
మీర్పూర్, మార్చి 28: ఈసారి టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో హాట్ ఫేవరిట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొని, సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిన ఆసీస్ శుక్రవారం వెస్టిండీస్‌ను ఢీకొని ఆరు వికెట్ల తేడా మ్యాచ్‌ని చేజార్చుకుంది. క్రిస్ గేల్ అద్భుత హాఫ్ సెంచరీ, చివరిలో కెప్టెన్ డారెన్ సమీ మెరుపు ఇన్నింగ్స్ వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 178 పరుగులు సాధించింది. గ్లేన్ మాక్స్‌వెల్ 22 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రాడ్ హాడ్జ్ 26 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు. విండీస్ బౌలర్లలో బద్రీ, మార్లొన్ శామ్యూల్స్, సునీల్ నారైన్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
సంక్లిష్టంగా కనిపించిన 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు డ్వెయిన్ స్మిత్, క్రిస్ గేల్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించిన తర్వాత మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి స్మిత్ (17) అవుట్‌కావడంతో విండీస్ మొదటి వికెట్ కోల్పోయింది. లెండల్ సిమన్స్ (26)తో కలిసి రెండో వికెట్‌కు 51 జోడించిన తర్వాత గేల్ వెనుదిరిగాడు. అతను 35 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి జేమ్స్ ముయిర్‌హెడ్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు చిక్కాడు. మార్లొన్ శామ్యూల్స్ 12 పరులు చేసి అవుట్‌కావడంతో విండీస్ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఈ దశలో డ్వెయిన్ బ్రేవో, కెప్టెన్ సమీ జట్టును ఆదుకున్నారు.
చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు సాధించాల్సి ఉండగా, స్టార్క్ వేసిన ఓవర్‌లో సమీ 19 పరుగులు రాబట్టాడు. మొదటి బంతిని సిక్స్‌గా మలచి, ఆతర్వాత రెండు పరుగులు చేశాడు. మూడో బంతిని బౌండరీకి తరలించాడు. నాలుగో బంతిలో రెండు పరుగులు చేసి, ఐదో బంతిలో మరోసారి ఫోర్ కొట్టాడు. చివరి బంతిలో ఒక పరుగు చేయడం ద్వారా చివరి ఓవర్‌లో స్ట్రయికింగ్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. ఆ ఓవర్‌లో విజయానికి 12 పరుగులు అవసరంకాగా, విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే బాధ్యతను జేమ్స్ ఫాల్క్‌నెర్ స్వీకరించాడు. మొదటి రెండు బంతులను అతను డాట్ బాల్స్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. మిగతా నాలుగు బంతుల్లో విండీస్ 12 పరుగులు చేయగలుగుతుందా అన్న అనుమానం తలెత్తింది. అయితే, సమీ వరుసగా రెండు సిక్సర్లు బాది, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విండీస్‌ను గెలిపించాడు. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసిన విండీస్ ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
chitram..
ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆనందంలో డ్వెయిన్ బ్రేవో (ఎడమ), డారెన్ సమీ (కుడి)తో కలిసి డాన్స్ చేస్తున్న వెస్టిండీస్ సూపర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (మధ్య).