గజ్వేల్, మార్చి 24: తెలంగాణ ప్రజల పాలిట దేవుడు, టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్‌ను గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత, డిసిసిబి మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు మద్ది రాజిరెడ్డి, నేతలు వేణుగోపాల్‌రెడ్డి, గాడిపల్లి భాస్కర్, చిన్నా, నంగునూరి సత్యనారాయణ, రమేశ్‌గౌడ్‌లు పేర్కొన్నారు. గజ్వేల్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు ఫనంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టిన ఫలితంగానే దిగివచ్చిన కేంద్రం విభజన ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా గజ్వేల్ మున్సిపాలిటి లో టిఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక టిడిపి నేత ప్రతాప్‌రెడ్డి తమ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గాడిపల్లి భాస్కర్‌పై ఆరోపణలు చేస్తుండగా నిరూపించాలని డిమాండ్ చేశారు. అయితే గజ్వేల్‌లో మెజారిటీ మున్సిపల్ అభ్యర్థులు విజయపథంలో కొనసాగుతున్నారని ఈర్ష్యతో విమర్శలు చేయడం సరికాదని ఎద్దేవా చేయగా, టిడిపి, కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విమర్శించారు. ఈ సమావేశంలో బిసిసెల్ మండల అధ్యక్షులు పిట్ల రాములు, నేతలు ఆకుల దేవేందర్, శివకుమార్, శ్రీనివాస్, అహ్మద్, నిజాంలు పాల్గొన్నారు.
పేట ఠాణా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
సదాశివపేట, మార్చి 24: మున్సిపల్, సంస్థాగత ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకుని శాంతిభద్రతలకు ఏలాంటి భంగం వాటిల్లకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అధికారి షెముషి బాజ్‌పాయ్ సూచించారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ఎస్పీ సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 20 లక్షల రూపాయలను ఏలాంటి ఆధారాలు లేకుండా తరలించిన విషయమై స్థానిక ఎస్‌హెచ్‌ఓ (ఇన్స్‌పెక్టర్) శ్రీనివాసులు నాయుడును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సదాశివపేట పట్టణం, మండలం గుండా 65వ నంబరు జాతీయ రహదారి వెళుతుందని, ఈ దారి గుండా మహారాష్ట్ర, కర్నాటకలకు వెళుతుంటారని, ఎవరు ఎక్కడి నుంచి ఏ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తారో తెలియదని అందుకుగాను పోలీసు సిబ్బంది జాగ్రతగా ఉండాలని సూచించారు. అక్రమంగా మద్యం, ఇతర సామాగ్రిని తరలించడం, పెద్ద మొత్తంలో డబ్బులు తరలించడం లాంటి కార్యకలాపాలపై నిశితంగా పరిశీలించాలన్నారు. వాహనాల తనిఖీలను పకడ్బంధీగా నిర్వహించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఎన్నికల విధులతో పాటు శాంతి భద్రతలపై కూడా అంతే దృష్టిని నిలుపాలని సూచించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసనమైనప్పుడు అదనపు బలగాలను సైతం పంపుతామని సూచించారు.
30లోగా ఓటు నమోదు చేసుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, మార్చి 24: ఓటరుగా నమోదుకాని అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా తమ ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ తెలిపారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఓటుహక్కు ఉన్నదా లేదా అనే విషయాన్ని 9246280027 అనే సెల్‌ఫోన్‌కు ఓటు స్పేస్ ఓటర్ ఐడి కార్డు నంబర్ రాసి మెస్సేజ్ చేయాలని ఆమె తెలిపారు. ఈ మెస్సేజ్ పంపితే మీ ఓటు ఉన్నది లేనిది తెలుస్తుందని అన్నారు. ఓటు లేనట్లుగా మెస్సేజ్ వస్తే ఫార్మ్-6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.