
రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగా నే బాధ్యతారహితంగా వ్యవహరిస్తే పదవు ల్లోని నాయకులు చెడిపోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే భాజపా దాని నాయకులు అధికారంలోకి రాకముందే చెడిపోతున్న సూచనలు కనిపస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తాము విజయం సాధించి అధికారంలోకి వస్తున్నామనుకుంటున్న భాజపా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం విషయంలో ఏకపక్షంగా నియంతలా వ్యవహరిస్తున్నారు.
సమష్టిగా ఎన్నికల ప్రచారం చేయవలసిన సీనియర్ నాయకులు సీట్ల కోసం కీచులాడుకుంటూ క్రమశిక్షణారాహిత్యాంలో కాంగ్రెస్‌ను మించిపోతున్నారు. భాజపా ఒక వ్యక్తి లేదా కుటుంబం ఆధారంగా పని చేసే పార్టీ కాదు. సిద్ధాంతాలు, విలువల ఆధారంగా రాజకీయం చేసే పార్టీ. కానీ ఇప్పుడది మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాల కంటే గెలుపు ఆధారంగా భాజపా ముందుకు సాగుతోంది. సమష్టి నిర్ణయాల ఆధారంగా పని చేసిన పార్టీ ఇప్పుడు కొందరు వ్యక్తులు తీసుకునే నిర్ణయాల చుట్టు తిరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, పొత్తులలు పెట్టుకోవటం, సీనియర్ నాయకులు ఎక్కడి నుండి పోటీ చేయాలి, పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఏ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపై భాజపాలో ఇప్పటికీ స్పష్టమైన విధానం లేదు. సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ, జస్వంత్ సింగ్ లాంటి సీనియర్ నాయకులు ఎక్కడినుంచి పోటీచేయాలనేది ప్రహసనంగా మారి భాజ పాకి చెడ్డపేరు తెస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనాలనే నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీలో చోటు చేసుకుంటు న్న పరిణామాలు ఆశాజనకంగా లేవు. నరేంద్ర మోడీకి దేశం మొత్తం మీద ఒక మంచి గుర్తింపు వచ్చింది. యువత, వెనుకబడిన కులాల నుండి పార్టీకి మంచి స్పందన వస్తోంది. దేశానికి పటిష్టమైన నాయకత్వం కావాలని కోరుకుంటున్న వారు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. బి.జె.పి పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించటంలో మోడీ చాలా వరకు విజయం సాధించగలిగారు. ప్రజల వద్దకు ఆత్మ విశ్వాసంతో వెళ్లగలిగే నాయకుడుగా మోడీ రూపాంతరం చెందారు. మోడీ మూలంగానే బి.జె.పి ఈరోజు దేశం మొత్తం మీద చర్చనీయాంశంగా తయారైంది. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూడా బి.జె.పికి కొంత గుర్తింపు రావటంతోపాటు స్థానిక ప్రాంతీయ పార్టీలు బి.జె.పితో పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బి.జె.పి అధినాయకులు పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే బదులు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది కానీ అలా జరగటం లేదు.
అద్వానీ లాంటి సీనియర్ నాయకుడు తన నియోజకవర్గాన్ని మార్చవలసిందిగా కోరి ఉం డాల్సింది కాదు. ఆయన గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయకపోవటం వలన పార్టీకి చెడ్డపేరు రావటంతోపాటు మోడీని దెబ్బ తీసినట్లు అయ్యేది. మోడీ రాష్ట్రం నుండి గెలవటం సాధ్యం కాదనే భావంతోనే భోపాల్ ఎంపిక చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లటం బి.జె.పికి ఎంత మాత్రం మంచిది కాదు. ఈ తప్పును సరిదిద్దేందుకు పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, ఇతర పార్టీ పెద్దలు వ్యవహరించిన విధానం కూడా మంచిది కాదు. గాంధీనగర్ నుండే పోటీ చేయాలి, భోపాల్ సీటు కేటాయించే ప్రసక్తే లేదని ఖరాఖండీగా అద్వానీ లాంటి నాయకుడికి చెప్పటం మంచిది కాదు.
రాజనాథ్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ, మోడీ ఒక గ్రూపుగా ఏర్పడి అందరిపై ఆధిపత్యం చలాయిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. లోక్‌సభలో ప్రతిపక్షం నాయకురాలు సుష్మాస్వరాజ్ కూడా పై ముగ్గురు నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. మోడీని వారణాసి నుండి పోటీ చేయించటం వలన ఉత్తర ప్రదేశ్, బీహార్‌లోని పలు నియోజకవర్గాల్లో భాజపాకు సానుకూల పవనాలు వీచే అవకాశం ఉండవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో నుండి మెజారిటీ సీట్లు గెలుచుకుంటేనే కేంద్రం లో అధికారంలోకి రావడం సాధ్యమనేది కూడా నిజమే. అయితే దీని కోసం భాజపా అధినాయకత్వం ఏకపక్షంగా వ్యవహరించాలా? వారణాసి నుండి మోడీని పోటీ చేయించాలనే ఆలోచన గురించి మొదట పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా మురళీమనోహర్ జోషీతో చర్చించి ఉండాల్సింది. మోడీ వారణాసి నుండి పోటీ చేయటం వలన పార్టీకి రాజకీయంగా కలిగే లాభం గురించి ఆయనకు వివరించి ఒప్పించవలసింది. అలా చేయటం వల్ల పార్టీతోపాటు మోడీకి కూడా మంచి పేరు వచ్చేది. జోషీని బలవంతగా కాన్పూర్‌కు పంపించటం వలన పార్టీ అంతర్గత విభేదాల్లో పడిపోవటంతోపాటు ప్రజల్లో కూడా పలుచనైంది.
రాజస్తాన్‌లోని బార్మేర్ లోక్‌సభ నియోజకవర్గం టికెట్ ఇవ్వనందుకు జస్వంత్ సింగ్ కంటతడి పెట్టుకున్నారు. జస్వంత్ సింగ్ గతంలో పార్టీకి రాజీనామా చేసి పోయిన వ్యక్తే అయినప్పటికి బి.జె.పి అభివృద్ధిలో ఆయనకు కూడా భాగం ఉన్నది. జస్వంత్ సింగ్ గతంలో చేసిన కృషిని గౌరవించవలసిన బాధ్యత పార్టీ అధినాయకత్వంపై ఉన్నది. బార్మేర్ నియోజకవర్గాన్ని జస్వంత్ సింగ్‌కు కేటాయించకుండా కాంగ్రెస్ నుండి ఇటీవలే భాజపాలో చేరిన నాయకుడికి ఇవ్వటం వలన పార్టీ ప్రతిష్ట పెరిగిందని అధినాయకత్వం భావిస్తే పప్పులో కాలేసినట్లే.
ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ఒక్కరే భాజపాకి విజయం సాధించిపెడతారనే భావన ఉంటే ఉండవచ్చు. అయితే భాజపా లాంటి పార్టీ ఒకే వ్యక్తి ఖరిష్మాపై ఆధారపడటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. మోడీతోపాటు సుష్మా, జైట్లీ, అద్వానీ,జోషి తదితర సీనియర్ నాయకులకు కూడా ఎన్నికల ప్రచారంలో సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. భాజపా సమిష్టి నాయకత్వంలో విజయం సాధించాలి లేకపోతే ముందు, ముందు పార్టీ మనుగడ ప్రమాదంలో పడిపోతుంది. భాజపా సిద్ధాంతాల ఆధారంగా పని చేయాలి కానీ కొందరు వ్యక్తుల చరిష్మాకు పరిమితం కాకూడదు.