Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఒరేయ్! కన్నా.. (కథ )

$
0
0

హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చెప్పులు వేసుకుంటున్న నేను ఆగిపోయాను. కారిడార్‌లో గట్టిగా వినబడుతున్న సుభద్రమ్మ గారి అరుపులు.. చిన్నగా సంజాయిషీ ఇస్తున్న మాధవి గొంతు.
ఎప్పుడూ సరదాగా పెద్దల నవ్వులు, పిల్లల పరుగులు, కేరింతలు తప్ప గొడవలు వినబడని మా ఫ్లోర్‌లో ఇదేమిటి కొత్తగా? అనుకుంటూనే తలుపుతీసి.. తాళం వేయబోతున్న నన్ను ఇద్దరూ కలిసి ఆపేశారు.
‘చూడండి! మా మనవడిని మాధవి ఏమంటుందో? ఇది న్యాయమేనా?’ విషయం తెలియని నన్ను న్యాయమడుగుతున్న ఆవిడకేం సమాధానం చెప్పాలి?
కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతూ మాధవి. అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థంగాక అమాయకపు చూపులతో మాధవి కూతురు.. చంకలో!
ఏదో అయ్యిందని అర్థమయింది. విషయమే తెలియదు. ఆఫీసు టైమయిందని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ మనస్సు అంగీకరించలేదు. కారణం.. ఇంతింతై వటుడింతై.. ఆ గొడవ పెరిగితే, ఆ ప్రభావం ఇరుగు పొరుగైన మా మీద కచ్చితంగా పడుతుంది.
‘ఏమయింది మాధవీ?’ మృదువుగా అడిగాను. ఆమాత్రానికే కదలిపోయిందామె.
‘ఏమీ లేదక్కా! వీళ్ల మనవడిని ‘‘ఒరేయ్! కన్నా’’ అన్నాను. అంతే’
దుఃఖంతో ఆమె కంఠం మూసుకుపోయింది.
ఆ లోటు సుభద్రమ్మగారు పూరించారు.
‘‘ఒరేయ్’’ ఏంటండీ? చిన్నపిల్లాడిని పట్టుకుని అరేయ్! ఒరేయ్! ఏంటి? అసహ్యంగా! మా మనవడు ఏమన్నా పనివాళ్ల పిల్లాడా? వాడు అమెరికాలో పుట్టిన సిటిజన్. ఏదో సెలవులకు ఇక్కడకు వచ్చాడు గాని, ఇరుగుపొరుగూ కాబట్టి పిల్లలతో కలిసి ఆడుకోనిస్తే.. ఆ చనువు తీసుకుని ‘ఒరేయ్, అరేయ్’ అంటే ఊరుకోవాలా? వయస్సు రాగానే సరికాదు. ఎవ్వరితో ఎలా మాట్లాడాలో తెలియాలి’’ అంటూ దులిపేస్తున్న ఆవిడది అజ్ఞానమనుకోవాలో? లేక అహంకారం అనుకోవాలో అర్థం గాలేదు నాకు.
‘పిల్లలను, అందునా చిన్నవాళ్లను ఆప్యాయంగా ‘ఒరేయ్! కన్నా’ అనడంలో తప్పేముంది. అది నిత్యజీవితంలో సహజమే గదా!’ అన్నాను.
అంతే! మరోసారి కయ్యిమంది ఆవిడ.
‘అరె! ఇంత చదువుకున్నారు... మీరూ అలాగే మాట్లాడతారే! వాడేమన్నా మామూలు పిల్లవాడా? మా కుటుంబాలలో.. ఆమాటకొస్తే మా వంశంలోనూ, వాళ్ల నాన్నగారి వంశంలోనూ మొట్టమొదటగా అమెరికాలో పుట్టిన పిల్లాడండీ. మా అందరి కంటిదీపం. మేమంతా అల్లారుముద్దుగా చూసుకునే మా యింటి సౌభాగ్యం. ఎప్పుడూ పిల్లల మధ్య ఉండే మీకు ఇది తప్పుకాదేమో కానీ, మాకుమాత్రం చాలా పెద్ద తప్పు. అవమానం కూడా!’ అంది.
ఆవిడ వాక్ప్రవాహం ఇక ఏమాత్రం ఆగదని నాకర్థమైపోయింది. మాధవినుద్దేశించి ‘పాపకి టిఫిన్ పెట్టావా?’ అంటూ విషయం మళ్లించాలనే ప్రయత్నం చేశాను.
అప్పటికి తేరుకున్న మాధవి పాపకు తినిపిస్తూనే.. ‘వాళ్ల మనవడు కనబడితే ‘‘ఒరేయ్! కన్నా..!’’ టిఫిన్ తిన్నావా? మీ అమ్మమ్మ ఏం పెట్టారురా?’ అన్నానక్కా. అదే ఈ గొడవకు మూలం’ అని వివరించింది. ‘అయినా నీ కూతురి వయస్సు మూడేళ్లు. దాన్ని నేను ‘‘ఒసేయ్! అసేయ్! టిఫిన్ తిన్నావా?’’ అంటే నీకెలా ఉంటుంది?’
