
పుడిసెడు జలము బిల్వ దళంతో శివుడు సంతుష్టుడవుతాడు. దాన జప హోమాదులకంటే, ఎక్కువ తృప్తి కలిగించేది శివపూజ అభిషేకం. భక్తితో శివునికి అభిషేకం చేస్తే అభీష్టసిద్ధి అవుతుంది. మానవులే కాక, ఏ ప్రాణియైన, శివలింగాభిషేకంవల్ల, సర్వపాప విముక్తుడయి, పరమపదం పొందుతాడు. మృణ్మయ, దారు, శిలలతో దేనితోనైనా శివాలయం నిర్మించవచ్చు. మట్టితో కట్టిన ఆలయం కంటే దారువుతో నిర్మించిన ఆలయం, దారువుతో నిర్మించిన ఆలయంకంటే శిలతో నిర్మించిన ఆలయం, ఒకదానికంటే ఒకటి ద్విగుణీకృతమైన ఫలాన్నిస్తుంది. శిథిలమైన శివాలయం గట్టిపరచిన సర్వదోష నివారణ అవుతుంది. శివాలయ దర్శనం సర్వులకు అభీష్ట్ఫలదం.
సర్వాకారుడు, నిరాకారుడు, జ్ఞానజ్ఞేయుడు, పార్వతీపతియైన సదాశివునికంటే పరతరమైనదేదియు లేదు. కామ క్రోధాది, అరిషడ్వర్గముల జయించి, అనహంకారలైన యోగులు, జ్ఞానయోగంతో సాధువులారాధన చేస్తున్నారు.
కల్మషహీనుడైన వానికి మాత్రమే, శంకరునియందు భక్త్భివమేర్పడుతుంది. శంకర స్తుతి శివసేవ, ఈశ్వర దర్శనం, మృత్యుంజయ జ్ఞానం ఇవి ధన్యాత్ములకే లభ్యములయ్యే మహా విషయాలు. పురాణ ప్రసిద్ధులైన శోదశ మహారాజులు శివపూజ చేసి ధన్యులయారు. ధన్యాత్ములకే ఇది లభ్యము.
అపారమైన ఈ సంసారంలో, శంకరార్చనం ఒకటే సారమైనది. శివారాధనం సంసార గ్రంథిని నిర్మూలంగావిచ్ఛేదనం చేసే సాధనం.
కంఠలో ప్రాణముండగా శతికంఠనుపూజ చేయాలి. భగవదారాధన చేసుకొందామని వాయిదా వేయకూడదు. నిరంతరం శివార్చన ఏమరకుండా చేయాలి.
ఎవని ఇంటి చింతమణి వున్నదో ఎవరి కులంలో కల్పవల్లి ఉన్నదో ఎవడు ధనాధ్యక్షుడో, వాడు శంకరుని, కింకరుడు అని భావించాలి. శివభక్తులను శక్రువులు హింసించలేరు. అహింస, అస్తేయమ, దయ, భూతానుగ్రహము, ఈ లక్షణాలు వున్నవాడు శంకరునకిష్టము. ఎవరైతే తల్లిదండ్రులను గురువును పూజిస్తారో వారంటే శంకరునకు ఇష్టము. శోదశ మహా దానములు దేను, దశక దానములు ఎటువంటి ఫలాన్నిస్తాయో, శివపూజ అటువంటి ఫలితం ప్రసాదిస్తుంది. అణిమ మహిమ ప్రాప్తి, ప్రాకామ్యము, లఘిమ, ఈశత్వం అనే అష్టసిద్ధులు ఈశ్వరానగ్రహం వల్ల కలుగుతాయి.
పితరులనుద్దేశించి అష్టోత్తరంలో పూజ చేస్తే పితరులు నరకం నుండి రక్షింపబడతారు. దధి అభిషేకంవల్ల, దురితాలు పోతాయి. ఘృతాభిషేకంవల్ల, రుద్రలోకం పొందుతారు. తేనె చెరుకురసం పుష్పోదకంతో అభిషేకం చేస్తే చంద్రలోకంలో నివాసముంటుంది. శివలింగాన్ని రత్నోదకంలో అభిషేకం చేస్తే, ఇంద్ర పదవి లభిస్తుంది. శీతోదకంలో అభిషేకం చేసిన కుబేర ప్రాప్తి, కుంకుమ సలితంతో అభిషేకించిన శ్రీ లాభం కలుగుతుంది. తెల్లని భస్మంలో అభిషేకం చేసిన, సోమ మండలంలో శివునిగా ఆరాధింపబడతాడు.
శివాలయ ప్రాంగణము శుభ్రం చేసిన దైవత్వం పొందుతాడు. ఆలయ మార్గాన్ని అలంకరించిన పాపం పటాపంచలవుతుంది. శివుని ధూపంలో పూజించిన రోగ నివారణయగును. దేవుని సన్నిధి దీపం పెట్టిన, ప్రజ్ఞ ఆయుస్సు, సంపద కల్గును. షడ్రసోపేతమైన నైవేద్యం పెట్టిన మహాఫలం లభించును. భక్తి పాటలతో నృత్యంతో ఉపచారం చేసిన శివుడు సంతోషపడతాడు. వీటి అన్నింటికి సంతుష్టుడై పరమేశ్వరుడు అభీష్టాలు తీరుస్తాడు.
మాఘమాసం అర్థరాత్రి వచ్చే చతుర్థశి మహాశివరాత్రి అంటారు. ఇది శివునికి ఎంతో ఇష్టం. ఈ రోజే శివుడు తేజోమయంలో లింగాకారంలో పుట్టిన రోజు. ప్రతినెల బహుళ చతుర్దశి మాస శివరాత్రి అంటారు. ఈ రోజు శివునికి ఇష్టమైన రోజు. ఈ రోజు శివుని అభిషేకించిన మహాపుణ్యఫలము. చంద్రుని శిగలో ధరించి చంద్రశేఖరుడయ్యాడు. శివుని త్రిశూము సత్వ రజస్తమోగుణములను సూచించును. మెడలో పాములు ఇంద్రియ నిగ్రహమునకు గుర్తు. జగతికంతటికి ఆకలి తీర్చే అన్నపూర్ణ సాక్షాత్తు ధర్మపత్ని అయిన, ఆయన మాత్రం ఆదిభిక్షువే.