సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో ఎక్కడ చూసినా ‘ఎన్నికల పండుగ’ వాతావరణం గోచరిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లకు ఎన్నికల ఎరకోసం యు.పి.ఏ. ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌తో మధ్యతరగతి, సామాన్యులకు తాయిలాలు గుప్పించింది. ద్విచక్ర వాహనాలపై ఎక్సైజు సుంకాన్ని కుదిస్తూ సగటుజీవుల్ని ప్రసన్నం చేసుకునేందుకు 12నుంచి 8 శాతం తగ్గించడం ఆటోమొబైల్ రంగంతోపాటు దేశంలోని సెల్, మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారులకు చిదంబరం వరాలు కురిపించారు. ఫోన్లపై ఎక్సైజు సుంకాలు తగ్గిస్తూ ప్రతిపాదించి ఎన్నికల ఎరవేసారు. ఇక దేశంలోని దాదాపు అన్ని వర్గాల ప్రజలకు శ్యాంసంగ్, నోకియాలాంటి ఫోన్లు అందుబాటులోకి రావడం ఖాయం. ఒకనాడు ఫోన్ ఉండటమే ఒక లజ్జరీగా భావించేవారు. కానీ నేడు అదే ఫోన్ నిత్యావ సరంగా మారిపోయంది. ఆవాసం, తిండి, వస్త్రం ఎంత ముఖ్యమో సెల్‌ఫోన్ కూడా అంతే ముఖ్యమైపోయంది. బహుశా దీన్ని గుర్తించే యుపిఏ ప్రభుత్వం పై చర్య తీసుకొని ఉండవచ్చు.
ఇక ఏ గ్రామాల్లో...ఏ పల్లెల్లో, ఏ సందుల్లో, గొందుల్లో చూసినా బెల్టుషాపులన్నీ బిజీబిజీ అయిపోయి సారా నదీవ్రాహంలా పారే రోజులు వచ్చేశాయ. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ గూడు చెదరిపోవడంతో, మిగిలిన పార్టీల్లోకి వలసల జోరందుకుంది. ఏపార్టీలోనైనా సీటు ఖరారయతే చాల న్నట్టుగా రాజకీయ నాయకులు యత్నాలు ముమ్మరం చేశారు. ఏ పిట్ట ఏ పుట్టలో(వేరే పార్టీ)లో దూరుతుందో తెలీదు. రాజకీయ వ్యాపారానికి తెరతీస్తూ ఎటుదూకితే లాభం? ఎంతెంత?? అనే ధ్యాసలో వున్నారు. సమైక్యబాటలో కొందరు..తెలంగాణ ధ్యాసలో కొందరు... మరికొందరు బొత్సవైపు... ఇంకొందరు కిరణ్‌వైపు ఇంకొందరు జగన్ వైపు చూస్తూ ఎటు వీలైతే అటు దూకడం కొనసాగుతోంది. ఇక్కడ సిద్ధాంతాలు, నైతిక విలువలకు అసలు విలువే లేదు. డబ్బును మంచినీళ్ళలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయగలగడమే అసలు సిసలైన క్వాలిఫికేషన్‌గా మారిపోయంది.
కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సీమాంధ్ర ఓటర్లు గుర్తించాల్సిన సత్యం ఒకటుంది. కాంగ్రెస్‌లో ఉంటూ విభజనను అడ్డుకోకుండా ఉన్న నాయకులే ఇప్పుడు వేరే పార్టీల్లో చేరుతున్నారు. వారు చేరే పార్టీ పాతతే..వీరూ పాతవారే.. అంటే ‘‘మరో పాత సీసాలో..పాత సారా’’ అన్నమాట! మరి సీమాంధ్ర ప్రజలు కొత్త పార్టీ బ్యానర్ కింద ఎన్నికల బరిలోకి దిగుతున్న...తాము ద్వేషించిన నాయకులను ఏవిధంగా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. ఇక్కడ వారికి ద్వేషం ఎవరిపైన? రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌పైననా? లేక తమను చివరి వరకు మభ్యపెట్టి, రాష్ట్ర విభజనను అడ్డుకోలేని నాయకుల మీదనా? అనేది రానున్న ఎన్నికలు మాత్రమే తేల్చగలవు.
‘ఈ పూట గడిస్తే చాలు’ ఎవడు గెలిచి మనకు ఉద్ధరించిందేమీ లేదు.. అనే సిద్ధాంతంపై బ్రతికే బడుగుజీవుల ఆలోచనా విధానాల్లో మార్పు వస్తేనే అనైతిక నేతలు శాసన వేదికల్లోకి అడుగు పెట్టకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. కానీ ‘ఎన్నికల పండుగ’ పేరుతో తమ ఓటును అమ్ముకుంటే మనకు మనమే ద్రోహం చేసుకున్నట్టవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈసారి ఎన్నికల్లో విద్యావంతులైన యువత అధిక మొత్తంలో ఉండటం వల్ల, వీరు తలచుకుంటే బ్యాలెట్ ద్వారా దేశ భవితనే మార్చగలరు. ఈ సారి ఉగాది తర్వాత ఏకమొత్తంగా -స్థానిక సంస్థలు, శాసనసభలు, లోక్‌సభ- ఎన్నికలు జరుగుతున్న అరుదైన సంఘటన ఇది. ‘‘క్యాష్’’పై కాకుండా, ‘‘కంట్రీ’’ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పాపం! రెవెన్యూశాఖవారు మాత్రం మాకు ఇక కంటిపై కునుకుఉండదని వాపోతున్నారు.
సబ్ ఫీచర్
english title:
voters
Date:
Tuesday, March 25, 2014