
న్యూఢిల్లీ, మార్చి 28: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో బిసిసిఐ బాసటగా నిలిచింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ధోనీ పేరును కొందరు అనుసరంగా చేర్చారని కోర్టు ధర్మాసనానికి బోర్డు తరఫు లాయర్లు తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన గురునాథ్ మెయ్యప్పన్‌కు అనుకూలంగా ధోనీ ఏనాడూ ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. అంతకు ముందు, మెయ్యప్పన్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని ధోనీ మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చాడని బిసిసిఐపై కేసు దాఖలు చేసిన బీహార్ క్రికెట్ సంఘం తరఫు లాయర్ హరీష్ సాల్వే ఆరోపించాడు. వాస్తవానికి అతను చెన్నై ఫ్రాంచైజీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నాడనే విషయం కెప్టెన్ ధోనీకి తెలియదా అని ప్రశ్నించాడు. ఒక క్రికెట్ అభిమానితో కలిసి మ్యాచ్‌లకు ముందు, ఆతర్వాత మైదానంలో ధోనీ ఎలా కనిపించాడని ప్రశ్నించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యజమాని, బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు మెయ్యప్పన్ అల్లుడన్న విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నాడు. అల్లుడి హోదాలో చెన్నై ఆటగాళ్లతోనేగాక, ధోనీతోనూ కలిసి అతను ఎన్నోసార్లు మీడియాకు కనిపించాడని సాల్వే వివరించాడు. మెయ్యప్పన్ గురించి వివరాలు తెలిసినప్పటికీ, అతనిని కేవలం క్రికెట్ అభిమానిగానే ధోనీ పేర్కోవడం ఐపిఎల్ విచారణ అధికారులను తప్పుతోవ పట్టించడమేనని ఆరోపించాడు. కాగా, సాల్వే ఆరోపంలను బిసిసిఐ తరఫు లాయర్లు తోసిపుచ్చారు. మెయ్యప్పన్‌కు అనుకూలంగా ధోనీ ఎన్నడూ ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. విచారణ అధికారులను ధోనీ తప్పుతోవ పట్టించాడన్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదన్నారు. జట్టు కెప్టెన్‌గా సేవలు అందించిన ధోనీకి మిగతా విషయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద ధోనీపై వచ్చిన ఆరోపణలను వాస్తవ దూరమంటూ వాదించిన బిసిసిఐ అతనికి అండగా నిలిచింది. ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో తన పేరును చేరుస్తూ కథనాలను ప్రసారం చేసిన ఒక చానెల్‌పై ధోనీ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అతను కోర్టును ఆశ్రయించడంలో బిసిసిఐ పాత్ర ఉందన్న వాదన వినిపిస్తున్నది. ఇలావుంటే, ధోనీ పేరును ఈ వివాదంలోకి తీసుకురావడం దురదృష్టకరమని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించాడు. వాస్తవానికి స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర విషయాల్లో ధోనీకి ఎలాంటి సంబంధం లేదన్నాడు. వివాదంలోకి అతని పేరును ఎందుకు తెస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పాడు. సుప్రీం కోర్టులో ధోనీకి అనుకూలంగా తమ వాదన వినిపించా మని శుక్లా తెలిపాడు.
చిత్రం... గురునాథ్ మెయ్యప్పన్‌తో ధోనీ (ఫైల్ ఫొటో)
కోర్టు ఉత్తర్వులు మాకు ఆమోదయోగ్యమే: బిసిసిఐ
న్యూఢిల్లీ, మార్చి 28: ఏడో ఐపిఎల్ సమయంలో బిసిసిఐ అధ్యక్ష పదవిని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు అప్పగించాలని, అప్పటి వరకూ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎవరైనా కార్యకపాలను నిర్వహించాలని సుప్రీం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై బోర్డు సానుకూలంగా స్పందించింది. ఈ ఉత్తర్వులు తమకు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. సీనియర్ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ బిసిసిఐ వ్యవహారాలు చూస్తాడని చెప్పాడు. ఏడో ఐపిఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను తొలగించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించకపోవడం హర్షణీయమని అన్నాడు. క్రికెట్ అభిమానులకు ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్నిస్తుందని చెప్పాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈసారి ఐపిఎల్‌లో ఎనిమి జట్లూ పాల్గొంటాయని అన్నాడు.