సుభద్రమ్మగారి వాగరి ఆగడం లేదు. అప్పటికే పై ఫ్లోర్ వాళ్లూ, కింద ఫ్లోర్ వాళ్లూ బయటకు వచ్చి వింటున్నారు. పాపం మాధవి. నాకే ఇబ్బంది అన్పించింది. అందుకే కొంచెం స్వరం పెంచాను.
‘‘సుభద్రమ్మ గారూ.. ఇప్పుడు మీరు కూడా ఆవేశంలోనో, కోపంలోనో మాధవిని ఏకవచన ప్రయోగం చేశారు. కోపం అన్నాగానీ ఆమె కూతుర్ని ఒసేయ్! అసేయ్ అంటే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తూ.. ప్రశ్నలోనే అనేశారు. మాధవి మీ మనవడిని ‘‘ఒరేయ్’’ అన్నదానికి ‘‘ఇది సరి’’! పిల్లలు తగాదాలు పడితే తీర్చాల్సిన మనమే పిల్లల్లాగా చాలా అల్పమైన విషయాలకు గొడవపడటం ఏమిటండీ? మంచో, చెడో జరిగిపోయింది. అమెరికాలో పుట్టినా, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినా అందరూ పుట్టేది ఒక లాగానే ఉంటుంది గదా! నిజానికి అమెరికాలో పుట్టడం వల్ల అక్కడ పౌరసత్వం లభిస్తుందేమోగానీ, ఓ మనిషి జన్మను.. శిశువుగా, పసిగుడ్డుగా చూసే అవకాశం ఒకరిద్దరికి తప్ప ప్రపంచానికి ఉండటం లేదు గదా! ఆ మాటకొస్తే.. మీరు కూడా మీ మనవడిని పుట్టిన రెండేళ్ల తరువాత ఇప్పుడు చూస్తున్నారు. పెంపకం అంటారా? కుటుంబాలను బట్టి, ఆచారాలను బట్టి మారుతుంది. ఇందాక మీరే అన్నారు. వయస్సు వస్తే సరా! ఎవ్వరితో ఎలా మాట్లాడాలో తెలియాలి అని. మీకన్నా మాధవి చిన్నది. మాధవి కన్నా పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లకు ఆదర్శంగా ఉండాలిగానీ... ఇలా అరుచుకుంటే ప్రయోజనం ఏముంది?
సెలవులు ముగిశాక మీ మనవడు, పిల్లలు అమెరికా వెళ్లిపోతారు. మీరూ.. మాధవి.. మనం... ఇక్కడే ఉండాలి. తెల్లారిలేస్తే ఒకరినొకరం చూసుకోవాలి. ఆ మాటకొస్తే మీరు, మీ వారూ ఈ వయస్సులో ఇక్కడ మామధ్య ఉన్నారు. రేపు ఏదయినా అవసరం వస్తే మీరు ముందు పిలిచేది, అవసరానికి ముందుకొచ్చేది మేము గానీ, అమెరికాలో వున్న మీ పిల్లలా? ఈ ఊరిలో ఉన్న మీ బంధువులు కూడా ఎంతోదూరంలో ఉన్నారు. మాధవి, మీరూ తప్ప.. ఈ ఫ్లోర్‌లో పగటిపూటి వుండేది ఇంకెవరు? మేమందరం బయటకు వెళ్లేవాళ్లమే. మాధవి అన్నది ఓ చిన్నమాట.. ‘‘ఒరేయ్! కన్నా’’! అని. అందులో తప్పయితే నాకనిపించడం లేదు. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్యండి’ అన్నాను.
‘అక్కా! మీకు టైమ్ అయ్యింది’ మాధవి గుర్తుచేసింది.
ఏమనుకున్నారో సుభద్రమ్మ గారు ‘అమ్మాయ్ మాధవీ! ఏమీ అనుకోకు. ఏదో అసలుకన్నా వడ్డీ ముద్దని, మనవడి మీద వల్లమాలిన ప్రేమ అలా అన్పించింది. ఇదేమీ మనస్సులో పెట్టుకోకు. అన్నట్లు వంటేం చేస్తున్నావు?’ మామూలుగా మారిపోయిన ఆవిడ పెద్దరికం బయటకు వచ్చింది.
వాళ్లిద్దరూ కలిసిపోవడం చూసి.. ‘వస్తాను’ అంటూ మెట్టు దిగుతున్న నా మనస్సులో ‘అమ్మ అమెరికా!? నువ్వు ఇరుగు పొరుగు రాజ్యాల మధ్యేగాదు.. సుఖంగా వున్న ఇరుగూ పొరుగుల మధ్య కూడా గొడవలు పెడుతూ ‘‘వామ్మో’’ అనిపిస్తున్నావు. నీ భావదాస్యం నుంచీ మా ప్రజలెప్పుడు బయటపడతారో కదా?’ అని నాకనిపించింది.

