ఒక యేటి చైత్రమాసంలో కడు హర్షంతో భార్గవుడైన శుక్రాచార్యుడి ఆశ్రమానికి చనుదెంచాడు. ఆ ఆశ్రమ వాటిలో ఒక యెడ- సౌందర్య లక్ష్మి తనువు తాల్చినట్లున్న ఒక సుందరాంగనని కాంచాడు.
మన్మథ బాణం పరవశుడు అయాడు. ఆ సుకుమారిని కదియ ఏతెంచాడు. ‘‘విలాసినీ! నువ్వు ఎవ్వతెవి? నీ నామం ఏమిటి? ఎక్కడికి వెడుతున్నావు? నిన్ను కాంచి, నీ వలపు వాగురలో చిక్కుకొన్నాను. దయతలచి నా కోరిక తీర్చు. నిన్ను నమ్మాను. నాతో పలుక తగదా?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడా సుకుమారి ‘‘అవనీశా! నేను శుక్రాచార్యుడి అగ్ర తనయని. నన్ను ‘అరజ’ అంటారు. నన్ను అవమతితో తలపకు. మా తండ్రి ఆజ్ఞతో నేను ఎప్పుడూ ఇక్కడ నియతితో చరిస్తూ వుంటాను.
రాజా! నువ్వు మా తండ్రి శిష్యుడివి. గురుపుత్రికని ఈ గతి తలపవచ్చా? మా తండ్రి అన్యాయం సెపడు. ఆగ్రహించి శపిస్తాడు. కనుక నన్ను వరింప తలచితే మా తండ్రి అనుజ్ఞ గైకొని ధర్మప్రకారంగా నన్ను పరిణయం చేసుకో. నువ్వు అర్థిస్తే మా తండ్రి అంగీకరించవచ్చు’’ అని పలికింది.
కాని రోగికి పథ్యంలాగు దండుడికి ఆమె వాక్కులు సమ్మతం కాలేదు. తన గురువు శుక్రుణ్ణి అడగడం అంగీకారం కాక అతడు ఉద్ధతుడై ‘‘సుకుమారీ! ఇప్పుడు నిన్ను అనుభవిస్తే చాలు.
లేకుంటే నా ప్రాణం పోతుంది. ఎట్టి కీడు అయినా మూడనీ’’ అంటూ బలాత్కారంగా ఆమె చెయ్యి పట్టి వద్దని ఎంత వారించినా వినక తన వాంఛ తీర్చుకొన్నాడు. వెంటనే తన మధువంతపురానికి మరలిపోయాడు.
అంత శుక్ర తనూజ అరజ ఆ విధంగా చేడ్పాటు పొంది, మిక్కిలి భీతి చెంది ‘‘నా తండ్రి యిక్కడికి ఎప్పుడు ఏతెంచుతాడో? ఈ చేటు నా తండ్రికి తెలియచెప్పాలి’’ అనుకొంటూ తనకి జరిగిన పరిభవాన్ని తలచుకొంటూ, శోకిస్తూ వుంటే శుక్రాచార్యుడు వచ్చాడు. వచ్చి ధూళి క్రమ్మిన ఒడలు, తొరగు కన్నీరు, జారిన కేశపాశం, వెలవెలపోయిన మోము కాంచి ‘‘ఓ పుత్రీ! ఇది ఏమిటి? ఎందుకి ఇలా శోకిస్తున్నావు? ఏమి జరిగింది? నాకు తెలుపవలసింది’’ అని బుజ్జగిస్తూ ప్రశ్నించాడు.
అరజ బోరన విలపిస్తూ ‘‘దండుడు నన్ను పట్టుకొని తగదు- ఒల్లను- అని బతిమాలినా వినక, కండ క్రొవ్వుతో ఈ రీతిగా పరిభవించాడు’’ అని చెప్పింది.
ఆమె మాటలు విన్న వెంటనే అఖిల లోకాల్ని కాల్చే రీతిగా మండి ‘‘శిష్యులారా! విన్నారా! వీడి సాహసం? అగ్నికీల రీతి మహామహిమతో వెలిగే నా సుతను పట్టి జంకు కొంకులు లేక పరాభవించాడు. ఈ పాప కర్ముడు ఏలే నగరానికి నూరేసి యోజనాల మేర- ఏడు దినాలు మంటలు దట్టమై వ్యాపించి, ధూళి కురిసి, భృత్య వాహన బల సమేతంగా వీడి రాజ్యం నాశనం అవుతుంది’’ అని ఘోర శాపం ఒసగాడు.
తర్వాత తన పుత్రికను కనుగొని కరుణతో ‘‘అరజా! ఈ తావు వదలి అక్కడ వున్న సరసీతటాన సంచరిస్తూ వుండు. ఆ పద్మవనానికి పరిసరాల ఆమడ మేర ప్రాణులకి అపాంశు భీతి వుండదు.
ఏ ప్రాంతం నుంచి నీ చెంతకు వచ్చి నిన్ను ఆశ్రయించు ప్రాణులకి ఆపదలు కలుగవు. దండుడి దేశంలో వున్న వారందరూ అతడితోనే నశించారు’’ అని పలికి ఆ శుక్రాచార్యుడు మరొక ఆశ్రమానికి అరిగాడు. అతడి కుమార్తె అరజ తన జనకుడి వాక్యం పాటించి అక్కడ నిలువక వెళ్లిపోయింది.
అంత అక్కడ సాంద్రమైన రజోవర్షం అంతకంతకి ఘోరమై సప్తవాసరాలు కురిసింది. దండుడు తన సచివ, భృత్య, వాహన సహితుడై అక్కడి మృగములతోపాటు నశించిపోయాడు.
ఆ దేశం అంతా అడవిగా మారిపోయింది. అప్పటినుంచి దానికి ‘దండకారణ్యం’ అని ప్రసిద్ధి వచ్చింది. రాజవరేణ్యా! ఆ అరణ్యంలో జనులు ఘోరతపం సల్పడం కారణంగా దానిని ‘జనస్థానం’ అనీ పిలుస్తారు.
-ఇంకాఉంది
ఒక యేటి చైత్రమాసంలో కడు హర్షంతో భార్గవుడైన
english title:
ranganatha
Date:
Saturday, March 29, 2014