హైదరాబాద్, మార్చి 27: వర్తమాన ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్ను వసూళ్ల విధులతో పాటు బిజీబిజీగా ఎన్నికల విధులను కూడా నిర్వర్తిస్తున్న అధికారులు పన్ను చెల్లించని బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియను మరింత ముమ్మరం చేశారు. కొద్దిరోజుల క్రితం వరకు అయిదు నక్షత్రాల హోటళ్లు, ప్రభుత్వ ఆఫీసుల్లోని సామాగ్రి, ఫర్నిచర్, వాహానాలను కూడా సీజీ చేసిన అధికారులు తాజాగా సోమవారం నగరంలోని హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లోని పలు పేరుగాంచిన హోటళ్లను కూడా సీజ్ చేశారు. మున్ముందు జప్తుల ప్రక్రియను మరింత ముమ్మరం చేసే దిశగా బల్దియా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో బకాయిదారుల ఆస్తుల్లోని సామాగ్రిని సీజ్ చేయటం పట్ల పాలక మండలి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీని ప్రభావం ఎన్నికల్లో తమపై పడుతుందని భావిస్తున్నా, ప్రస్తుతం రాష్టప్రతి పాలన కొనసాగుతున్నందున చేసేదేమీ లేక వౌనం వహిస్తున్నారు.
మరో వారం రోజుల్లో ముగినున్న వర్తమాన ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న సుమారు రూ. 1250 కోట్ల పన్ను వసూళ్లలో ఈ నెలాఖరుకల్లా కనీసం రూ. వెయ్యి కోట్లయినా దాటించాలని కమిషనర్ సిబ్బందికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, క్షేత్ర స్థాయిలో పన్ను వసూలు చేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు సెలవు దినాలైన ఆదివారం కూడా కలెక్షన్లలో ఉండాలని ఆదేశించారు. అంతేగాక, నగరంలోని 18 సర్కిళ్ల పరిధుల్లో ఏ ప్రాంతంలోనైనా, ఎపుడైనా అకస్మికంగా తనిఖీలు జరుపుతామని అల్టిమేటం జారీ చేయటంతో సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఇప్పటి వరకు సుమారు రూ. 650 కోట్ల మేరకు దాటిన వసూళ్లను ఈ చివరి వారం రోజుల్లో నెలలో చివరి రోజైన 31వ తేదీని మినహాయించి కనీసం రూ. 200 నుంచి రూ. 250 కోట్ల వరకు వసూలు చేయాలని సర్కిళ్ల స్థాయిలో వ్యాల్యుయేషన్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు లక్ష్యాలు విధించారు. ఒకవైపు ఎన్నికల విధులు నిర్వర్తిస్తూనే పన్ను వసూళ్ల టార్గెట్లను అధిగమించే దిశగా విధులు నిర్వహిస్తున్న అధికారులు గతంలో మాదిరిగా బకాయిదారులతో తరుచూ సంప్రదింపులు జరిపే పరిస్థితులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇందుకు పనిభారం ఓ కారణమైతే, పన్ను వసూళ్లకు సంబంధించి టార్గెట్ల ప్రకారం వసూళ్లు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ చేసిన ప్రకటనతో అధికారులు బకాయిదారులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.
* పన్ను చెల్లించని పలు హోటళ్లు సీజ్ * అధికారులకు పెరగనున్న టార్గెట్లు * జప్తులపై పాలక మండలి అసంతృప్తి
english title:
seizure
Date:
Friday, March 28, 2014