మాజీ కేంద్రమంత్రి జస్వంత్ సింగ్ విషయంలో భారతీయ జనతాపార్టీ ఘోరమైన తప్పిదాన్ని చేసిందన్నది నిరాకరించలేని నిజం...ఈ తప్పిదం, ప్రచారం జరుగుతున్నట్టుగా, ఇప్పుడు జరగలేదు! 2010 జూన్ 24వ తేదీన జరిగిపోయింది! ఇప్పుడు జస్వంత్‌సింగ్ రాజస్థాన్‌లోని బర్మార్ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేయకపోవడంవల్ల సంస్థకు కాని సమాజానికి కాని జరగబోయే నష్టం లేదు! అందువల్ల ఆయనకు మళ్లీ టిక్కెట్టు ఇవ్వకపోవడం ద్వారా భాజపా అధిష్ఠానం చేసిన తప్పిదం లేదు! ఆయన ఎన్నికలలో పోటీ చేయకపోవడంవల్ల ‘‘ఏర్పడబోయే భాజపా ప్రభుత్వం’’లో జస్వంత్‌సింగ్ మళ్లీ మంత్రిగా పనిచేసే అవకాశం లేదు! అందువల్ల విదేశాంగ మంత్రి హోదాలోనో మరో మంత్రిగానో, బొంగురు గొంతుతో అమెరికా యాసతో జస్వంత్ సింగ్ పదే పదే ఆవిష్కరించే ఆంగ్ల ప్రసంగాలను వినవలసిన అగత్యం కూడ దేశ ప్రజలకు ఉండదు! నిజానికి ‘అధిష్ఠానం’ జస్వంత్ సింగ్‌ను మళ్లీ నిలబెట్టడం లేదన్న వార్త పార్టీలోని జాతీయ నిష్ఠ ఉన్న వారికి మాత్రమే కాదు, దేశ ప్రజలకు సైతం హర్షం కలిగించిన పరిణామం! కానీ భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం 2010 జూన్‌లో జస్వంత్‌సింగ్‌ను మళ్లీ పార్టీలో చేర్చుకొనడం మాత్రం ఘోరమైన తప్పిదం. జాతీయతా నిష్ఠ, సాంస్కృతిక జాతీయవాదం వంటివి భాజపా వౌలిక సిద్ధాంతాలు! ఈ సాంస్కృతిక జాతీయ వాదానికి జస్వంత్‌సింగ్ తన వ్రాతల ద్వారా తీవ్రమైన విఘాతం కలిగించారు! ఇలా విఘాతం కలిగించినందుకే ఆయనను 2009 ఆగస్టు 20న భాజపా నుండి బహిష్కరించారు!! దేశాన్ని 1947లో ముక్కలు చేసిన భౌతిక, బౌద్దిక, రాజకీయ సాంస్కృతిక బీభత్సకారుడు మహమ్మదాలీ జిన్నా! అలాంటి జిన్నా దేశ విభజనకు ప్రధాన కారకుడు కాదన్న కృత్రిమ సిద్ధాంతాన్ని కనిపెట్టడం ద్వారా జస్వంత్ ఈ దేశ ప్రజలపట్ల విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాడు! తన కృత్రిమ సిద్ధాంతాన్ని ‘నిరూపించడానికై’ జస్వంత్ సింగ్ రచించిన ‘బౌద్ధిక బీభత్స గ్రంథం’ ‘జిన్నా, ఇండియా, పార్టీషన్, ఇండిపెండెన్స్’-‘జిన్నా, భారత్, విభజన, స్వాతంత్య్రం’- 2009 ఆగస్టు 17న న్యూఢిల్లీలో విడుదలైంది! ఆవిష్కరణ సభకు పాకిస్తాన్ రాయబారి షహీద్ మాలిక్‌ను పిలిపించి వేదిక కల్పించడం జాతికి కలిగి ఉన్న ‘గాయం’పై జస్వంత్ సింగ్ చల్లిన ‘కారం’! పాకిస్తానీ హై కమిషనర్‌కు జస్వంత్ సింగ్ తన గ్రంథం ప్రతిని బహూకరించిన దృశ్యం దేశ విభజన నాటి విషాదాన్ని మరోసారి కెలికింది!! ఆ పుస్తకావిష్కరణ సభకు భాజపా వారెవ్వరూ హాజరు కాలేదు. పార్టీ సమిష్టి అభిప్రాయానికి విరుద్ధంగా జస్వంత్‌సింగ్ ఆ గ్రంథాన్ని వెలయించాడు! ఖండత భారత సమైక్యతకు సమగ్రతా రక్షణకు కృషిచేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ భాయి పటేల్‌ను తన గ్రంథంలో కించపచడం జస్వంత్ సింగ్ చేసిన మరో ఘోరం..అందువల్ల ఈ గ్రంథం వెలువడిన వెంటనే 2009 ఆగస్టు 19న జస్వంత్‌సింగ్‌ను భాజపా నుండి బహిష్కరించడం ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు! కానీ పది నెలలలోనే ఆయనను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడమే విస్మయకరమైన పరిణామం!!
జస్వంత్ సింగ్‌కు ‘టిక్కెట్టు’ను నిరాకరించడం ద్వారా భాజపా నిజానికి 2010లో చేసిన తప్పిదాన్ని దిద్దుకున్నట్టయింది! జస్వంత్ ‘కనిపెట్టి’ తన పుస్తకంలో నమోదు చేసిన అభిప్రాయాలతో భాజపా తీవ్రంగా వ్యతిరేకించింది! అందువల్లనే జస్వంత్‌సింగ్‌ను వెళ్లగొట్టాలని 2009లో పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది! జిన్నాపై 2005లో చేసిన ఒక తీర్మానంలో భాజపా తన అభిప్రాయాలను స్పష్టం చేసింది! మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ పనిగట్టుకుని పాకిస్తాన్‌కు వెళ్లి మహమ్మదాలీ జిన్నాను పొగిడి వచ్చిన నేపథ్యంలో భాజపా 2005 జూన్‌లో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ‘‘జిన్నా కలలు కన్న పాకిస్తాన్ ఎలాంటిదైనా కావచ్చు! కానీ ఆయన ఏర్పాటు చేసిన పాకిస్తాన్ మాత్రం ‘ఏక మత రాజ్యం’-్థయోక్రాటిక్ స్టేట్! సర్వమత సమభావ వ్యవస్థకు విరుద్ధం! హిందువులు, ముస్లింలు విభిన్న జాతులన్న ఊహ సైతం భాజపాకు గిట్టదు! మత ప్రాతిపదికపై భారతదేశాన్ని విభజించడాన్ని భాజపా నిరంతరం నిరసించింది. జిన్నా ప్రచారం చేసిన, బ్రిటిష్‌వారు ఆమోదించిన ‘ద్విజాతి’ సిద్ధాంతాన్ని భాజపా నిరాకరిస్తూనే ఉంటుంది...’’ అన్నది 2005 జూన్‌నాటి భాజపా తీర్మానంలోని సారాంశం! నాలుగేళ్ల తరువాత జస్వంత్ విడుదల చేసిన ‘గ్రంథం’ ఈ తీర్మానం స్పూర్తికి పూర్తి విరుద్ధం! ఈ పుస్తకం ద్వారా జస్వంత్‌సింగ్ పార్టీ అంతర్గత అనుశాసనాన్ని నిర్లజ్జగా ఉల్లంఘించాడు!
