
చైతన్యకృష్ణ, మహత్ రాఘవేంద్ర, అడివి శేషు, కమల్ కామరాజు ప్రధాన తారాగణంగా షిర్డి సాయి కంబైన్స్ పతాకంపై మధుర శ్రీ్ధర్ నిర్మాతగా మారి పి.బి.మంజునాధ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’. గో తెలుగు డాట్ కామ్ సమర్పణలో పి.ఎల్. క్రియేషన్స్ మరియు రాజ్ కందుకూరి భాగస్వామ్యంతో ఎం. వి.కె.రెడ్డి అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి చూపు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. కళామందిర్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మధుర శ్రీ్ధర్ మాట్లాడుతూ- తాను నిర్మించిన బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ ఫలితాలు సరిగా లేకపోవడంతో దర్శకుడిగా సాగుతూ సినిమాలు నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చానని, ఆ తరుణంలో అనేకమంది కథలు చెప్పినా నచ్చకపోవడంతో చివరికి తన దగ్గర పనిచేస్తున్న మంజునాధ్ చెప్పిన కధాంశం నచ్చడంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, దర్శకుడు కధ చెప్పిన తీరు, నేపథ్యం నచ్చడంతో కథకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసుకొని షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. మనచుట్టూ ఉండే మనుషుల ప్రేమలు, ఆప్యాయతలు వదిలేసి ఎక్కడో ఉన్న వారి అభిమానాన్ని, ప్రేమల్ని ఇంటర్నెట్ ద్వారా మనం కోరుకుంటున్నామని, అందులో మంచి చెడు ఉన్నా మనం ఎక్కడికి వెళుతున్నామనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, మానవ సంబంధాలు, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని కథకు యాప్ట్ అయ్యే నటీనటులతో రూపొందించామని దర్శకుడు పి.బి.మంజునాధ్ తెలిపారు. ఓ కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన వంతుగా ఓ సరికొత్త పాటను రూపొందించానని, బుర్రకథ నేపథ్యంలో సోషల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ గురించి తెలిపే పాట ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని సంగీత దర్శకుడు రఘు కుంచె తెలిపారు. కార్యక్రమంలో చైతన్యకృష్ణ, అడివి శేష్, నికితా నారాయణ్, జాస్మిన్, కమల్ కామరాజు, రాజ్ కందుకూరి, లోహిత్, ఇసనాక సునీల్‌రెడ్డి, స్వాతి దీక్షిత్, మహత్ రాఘవేంద్ర, ఎం.వి.కె.రెడ్డి, సుధీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా:జగన్ చావలి, ఎడిటింగ్:నవీన్ నూలి, కథ:సంజీవ్‌రెడ్డి, పాటలు:సిరాశ్రీ, మాటలు:నివాస్, సంగీతం:రఘు కుంచె, నిర్మాతలు:డాక్టర్ ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీ్ధర్, దర్శకత్వం:పి.బి.మంజునాధ్.