చిత్తశుద్ధిలేని శివపూజలేలరా! అని అన్నారు పెద్దలు. మనం చేసే ప్రతి పనిలో దైవాన్ని చూసేవారు మహనీయులవుతారు. మనం బాగుపడాలంటే ఎదుటివాడిని చెడకొట్టడం కాదు చేయవల్సింది. మనం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి. ఎదుటివారిని మోసం చేసి.. అయినవాళ్ళను అన్యాయం చేసి సంపాదించింది సంపదే కాదు. అది ఏనాడూ నీకు నిలువదు. నీతి నిజాయితీతో సంపాదించే సంపద సర్వదా నీ ఇంట నిలుస్తుంది. అతి తెలివితో అమాయకులను చేసి మనం ఎంత సంపాదించినా అదెవరికీ మంచిది కాదు. ఏదో ఒక రోజు పాపం పండితే ఎంత పెద్ద మానైనా కూలుతుంది. బలవంతుడుకూడా అంతే! బలహీనులంతా ఏకమైతే ఎంతటివాడైనా చావుదెబ్బతింటాడు. అందుకే ఎవర్నీ మోసం చేయకుండా అన్యాయం.. అక్రమాలకు మనిషి పాల్పడకూడదు.
అందరూ మనుషలే.. అందరికీ మనసుంటుంది. అందరికీ ‘మనోభావాలు’ వుంటాయి. ఎవరిదారి వారిది. ఈ జగతిలో అరవై నాలుగు కళలు భగవంతుడు మనకు ఇచ్చాడు. కొందరికి రచనలు, మరికొందరికి చదవడం, ఇంకొందరికి చిత్రలేఖనంలపై ఆసక్తి వుంటుంది. ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అన్నారు మహనీయులు. అరవై నాలుగు కళల్లో ప్రతి మనిషికి ఏదో ఒకదానిపై ఇష్టముంటుంది. అందుకు మనం మన వంతు బాధ్యతగా ప్రోత్సహించాలి. కాని నిరుత్సహపరచకూడదు. వారి మనోభావాలను కించపర్చరాదు. అలా చేస్తే వారి మనసు ఎంత వేదనకు గురవుతుందో! ఒక్క క్షణం ఆలోచించండి మనిషిగా! ఆ స్థానంలో మీరుంటే!! ప్రశ్నించుకోండి! ఆ బాధేంటో మీకే అర్థం అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే వదలివేయండి. అంతేకాని ఒకరి మనసు నొప్పించే హక్కు మనకు లేదు.
అలాగే భగవంతుని విషయంలో చాలా అపోహలు, ఆందోళనలు మన మధ్య నెలకొన్నాయి. ఈమధ్య అధికంగా పెరిగిన మాలధారణలు.. అయ్యప్పమాల, ఆంజనేయ మాల, శివమాల, బాబామాల, బాలాజీ మాల- ఇలా నేడు భగవంతునిపై పెరిగిన భక్తికి నిదర్శనాలు. మాలధారణకు ముందు మనిషి ఎన్నో తప్పులు చేస్తుండవచ్చు.. చేయకపోవచ్చు. అది ఆ వ్యక్తిగతం. కాని మాల ధరించిన 41 రోజులు భక్తిహృదయంతో.. వ్యక్తి ఒంటిపూట భోజనం, కటిక నేలపై నిద్ర, నిత్యం పూజ పారాయణంతో గడుపుతాడు. ఆ మాల విడిచిన మరుక్షణం.. పాత అలవాట్లన్నీ షరా మామూలే. అలాంటి దృశ్యాలు మన కళ్ళముందు కోకొల్లలు. మరి ఇవన్నీ ఎందుకు !?
భగవంతున్ని కొలచిన చేతులతో పాపపు పనులు చేయడం ఎంతవరకు భావ్యం! స్వామిని స్మరించిన నోటితో పాపపు వాక్కులు ఎంత వరకు సముచితం!! మనుషుల ప్రాణాలను హరించివేస్తున్న దురలవాట్లను మానలేకపోతున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలను తీసుకొని కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచుతున్నారు. మాలధారణ మంచి నేర్పిస్తుందే తప్ప చెడు చేయమని చెప్పదు. అందుకే.. ప్రతి మనిషి మంచివైపు అడుగులువేయాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.
మానవుడు దైనందిన జీవితంలో భక్తికి ప్రాధాన్యత కచ్చితంగా ఇవ్వాలి. భక్తి మనిషిని సుమార్గాన పయనింపజేస్తుంది. ప్రతి మనిషి ప్రేమను పంచాలి. అపుడే ఈ ప్రపంచం ‘ప్రేమమయం’ అవుతుంది. భారతమైనా.. ఖురానైనా. బైబిల్ అయినా మనిషిని మంచి మార్గాన నడిచేలా చేస్తాయి. ఎవరి మార్గం వారిది. ఎవరి మనోభావాలు వారివి. ఒకరి భావాలను కించపరిచే హక్కు మానవులుగా మనకు లేదు.
ప్రతి మనిషి కామ క్రోధ మదాలను వదిలివస్తే మహాత్ముడు కాకపోయినా మహనీయుడు కాకపోయినా.. మంచి మనిషిగా మనుగడ సాగించగలడు. స్వామి వివేకానంద, రమణ మహర్షి, మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా లాంటి వారందరూ మనలాంటి మనుషులే కదా! మరి వారంతా మన హృదయాల్లో మహాత్ముల్లా నిలిచిపోయారు. వారంతటి గొప్పవాళ్ళం కాకపోయినా.. వారు చూపిన ప్రేమ మార్గాన పయనించి వారి ఆశయాలను నెరవేరద్దాం. మన భారతావని కీర్తిని దిగంతాల అంచులు దాటి దశదిశలా వ్యాపింపచేద్దాము. మన మనోభావాలను మహోన్నతంగా మల్చుకొని మనుషులుగా జీవిద్దాం. అందరి హృదయాలను గెలుద్దాం.
మంచిమాట
english title:
manchimata
Date:
Thursday, March 27, 2014