గత నూరేళ్ళ భారతదేశ చరిత్రను కాస్త జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కొన్ని ముఖ్యాంశాలు మన దృష్టికి వస్తా యి. మొదటిది భారత జాతీయవాదం. తెలుగులో జాతి శబ్దం నేషన్ అనే శబ్దానికి పర్యాయపదంగా వాడుతున్నాము. హిందీ, కన్నడ వంటి భాషలలో జాతి అనే మాటను కులం అనే అర్థంలో వాడుతారు. అందుకని ఈ వివరణ ఇవ్వవలసి వచ్చింది. దాదాపు నూరేండ్లపాటు అరవిందుడు, దయానందుడు బోసుబాబు, మహాత్మాగాంధీ, సావర్కార్, కేశవరావు బలీరాం హెడ్గేవార్, లోకమాన్య తిలక్, మాలవీయా వంటివారి నాయకత్వంలో భారత జాతీయత మొగ్గతొడిగింది. దీనికి సమాంతరంగా భారత సాంస్కృతిక జాతీయవాదం (ఇండియన్ కల్చరల్ నేషనలిజం)తో సంబంధం లేకుండా అంతర్జాతీయ వర్గ సంఘర్షణాశక్తి ఒక బలమైన ఆర్థిక సిద్ధాంత ప్రాతిపదికతో వికసించింది. ఇందులో కమ్యూనిస్టులు సోషలిస్టులు, రాడికల్ హ్యూమనిస్టులు, ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్.ఎస్.పి. వంటి ఎన్నో విభేదాలున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూగారు తన ను తాను ఫాబియన్ సోషలిస్టునని చెప్పుకున్నారు. సోషలిస్టిక్ పాటరన్ ఆఫ్ సొసైటీ అనేది తన లక్ష్యం అన్నారు. అంటే పూర్తి సోషలిజం కాదు. ఆ తరహా నమూనా సమాజం అని అర్థం. ఇంకా ప్రజాసోషలిస్టుపార్టీ న్యూడెమొక్రసీ, పీపుల్స్‌వార్, ఇలా ఎన్నో పార్టీలు వచ్చాయి. మార్గాలు వేరైనా వీరందరికి లక్ష్యమూ సోషలిజమే.
అంటే ఒకవైపు నేషనలిజం మరొకవైపు సోషలిజం ఈ రెండూ రెండు సమాంతర ప్రవాహాలుగా సాగాయి. సోషలిస్టులకు జాతి కుల మత ప్రాంత భాషా వివక్ష లేదు. కేవలం ఆర్థిక వివక్ష మాత్రమే పాటిస్తారు. డబ్బున్నవాళ్ళంతా వీరికి శత్రువులు.
ఎండాకాలంలో పుల్లయ్య ఓ చెరుకు రసం బండిని నడుపుతాడు. అతడు చెరుకు గడలు తెచ్చేందుకు గ్లాసులు కడిగేందుకు ఒక నౌకరును పెట్టుకుంటాడు. అంటే పుల్లయ్య బూర్జువా- ఈ నౌకరు శ్రమను పుల్లయ్య దోచుకుంటున్నాడు. అంటే అమెరికా మాత్రమే పెట్టుబడిదారీ దేశం అని భావింపకూడదు. ఈ పుల్లయ్య కూడా పెట్టుబడిదారీ వర్గ శత్రువే...!
ఈ సిద్ధాంతంలో గత వంద సంవత్సరాలుగా భారతదేశంలో ఎంతో హింస జరిగింది. రష్యాలో (1917), నేపాల్‌లో (2000), టిబెట్‌లో (1959) చైనాలో (1948) జరిగిన హింస కంటే భారత్‌లో జరిగిన హింస ఏమాత్రమూ తక్కువ కాదు. ‘‘ఇదేమిటయ్యా?’’ అని ఎవరైనా ప్రశ్నిస్తే ‘హింసకు ప్రతిహింస’అని సామ్యవాదులు సైద్ధాంతికంగా సమాధానం చెప్పారు. లక్ష్యసాధనకు ఏమార్గం అనుసరిస్తే ఏమిటి? అనేది మావోసీటుంగ్‌గారి సుప్రసిద్ధ సూక్తి. ఇప్పుడు మరికొన్ని ముఖ్యాంశాలు గమనిద్దాం.