డాక్టర్ దుట్టా శమంతకమణి,
విజయవాడ. సెల్ నెం: 9491962638

చిన్ని కథ

అరిటాకు
ఒకపుడు బతకలేక బడిపంతులు అనేవాళ్లు. ఇప్పుడేమో బతకనేర్చిన బడిపంతుళ్ల కాలం వచ్చేసింది. ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి డిఇవో ఆకస్మిక తనిఖీ. ఆరో తరగతి ‘సి’ సెక్షన్‌లో డిఇవో ఒక విద్యార్థిని లేపి ‘‘విమానం కనిపెట్టింది ఎవరు?’’ అనడిగారు. ‘‘రైట్ సోదరులు సార్’’ చెప్పాడు విద్యార్థి. డిఇవో మరో విద్యార్థిని లేపి ‘‘రైలింజన్ కనిపెట్టింది ఎవరు?’’ అన్నారు. ‘‘రాంగ్ సోదరులు సార్’’ అన్నాడు విద్యార్థి. డిఇవోకి చిర్రెత్తుకొచ్చి మరో రెండేళ్లలో రిటైర్ కానున్న సైన్సు మాస్టారిని సస్పెండ్ చేసి వెళ్లారు. ఒక్కసారిగా క్లాస్‌రూమ్ నవ్వులతో నిండిపోయింది. మాస్టారు కోపంతో ఇందాక రైలింజన్‌కి కావాలనే రాంగ్ ఆన్సర్ చెప్పిన విద్యార్థి మీదికి డస్టర్ విసిరారు. అతి లాఘవంగా డస్టర్ అందుకున్న ఆ విద్యార్థి నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు. ఒకరోజు డిఇవోకి అసలు నిజం తెలిసి మాస్టారి సస్పెన్షన్ రద్దు చేశారు. పేరెంట్స్‌కి కబురెట్టారు. ముల్లులాంటి విద్యార్థులు స్కూల్‌కి వెళ్లి చదవకపోయినా, ఇంటివద్ద చదవకపోయినా వాళ్ల పేరెంట్స్ మాత్రం అరిటాకు లాంటి ఉపాధ్యాయుల్ని తప్పుపట్టటం ఎంతవరకు సమంజసం అన్నారు. ‘‘మా కళ్లు తెరిపించారు సార్! ఇకనుంచి మా పిల్లల చదువు విషయంలో మేము సైతం శ్రద్ధ చూపుతాం’’ ముక్తకంఠంతో బదులిచ్చారు పేరెంట్స్. ‘‘వెరీగుడ్’’ సంతృప్తిగా అన్నారు డిఇవో. అనంతరం తేనీటి విందు జరిగింది మాస్టారి ఖాతాలో...
డి వెంకట్రావు
ఉయ్యూరు, కృష్ణా జిల్లా

పుస్తక పరిచయం

కవి చెక్కిన నవ్వుల శిల్పాలు!

