హైదరాబాద్, మార్చి 27: సార్వత్రిక ఎన్నికల్లో నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కలిపి సుమారు 3వేల 91 పోలింగ్ కేంద్రాలుండగా, ఈ నెలాఖరు వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘ గడువునివ్వటంతో వీటి సంఖ్య ప్రస్తుతమున్నవే గాక, మరో 463 పోలింగ్ కేంద్రాలు పెరగనున్నట్లు సమాచారం. వీటితో పాటుప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా దాదాపు 1400 ఓటర్లు ఉండాలని, అంతకు మించితే అదనంగా ఓ యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించగా, ఇపుడు ఆ సంఖ్యను 1600 ఓటర్లకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
అంతకు మించి ఎక్కువ మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే అంశంపై కొద్దిరోజులుగా జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతుంది. ఇలాంటి యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులంటున్నారు. అయితే ఏ నియోజకవర్గంలో ఎన్ని యాగ్జిలరీ కేంద్రాలను ఏర్పాటుచేయాలన్న విషయంపై కమిషనర్ నేతృత్వంలో ఇంకా అధ్యయనం కొనసాగుతున్నట్లు సమాచారం.
దక్షిణ మండలంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటి సంఖ్య అధికంగా ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల బదిలీపై జాతీయ ఎన్నికల
సంఘానికి ప్రతిపాదనలు
నగరంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదివరకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలున్న భవనాల్లో కొన్నింటికి మరమ్మతులు, మరికోన్నింటిని కొత్తగా నిర్మించటం వంటి కారణాల నేపథ్యంలో వాటిని సమీపంలోని ఇతర భవనాల్లోకి మార్చే అంశంపై తుది నిర్ణయాన్ని వెల్లడించాలని ఇటీవలే భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు గత సంవత్సరం డిసెంబర్ మాసంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి మార్చాలనుకుని నిర్థారించిన పోలింగ్ స్టేషన్ల జాబితాను జాతీయ ఇసికి పంపినట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ ఏజెంట్లుగా
వ్యవహరించనున్న బిఎల్‌వోలు
నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి ప్రస్తుతమున్న 3వేల 91 పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వర్తించేందుకు ఇప్పటికే నియమించిన బూత్‌లెవెల్ ఆఫీసర్లే ఇంటింటికి పర్యటించి ఓటరు స్లిప్‌లను జారీ చేస్తారని, ఒక రకంగా వారు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహారించనున్నట్లు తెలిపారు. అంతేగాక, పోలింగ్ రోజు వారివారికి కేటాయించిన పోలింగ్ బృందాల్లో వారు ఇతర ఎన్నికల సిబ్బందికి సహాయకులుగా విధులు నిర్వర్తించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు.
ఆంధ్రలో రోడ్డు ప్రమాదం
* కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
* నగర డ్రైవర్ మృతి
* ‘వినోదం’ సీరియల్ డైరెక్టర్, కుటుంబ సభ్యులకు గాయాలు
పెనమలూరు, మార్చి 27: హైదరాబాద్ నుండి భీమవరం లొకేషన్‌కు వెళ్తున్న ఒక టీవీ సీరియల్ డైరెక్టర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న కారు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలినవారు తీవ్ర గాయాలపాలయ్యారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాల వద్ద బందరు రోడ్డుపై గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ యూసఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న కాపర్తి రవి టీవీ సీరియల్స్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ‘వినోదం’ అనే సీరియల్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. సీరియల్ నిర్మాత, హైదరాబాద్‌కు చెందిన గీతాంజలి కారులో బుధవారం అర్ధరాత్రి వీరు హైదరాబాద్ నుండి భీమవరం బయలుదేరారు. భీమవరంలోని షూటింగ్ లొకేషన్‌కి వెళ్తుండటంతో ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన కుమార్తె మిలిని కూడా వస్తాననడంతో కుటుంబ సభ్యులంతా కలిసి కారెక్కారు. ఉదయం గోసాల వైపు వీరి కారు వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అదుపుతప్పి ఢీకొంది. ఈ సంఘటనలో కారుడ్రైవర్ లక్ష్మీపతి అక్కడికక్కడే మృతి చెందాడు. దర్శకుడు రవి, భార్య శ్రీదేవి, కుమార్తె మిలిని, కుమారుడు దరహాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.