భారతదేశ చరిత్రలో సోషలిష్టువర్గాలు ఎన్నోసార్లు పొరపాట్లు చేశారు. కీలక సమయంలో సరికాని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత తీరికగా పశ్చాత్తాపం ప్రకటించారు. నిజమే మేము అప్పుడు చేసింది చారిత్రక తప్పిదం (హిస్టారికల్ బ్లండర్) అని మళ్ళీమళ్ళీ ప్రకటించారు. నేతాజీ సుభాష్‌చంద్రబోసును తిట్టటం, స్వామి వివేకానందనూ, అరవింద్‌ఘోష్‌ను నిందించటం ముందు ఎడాల్ఫ్‌హిట్లర్‌ను సమర్ధించటం తర్వాత ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడటం ముందు ఇందిరాగాంధీని, సోనియాగాంధీని సమర్ధించటం తర్వాత విమర్శించటం బంగ్లాదేశ్ విభజన సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు పలకటం, 1962 ఇండో చైనా యుద్ధంలో చైనా ను సమర్ధించటం ఇలా ఎనె్నన్నో ఉదాహరణలు చూడవచ్చు. బిజెపి మీది కోపంతో సోనియాకు మద్దతునిచ్చి ‘‘అవినీతి అసలు సమస్యేకాదు. మత తత్వమే సమస్య’’ అని జ్యోతిబసు చేసిన చారిత్రక ప్రకటన చారిత్రక తప్పిదం కాదా?? 2014లో మళ్లీ అదే పాట పాడారు. నరేంద్రమోడీని ప్రధాని కాకుండా నిరోధించే నిమిత్తం మూడవ కూటమి అంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు. ఇది కేవలం రాహుల్‌గాంధీకి మాత్రమే సహాయపడే చర్య.
ఇలా భారతదేశంలో సమయం దొరికినప్పుడల్లా సోషలిస్టు- కమ్యూనిస్టు వర్గాలు జాతీయ (నేషనల్ ఫోర్సెస్) శక్తులను అణచివేసేందుకు అన్ని రంగాలల్లోనూ ప్రయత్నంచేశారు. కళాసాహిత్య రంగాలు ఇందుకు అపవాదం కాదు. తెలంగాణాను బిచ్చగాళ్ల రాజ్యంగా గత ఏడువందల సంవత్సరాలుగా అటు అసఫ్ జాహీలు ఇటు ఫ్యూడల్ శక్తులు కలిసి చేశాయి. సరిగ్గా ఆ ఫ్యూడల్ శక్తులతోనే కలిసి సిపిఐ తెలంగాణ ఉద్యమం 2013 వరకు మళ్ళీ నడపటం విచిత్రం. ఇలా ఎన్నో ఉదాహరణలు చూడవచ్చు.
డార్జిలింగ్‌లోని భాషకూ బెంగాలీ భాషకూ సంబంధంలేదు. రెండు ప్రాంతాలల్లోని సంస్కృతులు కూడా భిన్నమైనవే. ఐనా బెంగాల్ నుండి గూర్ఖాలాండ్ విడిపోవటానికి సామ్యవాదులు ఇష్టపడలేదు. అదే తెలంగాణ విషయం వచ్చేసరికి ఫ్యూడల్ శక్తులతో కలిసి తెలంగాణలో కమ్యూనిస్టులూ నక్సలైట్లూ ఉద్యమాలు నడిపారు. దీనిని ఎలా సమర్ధించాలి?? మతతత్వవాదం మొత్తం భారతదేశంలోను ప్రమాదకరమే కాని తెలంగాణలో మాత్రంకాదన్నమాట. అందుకే ఇక్కడ బిజెపి, సిపిఐ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగాయ. జాఫ్నాలో సాగింది భాషా జాతీయవాదం (లింగ్విస్టిక్ నేషనలిజం)- అంటే అక్కడ సింహళ జాతీయులది సింహళ భాష. తమిళ జాతీయులది తమిళ భాష. మరి తెలుగు భాషీయులది తెలుగు జాతి అని ఒప్పుకుంటే సీమాంధ్రుల యాస (స్లాంగ్) కన్నా తెలంగాణ యాస (మాండలిక భేదం) మాత్రమే విభజనకు సామ్యవాదులు పరిగణనలోకి తీసుకున్నారు. దానిని ఎలా అర్థం చేసుకోవాలి? కల్చరల్ నేషనలిజం(సాంస్కృతిక జాతీయవాదం) నమ్ముకున్న బిజెపి నేడు ఉప మాండలిక ప్రాంతీయవాదాన్ని బలపరిచింది. దానికి కాంగ్రెసు వంత పాడింది. ఎందుకు? ఇక్కడ ఎట్టి సిద్ధాంతాలూ లేవు. కేవలం గంపగుత్తగా లోక్‌సభ స్థానాలు రొల్లుకోవాలనే తపనే కన్పడుతున్నది.
