
న్యూఢిల్లీ, మార్చి 28: ఏడో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జరిగే సమయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌ను నియమిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న ఉపాధ్యక్షుల్లో ఒకరు బోర్డు వ్యవహారాలను చూసుకోవాలని సూచించింది. ఆరో ఐపిఎల్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే బోర్డు అధ్యక్ష స్థానం నుంచి శ్రీనివాసన్ వైదొలగాల్సిందేనని తేల్చిచెప్పింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడిగా జూలై నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించకుండా శ్రీనివాసన్‌ను అడ్డుకోలేమని తెలిపింది. ఈ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను ఏడో ఐపిఎల్‌లో పాల్గొనకుండా నిరోధించనున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని సుప్రీం ఉత్తర్వులతో స్పష్టమైంది. ఆ రెండు జట్లు ఐపిఎల్‌లో ఆడవచ్చని కోర్టు ధర్మాసనం అనుమతించింది. ఐడో ఐపిఎల్ సమయంలో బిసిసిఐకి గవాస్కర్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటాడని వివరించింది. ఐపిఎల్‌కు సిఓఓగా వ్యవహరిస్తున్న సుందర్ రామన్ సేవలను కొనసాగించాలా వద్దా అన్నది గవాస్కర్ నిర్ణయానికే విడిచిపెడుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 16వ తేదీకి కేసును వాయిదా వేసింది. అప్పటి వరకూ మధ్యంతర ఉత్తర్వులనే తీర్పుగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలావుంటే, సీనియర్ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ బిసిసిఐ వ్యవహారాలు చూసుకుంటాడని బోర్డు ప్రకటించింది. సీనియర్ ఉపాధ్యక్షుల్లో ఒకరికి ఆ బాధ్యతలు అప్పచెప్పాలని సుప్రీం కోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకొని, శివలాల్‌ను ఎంపిక చేసినట్టు తెలిపింది.
కార్యదర్శితో మాట్లాడిన తర్వాతే..
బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌తో మాట్లాడిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని శివలాల్ యాదవ్ ప్రకటించాడు. తాను ఇంకా పటేల్‌తో మాట్లాడలేదని అన్నాడు. బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఐపిఎల్‌పై అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వలేదు. ఐపిఎల్ సమయంలో బోర్డు అధ్యక్షుడిగా సునీల్ గవాస్కర్ ఉంటాడని చెప్పాడు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని స్పష్టం చేశాడు.