హైదరాబాద్, మార్చి 27: రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఓటర్లలో అవగాహనతో పాటు వారిని చైతన్యవంతులను చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన అవగాహన పరిశీలకురాలు నిధిపాండే సూచించారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఓటర్ల అవగాహన కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల నమోదు గణనీయంగా పెరిగిందని గత నవంబర్ వరకు జిల్లాలో 43లక్షల ఓటర్లుంటే గత నాలుగు నెలల్లో దాదాపు 7లక్షల ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు వీలుగా ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని, ఓటర్లను తగు సమాచారాన్ని అందించేందుకు సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఓటింగ్‌లోపాల్గొనేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ తొందరగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తెలిసే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ఓటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆమె సూచించారు.
జిల్లాలో ఓటర్ల చైతన్య కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా స్వయం సహాయక సంఘాలు, పారిశ్రామిక వేత్తలు, కళాశాలల యాజమాన్యాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో 58శాతం మాత్రమే ఓటింగ్ జరిగిందని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యిందని, ఈ ధఫా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవి రెడ్డి, చంపాలాల్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఓటర్ల అవగాహణ నోడల్ అధికారి డాక్టర్ అనంతం, ఎంసిసి నోడల్ అధికారి చంద్రకాంత్‌రెడ్డి, ఎన్నికల విభాగం డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఓటింగ్ శాతాన్ని పెంచేలా అధికారులు చొరవ తీసుకోవాలి
english title:
voting percentage
Date:
Friday, March 28, 2014