్రియలన్నింటిలోనూ నూటికి పైగా రచనలు చేసి, ‘సరస్వతీ ప్రియపుత్రుని’గా వినుతికెక్కినా ‘అహమేవ పండితః’ అన్న భావన నుండి ‘నాహం పండితః’ అనే స్థాయికి వచ్చానని వినయంగా చెప్పడం ఎవరికైనా సాధ్యమా?

పుట్టపర్తివారి శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా..
english title: 
puttaparthi
author: 
- పుట్టపర్తి నాగ పద్మిని, 9502694138

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>