2014 మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. భారతదేశ చరిత్రలో కాంగ్రెసు అనే పార్టీ వృక్షం కూకటివ్రేళ్లలో పెకిలింపబడే సమయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ సోషలిస్టులు చారిత్రక తప్పిదంచేసి ఆలస్యంగా తమ హిస్టారికల్ బ్లండర్‌కు పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఉండదు. ఈ విషయం ప్రకాశ్‌కారత్, బర్దన్, ఏచూరి సీతారాంలు గుర్తించాలి. ఇది ఎన్నాళ్లో వేచిన ఉదయం. మన్మోహన్‌సింగ్, సోనియా, రాహుల్, దిగ్విజయ్‌సింగ్, కపిల్‌సిబల్, చిదంబరం, కమలనాథ్, జైరాంరమేష్, లల్లూప్రసాద్ యాద వ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పురంధరేశ్వరి, పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్, చింతామోహన్, చిరంజీవి, వేణీప్రసాద్‌వర్మ, అహ్మద్‌పటేల్, ఆంటోనీ, చాకో, శశిధరూర్, మధుయాష్కి, సుషమాస్వరాజ్, ఉమాభారతి, యడ్యూరప్ప, గాలి సోదరులు, కె.సి.ఆర్ కుటుంబం, రాజబబ్బర్, అజిత్‌సింగ్, గిరిజావ్యాస్, రేణుకాచౌదరి, రీటాబహుగుణ, అంబికాసోనీ ఇలా ఒక వంద మంది కౌరవుల జాబితా తయారుచేయండి. వీరికి శాశ్వతంగా భారత రాజకీయ సన్యాసం ఇప్పించండి. ‘‘ఐయామ్ హెల్ప్‌లెస్’’అనే ప్రధానమంత్రికి 120 కోట్ల ప్రజలను పాలించే హక్కులేదని చాటండి. ఈ పనిని అటు నేషనలిష్టులూ ఇటు సోషలిస్టులూ కలిసిచేయాలి. విపత్కర పరిస్థితిలో వరద వచ్చినప్పుడు ఓ చెట్టుమీద పామూ ముంగీస సహజీవనం చేశాయని మనం ఓ కథలో చదువుకున్నాము. 2014 లో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది. దయచేసి నేషలిస్టులూ సోషలిస్టులూ కలిసి పనిచేసి ఈ ఇటలీ పాలనకు చరమ గీతం పాడండి.
16 మార్చి 2014నాడు దినపత్రికలలో ఒక వార్త వచ్చింది. దాణా కుంభకోణాలకు సంబంధించి లల్లూప్రసాద్ యాదవ్ మీద పెట్టిన మూడు కేసులను సిబిఐ ఉపసంహరించుకుంది. దీనికి సొలిసిటర్ జనరల్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ అట్లా ఉపసంహరించుకునే అర్హత సిబిఐకి లేదనీ కోర్టు మాత్రమే ఆధారాలు లేకపోతే కేసులు కొట్టివేయాలని పేర్కొన్నారు. అంటే 2014 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీహారులో కుదిరిన అవగాహన దృష్ట్యా ఈ పరిణామాలు సంభవించాయని పసిపిల్లలకు కూడా అర్థమవుతూ ఉంది. దీనినిబట్టి కాంగ్రెసు పార్టీ ఎంత నీచానికైనా దిగజారగలదని తెలుస్తున్నది. అలాంటప్పుడు 2014 ఎన్నికలలో మళ్ళీ ఆ పార్టీకి ఓటువేయటం అంటే భారత జాతికి ఆత్మహత్యా సదృశంకాదా? ఆలోచించండి.
అరవింద్ కేజ్రీవాలా గుజరాత్‌కు వెళ్ళి ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు అని ఆక్షేపించారు (17.3.2014). విమర్శించటం సులభం. ఆచరించటం కష్టం- తాను అందరినీ అవినీతిపరులు అని ఆక్షేపిస్తున్నాడు. అలా నిందించటం సమస్యకు స మాధానం కాజాలదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ రంగంలోనే కాదు కళా పారిశ్రామిక వైద్య విద్యారంగాలన్నింటిలోకి అవినీతి ప్రవేశించింది. వ్యక్తులను మార్చకుండా అవినీతి, అవినీతి అని అరవింద కేజ్రీవాలే తానొక అపర అరవింద్‌యోగి అన్నట్టు-లేదా ‘అరవింద’ దళాయతాక్షుడు అన్నట్లు అరిచి ప్రయోజనం లేదు. పట్టుమని పదిరోజులు తాను ఢిల్లీలో పదవి నిలుపుకోలేనివాడు దేశానికి సుస్థిర పాలనను ఎలా అందించగలడు? సోమనాథ్ నుండి బయలుదేరిన మోడీ విశ్వనాథ్ వద్దకు వచ్చి సాంస్కృతిక సమగ్రతకు సంకేతంగా నిలబడ్డారు. ఈ దశలో తృతీయ ప్రకృతులూ క్రేజీఫెలోస్ శిఖండి పాత్రను పోషించటం దేశ భవిష్యత్తుకు మంచిది కాదు.
మెయిన్ ఫీచర్
english title:
main feature
Date:
Tuesday, March 25, 2014