ఈ తప్పు దిద్దుబాటునకు ఇప్పుడు గురి అవుతుండడం జాతీయతా నిష్ఠ పెరగడానికి దోహదం చేస్తున్న పరిణామం! 2009లో పార్టీ బహిష్కృతుడైన తరువాత జస్వంత్‌సింగ్ పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ కూడ తన గ్రంథాన్ని అమ్ముకుని వచ్చాడు!ఆ తరువాత కూడ ఆయన తన కృత్రిమ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు! 2009 ఆగస్టు 2010 జూన్‌ల మధ్య ఆయన తన భావాలను మార్చుకున్న జాడ లేదు! భాజపా తీర్మానానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఆయన పశ్చాత్తాపం చెందలేదు! చారిత్రక వాస్తవాలను వక్రీకరించడం వ్యక్తిగతమైన వ్యవహారం కావచ్చు! కానీ పార్టీ తీర్మానాన్ని ఆమోదించిన తరువాత కూడా సంస్థాగత అనుశాసనాన్ని బాహాటంగా ఉల్లంఘించడం సంస్థను అవమానించడమే! ఇప్పుడు టిక్కెట్టు ఇవ్వకపోవడం ద్వారా పార్టీ తనను అవమానించిందని వాపోతున్న జస్వంత్‌సింగ్ నిజానికి 2009లో తానే పార్టీని అవమానించాడు! ఆయన ఆవిష్కరించిన జిన్నా గ్రంథాన్ని తమ రాష్ట్రంలో నిషేధించినట్టు 2009లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించాడు! ఇదంతా జరిగిపోయిన తరువాత జస్వంత్ సింగ్ భావాలలో ఎలాంటి పరివర్తన వచ్చిన జాడలేదు! కానీ 2010లో మళ్లీ ఆయన పార్టీలో చొరబడిపోయాడు!! ఈ చారిత్రక అపరాధానికి భాజపా సమాధానం ఇంతవరకూ చెప్పలేదు! ఇప్పుడిక చెప్పవలసిన పనిలేదు! ఎందుకంటే బర్మార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్వంత్‌సింగ్ ఎలాగూ ఇక భాజపాలో ఉండడు! జస్వంత్‌సింగ్ ఓడపోక తప్పదు! ఈ ప్రక్రియలో భాగంగా పోటీలో ఆయన ఉనికి భాజపా అభ్యర్థిని సైతం పరాజయం పాలు చేయవచ్చు! కానీ ఎన్నికల తరువాత కొన్ని నెలలు గడిచిన తరువాత ఆయన మళ్లీ పార్టీలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది! జిన్నాపై ఆయన భావాలు మారనంత వరకు ఆయనను పార్టీలో మళ్లీ చేర్చుకోరాదన్న వివేకం భాజపా అధిష్ఠానానికి ఇప్పుడైనా ఉదయిస్తుందా?? జిన్నా సర్వమత సమభావానికి శత్రువు! వౌలిక మానవత్వానికి శత్రువు! భారతదేశానికి భారత జాతీయ వారసత్వానికి శత్రువు!!
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉండిన కాలంలో జస్వంత్‌సింగ్ దేశ వ్యవహారాల శాఖ మంత్రి, పార్టీ ఎదుగుదలకు కారణమైన లాల్‌కృష్ణ అద్వానీని మించిపోవడానికి యత్నించాడు! తదుపరి ప్రధాని జస్వంత్‌సింగ్ అన్న ప్రచారం అమెరికా తదితర విదేశాలలో జరిగిపోయింది కూడ! 1999లో జిహాదీ టెర్రరిస్టులు మన విమానాన్ని అపహరించినప్పుడు విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్ మోకరిల్లే విధానాన్ని అవలంబించడం మన జాతీయ గరిమను దిగజార్చింది! అయితే జిన్నా విషయంలో మాత్రం అద్వానీది, జస్వంత్ సింగ్‌దీ ఒకే విధానం! ఈ తప్పిదానికి ఇద్దరూ ప్రతిఫలం అనుభవించారు...
సంపాదకీయం
english title:
editorial
Date:
Tuesday, March 25, 2014