తార్నాక, మార్చి 25: తెలంగాణా పునర్‌నిర్మాణం తెలంగాణ రాష్ట్ర సమితితోనే సాధ్యమవుతుందని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు సికింద్రాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి టి.పద్మారావు పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట్‌లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. సంవత్సరం ముందు నుంచే పద్మారావు నియోజకవర్గంలో తనదైనశైలిలో కార్యకర్తలను సమీకరించడంతోపాటు పార్టీ కార్యాలయాల ప్రారంభంతోపాటు సర్వం సిద్ధం చేసుకున్నారు. మంగళవారం నియోజకవర్గంలోని లాలాపేట్‌లో పాదయాత్ర నిర్వహించిన పద్మారావు మాట్లాడుతూ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కెసిఆర్ భగీరధ ప్రయత్నం కొనసాగించి నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారని అన్నారు. సాధించిన తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుకోవాలంటే తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. పద్మారావుకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మిగిలిన పార్టీలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో తెరాస మాత్రం లష్కర్‌లో దూసుకుపోతుంది.
..................
పెద్దఎత్తున ఓటర్లలో అవగాహన కలిగించాలి
చాంద్రాయణగుట్ట, మార్చి 25: లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పెద్దఎత్తున జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఏప్రిల్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలవారీగా ఆయా ప్రాంతాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.