
* మరణాన్ని గురించిముందుగా తెలుసుకోగలమంటారా? - కె. వెంకట్రావు, పామర్రు
ఇది భగవంతుడి స్వీయరహస్యాలలో ఒకటి. కొన్ని రకాల యోగ సాధనల వల్ల ఈ జ్ఞానం ఒకప్పుడు అప్రయత్నంగా లభించవచ్చు. గానీ, దీని కోసం కృషి చేయవద్దని పెద్దల బోధ.
* ఏకాగ్రత యొక్క ధ్యానానికి గల తేడా ఏమిటి? - సుబ్రహ్మణ్యం, అనంతపురం
ఏకాగ్రత యొక్క పరిపాక దశే ధ్యానం
* మహాభారతంలో కర్ణుడంటే ఇంద్రుడికి ఎందుకు గిట్టదు? అతన్ని ప్రతి సంఘటనలోను శాపగ్రస్తుణ్ణి చేస్తూ వుంటాడు ఎందువలన? - సందేహాలరావు, హైద్రాబాదు
కర్ణుడు వ్యక్తిగతంగా గొప్ప సాధకుడు. కానీ సామాజిక జీవనంలో అధర్మ పక్షాన్ని ఆశ్రయించినవాడు. అందువల్ల అతని సాధన అధర్మ సంకరంగా సాగుతూ వుండుంది. సాధనలో ఒక స్థాయిని అందుకున్న వారికి పరీక్షించి, పరిశీలించి చూడటం దేవేంద్రుడి విధి నిర్వహణలో ఒక భాగం. ఆ పరిశీలనలో నెగ్గిన వారికి సాయం చేయటం, ఓడినవారికి తపస్సులు ప్రజాకంటకం కాకుండా వుండటం కోసం వారికి శిక్షలు విధిస్తూ వుండటం దేవేంద్రుడి కర్తవ్యంలో అంతర్భాగం. అందువల్లే ఆయన కర్ణుడి విషయంలో కొన్ని సార్ల కఠినంగా వ్యవహరించవలసి వచ్చింది.
* పరమాత్మ నుండి ఆత్మ రావటానికి కారణమేమిటి? నీరజ, ఘటకేసర్
పరమాత్మ నుంచి జీవాత్మలు సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లు వచ్చాయి. కిరణాలన్నీ కలిపితే సూర్యుడైనట్లుగా చరాచర జీవాత్మలన్నీ కలిపితే - అదే విశ్వరూపం. అదే పరమాత్మ. కనుక సూర్యుడికి కిరణాలెంత సహజమో, పరమాత్మకు జీవాత్మలు అంత సహజము. సహజ సిద్ధమైన దానికిప్రత్యేక కారణం వుండదు. ఐతే, జీవుల అనాది జన్మపరంపరలోని కర్మల వైచిత్రి వల్ల ఒక్కొక్క జీవి ఒక్కొక్క విచిత్రమైన రీతిలో ప్రవర్తించి చివరికి పరమాత్మలోనే చేరుతుంది. దీన్ని గురించి మరింత వివరం తెలియాలంటే శ్రీ శంకరాచార్యుల ప్రకరణ గ్రంథాలు చదవండి.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org