సదాశివపేట, మార్చి 24: ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్భయంగా పట్టపగలే బ్యాంకు నుంచి డ్రా చేసుకుని తరలిస్తున్న 20 లక్షల రూపాయలను పేట పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పట్టుకుని స్వాధీనపర్చుకున్నారు. ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ నాయుడు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని వెంకటేశ్వర మిల్లుకు సంబంధించిన గోపాల్ మిట్టల్ అనే వ్యక్తి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో 20 లక్షల రూపాయలను డ్రా చేసుకుని అతని స్వంత వాహనంలో తరలిస్తున్నాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా పట్టణ పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తూ గోపాల్ మిట్టల్ వాహనాన్ని కూడా సోదా చేసారు. కారులో 20 లక్షల రూపాయలు ఉండటంతో ఎక్కడవని నిలదీసారు. ఈ డబ్బులు మిల్లులో పని చేసే వారికి, కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని తీసుకువెళుతున్నట్లు సమాధానం ఇచ్చారు. 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బులు తరలించకూడదని, ఒకవేళ తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి వస్తే అందుకు తగిన ఆధారాలను వెంటబెట్టుకోవాలని ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లా కలెక్టర్ పలుమార్లు పత్రికలు, మీడియా ద్వారా వెల్లడించారని, అయినా నిబంధనలను ఉల్లంఘించి డబ్బులు తరలించడమేమిటని ఇన్స్‌పెక్టర్ ప్రశ్నించారు. సదరు వ్యక్తి బ్యాంకులో డ్రా చేసినట్లు కౌంటర్‌పైల్ చూపించినా అది ఆధారం కాదని, ముందస్తుగానే సమాచారం ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని ఉంటే బాగుండేదని పేర్కొంటూ స్వాధీనం చేసుకున్న సొమ్మును ఆదాయ పన్ను శాఖలో జమ చేస్తామని చెప్పారు. పారిశ్రామికంగా ఎదిగిన సదాశివపేట ప్రాంతంలో ఏ పరిశ్రమ వారైనా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకువెళ్లాల్సి వచ్చినా, జమ చేయడానికి తీసుకువెళుతున్న ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుబంధంగా డబ్బులను స్వాధీనం చేసుకుంటామని ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ నాయుడు హెచ్చరించారు. అదే విధంగా అక్రమ మద్యం, ఇతర ఆకర్షణీయమైన వస్తువులను ఒకటికి మించి ఎక్కువగా తరలిస్తే వాటిని కూడా పట్టుకుంటామని అన్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్భయంగా పట్టపగలే బ్యాంకు నుంచి డ్రా చేసుకుని తరలిస్తున్న 20 లక్షల
english title:
a
Date:
Monday, March 24, 2014