
అంత చతుర్ముఖుడు నన్ను కాంచి ‘‘విత్తనాలు కొని వచ్చి వెదపెట్టుకుంటే ఎక్కడైనా పంట పండుతుందా? ఫలం ఎక్కడ వుంటుంది? అదీకాక భూలోకంలో నువ్వు ఎవరికీ భిక్షం పెట్టవు. తపం ఎంత చేస్తే ఏమి? దానం చెయ్యని వాడికి సౌఖ్యాలు ఏలాగ కల్గుతాయి? నువ్వు నిత్యమూ భూలోకం చని నాతొంటి దేహాన్ని తింటూ, ఆ కొలను నీరు త్రాగవసింది’’ అని వచించాడు.
అప్పుడు నేను ‘‘దేవా! ఇది ఈ గతి ఎంత కాలం చెయ్యాలి? నాకు మోక్షానికి ఏది త్రోవ? దయాకరా! నన్ను కరుణింపవా?’’ అని ప్రార్థించాను. అంత వనజభవుడు ‘‘కాలం గడిచే కొలది నీకు తృప్తి కల్గుతుంది. శశం కండలున్ను కాంతితో వుండగలవు. ఆ తపోవనికి అగస్తి ఏతెంచి, నీతో సంభాషించినప్పుడు నీ కష్టకారణం అయిన కల్మషం సమస్తమూ నష్టం అయి సుస్థితి పొందుతావు. ఇంద్రాది దేవతల యెడరు వారింపగల అగస్త్య మహర్షికి ఈ కార్యం ఒక గగనమా?’’ అని వక్కాణించాడు.
అది మొదలుగా నేను నా పీనుగు మాంసం ఏవగించుకోక తింటూ పెక్కు వేల యేండ్లు ఈ పీనుగు మాంస ఖండాలు తింటూ కొరమారవలసి వచ్చింది. నీ తేజస్సు చూడ నువ్వే అగస్త్యుడివి అని తోస్తున్నది. నేను బాధితుణ్ణి. నన్ను కావడం అధిక దర్మం. రమణీయమైన ఈ రత్న భూషణాన్ని కైకోవలసింది. సువర్ణాది దానం నాచేత పరిగ్రహించి నన్ను ఉద్ధరించు’’ అని పలికి అతడు అది నాకు ఒసగాడు. ఆ పిమ్మట అవనిపైనున్న మానుష శరీరం మాయం అయిపోయింది. ఆ దివ్య పురుషుడున్ను అచ్చరలు ఆదట కొలువ అమరలోకానికి అరిగాడు. లోకైక వీరా! నాడు నేను పొందిన ఆ దివ్యాభరణం నేడు నీకు ఒసగాను’’ అని నుడివాడు.
రామావనీనాథుడు అగస్తి వాక్కులు ఆలించి ముదితాత్ముడయి మునినాథుణ్ణి తిలకించి ఈ వడువున వాకొన్నాడు.
‘‘అనఘాత్మా! ఈ వనం ఎందువల్ల నిర్జనం అయింది? ఆ విధమంతా నాకు వినిపింపగోరుతున్నాను’’. అంత మహాముని ‘‘రామమహీపాలా! విను. ఆదియుగంలో ఘన యశస్వి, మహనీయుడు అయిన మనువు అను రాజు వున్నాడు. ఆ మనువుకి వినుత పరాక్రమశాలి ఇక్ష్వాకుడు అనే తనయుడు జన్మించాడు.
కొన్నియేండ్లకి మనువు ఆ ఇక్ష్వాకుణ్ణి రాజ్యానికి అభిషిక్తుణ్ణి కావించాడు. ‘‘కుమారా! ప్రతిదినము ప్రజల్ని ప్రీతితో పాలించు. ధర్మ ప్రవర్తనులు అయిన ధరణిపతులకి నిత్య సౌఖ్యాలు కలుగుతాయి. నిర్మల స్థితి లభిస్తుంది. రాజు తప్పు చేసినవారిని దండించాలి. దోషం లేనివాణ్ణి శిక్షించకూడదు. భూపాలురికి- శాస్త్ర ప్రమాణాలతో దొసగులరసి తగు రీతిని ధర్మశాస్త్ర విధిని దండనం విధిస్తే స్వర్గలోక నివాసం ప్రాప్తిస్తుంది. అట్లు వర్తింపకుంటే నరకానికి పోవక తప్పదు. రాజపురుషులు పరమ ధర్మస్థితిని పాటించాలి’’ అని పలు నీతులు కరపాడు. అనంతరం ఆ మనువు దేహాన్ని విడిచి బ్రహ్మలోకానికి అరిగాడు.
తదనంతరం ఇక్ష్వాకు మహారాజు దాక్షిణ్యబుద్ధి అయి, భూమిని కుశలంగా ఏలి, పుత్ర కామేష్టియాగం కావించాడు. ఆ ఇక్ష్వాకుడికి దేవ సదృశులైన నూరుగురు కుమారులు కలిగారు. ఆ వంద మందిలో కడగొట్టు బిడ్డ మిక్కిలి అయోగ్యుడు, అవివేకి. పెద్దలయిన పూజ్యుల్ని అనాదరించి పెక్కు ఇక్కట్లు పాలు కావించేవాడు. అతడి పేరు దండుడు.
శుక్రుడి శాపము
ఆ దుష్ట చరిత్రుడు అయిన పుత్రుడి అవగుణాలు చూసి, ఇక్ష్వాకుడు ఆ దండుణ్ణి అవంధ్య పరిపాలిస్తూ వుండు అని వింధ్యకి పంపించాడు. అప్పుడు ఆ దండుడు వింద్యాచల ప్రదేశానికి ఏగి, అక్కడ ‘మధువంత’మని ఒక పురాన్ని నిర్మించి, శుక్రాచార్యుడు పురోహితుడుగా పలు సంవత్సరాలు పెక్కు యేండ్లు- ఆ రాజ్యాన్ని పరిపాలింపసాగాడు.
ఈ విధంగా రాజ్యపాలన ఒనరిస్తున్నాడు ఆ దండుడు.
-ఇంకాఉంది