న్యూఢిల్లీ, మార్చి 28: సుప్రీం కోర్టు శుక్రవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు క్రికెట్‌కు మేలు జరుగుతుందని ఆరో ఐపిఎల్‌లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహించిన మాజీ న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ వ్యాఖ్యానించాడు. ఈ ఉత్తర్వులు సమతూకంగా ఉన్నాయని పేర్కొన్నాడు. తాను కూడా ఇంకంటే ఏమీ ఊహించలేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఏడో ఐపిఎల్ సమయంలో బిసిసిఐ అధ్యక్షుడిగా సునీల్ గవాస్కర్‌ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. గవాస్కర్ అత్యుత్తమ ఆటగాడని, కామెంటేటర్‌గా కూడా రాణించాడని తెలిపాడు. అతని అపారమైన అనుభవం బిసిసిఐకి ఉపయోగపడుతుందని అన్నాడు. ఏడో ఐపిఎల్ ప్రారంభమయ్యే రోజైన ఏప్రిల్ 16న సుప్రీం కోర్టు తుది తీర్పు ఇస్తుందని ముద్గల్ అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ఏడో ఐపిఎల్‌లో ఆడే అవకాశం కల్పించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కొంత మంది చేసిన పొరపాటుకు అమాయకులైన ఆటగాళ్లు నష్టపోరాదని అన్నాడు. ఈ అభిప్రాయంతోనే సుప్రీం కోర్టు ఈ రెండు ఫ్రాంచైజీలకు ఐపిఎల్‌లో ఆడే అవకాశమిచ్చి ఉంటుందని అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల్లో నిజానిజాలు వెల్లడయ్యే వరకూ ఐపిఎల్‌ను రద్దు చేయాలని బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌సహా పలువురు చేసిన డిమాండ్‌లో అర్థం లేదని ముద్గల్ అన్నాడు. టోర్నీని రద్దు చేసినంత మాత్రాన లాభం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నాడు. క్రికెట్‌లో అవినీతికి తెరపడాలని, ఆ రోజు కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
‘సుప్రీం’ ఉత్తర్వులపై ముద్గల్ వ్యాఖ్య
english title:
cricket
Date:
Saturday, March 29, 2014