ఖైరతాబాద్, మార్చి 27: తమ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారి నుండి తమను రక్షించాలని ఛత్రపతి శివాజీ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు అంజనేయులు, చక్రపాణి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గోపనపల్లి గ్రామంలో తామంతా చాలా సంవత్సరాల క్రితం స్థలాలు కొనుగోలు చేసుకున్నామని, వందల ఎకరాల్లో సుమారు నాలుగు వేల మంది స్థలాలు కొనుగోలు చేసుకున్నామని తెలిపారు. అయితే సదరు భూములకు ప్రస్తుతం ధరలు పెరగడంతో వాటిని డి.రామానాయుడు కుమారుడు సురేష్‌బాబు కబ్జా చేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా ముందు తమను పిలిపించి తాము చెప్పిన ధరకు స్థలాలు ఇవ్వాలని కోరగా తాము నిరాకరించడంతో ఎలాగైనా తమ స్థలాలను లాక్కొవాలనే దురుద్దేశంతో వారి అంగబలం, అర్ధబలంతో తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను సైతం తారుమారు చేశారని ఆరోపించారు. ఎన్నోఏళ్లు కష్టించి కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుగోలు చేసుకున్న స్థలాలను కబ్జా చేస్తే తాము ఎలా జీవించాలని రియాజ్ అనే బాధితుడు కన్నింటి పర్యంతమయ్యాడు. ఈ విషయమై గవర్నర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేంద్రం, భార్గవి పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌లో మహిళలకు పెద్దపీట
కెపిహెచ్‌బి కాలనీ, మార్చి 27: టిఆర్‌ఎస్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు కూకట్‌పల్లి నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు అన్నారు. గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్‌కు చెందిన మహిళలు ఉమావతిగౌడ్, శ్యామల ఆధ్వర్యంలో గొట్టిముక్కల పద్మారావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారని అదే స్ఫూర్తితో పునఃనిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు. తెలంగాణ వాదులతో పాటు మహిళలు రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుచ్చమ్మ, సాయమ్మ, మల్లేశ్వరి, రాములమ్మ, నాగమణి, శారద, చిన్నక్క, చిత్తారమ్మ, బాలనర్సమ్మ, సుగుణ, కొమురమ్మ, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి
ముషీరాబాద్, మార్చి 27: యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసును క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా ఇంక్రిమెంట్లు, ఇన్సూరెన్స్, పిఎఫ్, వైద్య సదుపాయాలను, నివాస క్వార్టర్లను కేటాయించాలని అన్నారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్, అకాడమిక్ అంశాల నిర్ణయాత్మక కమిటీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సముచిత స్థానం కల్పించాలని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరారు. కార్యక్రమంలో టిఆక్టా సభ్యులు ఎం.రామేశ్వర్ అర్జున్‌కుమార్, రాజేశ్ ఖన్న, ధర్మతేజ, దత్రాత్తి, రవీందర్‌రెడ్డి, నారయణ, వీరేందర్, వెంకటేశ్వర్లు, నాగేందర్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.