
కీబిస్కేన్, మార్చి 28: సోనీ ఓపెన్ మియామీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా బ్యూటీపై ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి ఆధిపత్యాన్ని రుజువు చేసింది. సెమీ ఫైనల్‌లో షరపోవాను 6-4, 6-3 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2004 తర్వాత షరపోవాపై సెరెనాకు ఇది వరుసగా 15వ విజయం. మొత్తం మీద వీరిద్దరూ 18 పర్యాయాలు ఢీకొంటే, సెరెనా 16 సార్లు గెలిచింది. షరపోవా కేవలం రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సెరెనాను ఓడించి వరుస పరాజయాలకు బ్రేకు వేయాలనుకున్న షరపోవా ప్రయత్నం ఈసారి కూడా ఫలించలేదు. కాగా, డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సెరెనా టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి నాలీని ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో నాలీ 7-5, 2-6, 6-3 తేడాతో డొమినికా సిబుల్కొవాపై గెలిచింది. ఇటీవల చక్కటి ఫామ్‌తో రాణిస్తున్న నాలీ ఫైనల్‌లో ప్రపంచ మేటి సెరెనాకు ఏ స్థాయిలో పోటీనిస్తుందో చూడాలి.
ఇలావుంటే, పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో అతను మిలోస్ రవోనిక్‌ను 4-6, 6-2, 6-4 తేడాతో ఓడించి, ఏడో ర్యాంక్ ఆటగాడు థామస్ బెర్డిచ్‌తో సెమీస్ పోరు ఖాయం చేసుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో బెర్డిచ్ 6-4, 7-6 ఆధిక్యంతో అలెక్సాండర్ డొల్గొపొలొవ్‌పై విజయం సాధించాడు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కెయ్ నిషికొరి, నొవాక్ జొకొవిచ్ తలపడతారు. క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెదరర్‌ను నిషికొరి ఓడించగా, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రేపై జొకొవిచ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.