
హైదరాబాద్, మార్చి 25: శక్తి ఉపాసకులు రాజా సంతోష్ దూబే ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ నుంచి శ్రీ మహాంకాళీ మాతేశ్వరి 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వసంత నవరాత్రి పూజ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జూబ్లీహిల్స్ ఫేజ్ 3లోని రోడ్ నెం. 76లో గల ప్లాట్ నెం. 167 ‘లక్ష్మీనివాస్’ శారదపార్వతీ నిలయంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు గణేష్ పూజ, గో పూజ, రుద్రాభిషేకము, శ్రీ చక్రపూజ కార్యక్రమాలను నిర్వహించి, ఆ తర్వాత పదకొండు నుంచి పనె్నండు గంటల మధ్య శ్రీ చక్ర కుంకుమార్చన, మహంకాళీ, శ్రీ మహాలక్ష్మీ, మహా సరస్వతి దేవి పారాయణం కార్యక్రమాలు నిర్వహించినానంతరం చండీ జపం, హవము కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో చివరి రోజైన ఏప్రిల్ 7వ తేదీన దుర్గాష్టమి పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య దేవీ సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఉత్సవాల్లో చివరి రోజైన వచ్చే నెల 7వ తేదీన దుర్గాష్టమి పూజా కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి, మహా మంగళహారతి, అమృతం, ప్రసాదం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాజా సంతోష్ దూబే ప్రకటనలో పేర్కొన్నారు.