హైదరాబాద్, మార్చి 25: నగరంలోని అసెంబ్లీ పునర్విభజన తర్వాత ఏర్పడిన నాంపల్లి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. నాటి ఆసిఫ్‌నగర్ నియోజకవర్గంలోని ఎక్కువ ప్రాంతాలు, కార్వాన్‌లోని రెండు డివిజన్లతో ఏర్పాటైన నాంపల్లి నియోజకవర్గంలో టిడిపి పార్టీ పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉన్నా, నాంపల్లి నియోజకవర్గం రాజకీయ నేతల్లో వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పిసిసి అధికార ప్రతినిధి ఫిరోజ్‌ఖాన్‌ను రంగంలో దింపితే గెలుపు తేలిక అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చంద్రబాబు ఫిరోజ్‌ఖాన్‌ను పిలిపించినట్లు కూడా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ నాంపల్లి నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న వారిలో జాబితాలో ఫిరోజ్‌ఖాన్ పేరును పంపకపోవటంతో ఆయన టికెట్ ప్రయత్నాలకు ప్రారంభంలోనే బ్రేక్ పడినట్టయ్యింది. గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఫిరోజ్ మజ్లిస్ తదుపరి స్థానంలో నిలిచారు. కేవలం మూడున్నర వేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూవచ్చారు. గడిచిన నాలుగున్నరేళ్లలో మురికివాడలు, పేదలకు చాలా దగ్గరైన ఫిరోజ్‌ఖాన్‌ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దించితే, నియోజకవర్గంలోని క్యాడర్‌ను సక్రమంగా వినియోగించుకోగలిగితే విజయం తధ్యమని టిడిపి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో 2009 ఎన్నికలకు ముందు దివంగత టిడిపి నేతల లాల్‌జాన్ బాషా ఆధ్వర్యంలో టిడిపిలో కొనసాగిన ఫిరోజ్‌ఖాన్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత, ఆ పార్టీలో కొనసాగి, చిరంజీవికి సన్నిహితుడిగా మెలిగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టినా, పార్టీ ఆయనకు టికెట్ ఖరారు చేస్తుందన్న నమ్మకం లేకపోవటంతో ఫిరోజ్‌ఖాన్ కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని అనే్వషించుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే విషయంపై కూడా ఆయన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్‌ను మట్టికరించాలన్న సంకల్పంతో ఏళ్ల తరబడి నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తున్న ఫిరోజ్‌ఖాన్ తిరిగి దేశం గూటికి చేరుతారా? లేక గులాబీ దళంలో చేరి ‘కారు’ ఎక్కుతారా? వేచి చూడాలి!
నగరంలోని అసెంబ్లీ పునర్విభజన తర్వాత ఏర్పడిన నాంపల్లి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా
english title:
n
Date:
Wednesday, March 26, 2014