కవి, రచయిత, పత్రికా సంపాదకుడు, ప్రచురణకర్తగా అనేక రంగాలలో తన ప్రతిభను చూపుతూ కార్టూనిస్టుగా సమాజంలో జరిగే అనేక సంఘటనలను సూటిగా విమర్శించటం మనం చలపాక ప్రకాష్ కార్టూన్లు-2లో చూడవచ్చు.
అనేక పదాలలో చెప్పే ఒక మాటను కొద్ది అక్షరాలతో మనస్సుకు సూటిగా చెప్పి హాస్యంతో పాటు, ఆలోచింపజేసే విధంగా సమాజాన్ని చక్కదిద్దేవాడు ఒక్క కార్టూనిస్ట్ మాత్రమే. అందువల్లనే కార్టూనిస్ట్‌లు సమాజంలో గుర్తింపు పొందారు. అందుకే కార్టూన్ అంటే అందరూ ఇష్టపడతారు. ఈ కార్టూన్ల పుస్తకం ఆద్యంతం మనకు హాస్యాన్ని, ఆలోచనల్ని కలిగిస్తాయి. అందుకు ఉదాహరణగా ఈమధ్య రాజకీయాలలో సినీ కళాకారుల ప్రవేశం అనేది సహజం అయింది. దాన్ని వ్యాపారంగా మారిస్తే ఎలా ఉంటుంటో..? అనేది ఒక కార్టూన్ చెబుతుంది. అలాగే మరో కార్టూన్‌లో పనిమనిషి భర్త గదిలోకి వెళ్ళి బయటకు వస్తుంది. అతని తల బొప్పికట్టి ఉంటుంది. అతని భార్య పనిమనిషితో మాట్లాడిన తీరు మనకు ద్వంద్వ అర్థాలను తెలియజెపుతుంది. ఇదీ కార్టూనిస్ట్ చాతుర్యం. ఇంకా అనేక హాస్య కార్టూన్ల కోసం చలపాక ప్రకాష్ కార్టూన్లు -2 పుస్తకం చదవాల్సిందే.
విష్ణ్భుట్ల రామకృష్ణ, 9440618122

పుస్తకం: చలపాక ప్రకాష్ కార్టూన్లు-2,
కార్టూనిస్ట్: చలపాక ప్రకాష్
వెల: రూ.40
ప్రతులకు: 1-4/3-36, సంజయ్‌గాంధి నగర్
విద్యాధరపురం, విజయవాడ -520 012
విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీల్లో...

నవ్వులు.. పువ్వులు

అంతా ఈరోయనే్ల!
‘‘వాళ్లింట్లో నాలుగు తరాల నుంచి సినిమా పిచ్చివాళ్లే’’
‘‘ఎందుకలా అంటున్నావు?’’
‘‘మమీ కాంచనమాల, తల్లి అంజలీదేవి, కూతురు వాణిశ్రీ, మనవరాలు అంజలి’’.
‘‘అమ్మమ్మ సరేన్నమాట’’!
‘‘కాదుట, సీతమ్మ వాకిట్లో అంజలిట’’
‘‘ఆ’’...
కేసుల పిచ్చయ్య!
ఎందుకాయన అంతగా తిడుతున్నాడు?
ఆ లాయరుకి ఎప్పుడూ కేసుల పిచ్చే.
సిస్టర్ వచ్చి ‘చిన్నమ్మగారికి కవలలు - ఆడపిల్లలు పుట్టారయ్యా’ అంటూ ఆనందంగా చెప్పిందట.
‘ఏం పేర్లు పెడితే బాగుంటుందిరా’ అని వియ్యంకుడైన తోటి లాయర్ అడిగితే
‘‘నిర్భయ, ఆరుహి’’ అన్నాడుట.
దాంతో ఆయన నిప్పుతొక్కిన కోతిలా వియ్యంకుడిని తిట్టినతిట్టు తిట్టకుండా...
- వేమూరి రాధాకృష్ణ, బి.కాం
శారదా కాలేజీ, విజయవాడ

మనోగీతికలు

నూతనోత్సాహం నింపు
ఋతురాగాలు ఆలపిస్తూ
వసంతాన్ని మోసుకొస్తున్న
ఓ కోయిలా! జాగ్రత్త సుమా!
ఇక్కడ..
విషాదధ్వాంతములు
దారినిండా పరుచుకున్నాయి
మారణకాండను సృష్టించే
ముష్కరులు ఇక్కడే ఉన్నారు
నైతిక విలువల్ని మంటగలిపే
ప్రజాప్రతినిధులూ పెరిగిపోయారు
అవినీతి రొంపిలో
కూరుకుపోయిన అధికారులు
ఇంకా అర్రులు చాస్తూనే ఉన్నారు
అతివల మానాలకు రక్షణ లేక
దుశ్శాసన పర్వాలు
నిత్యకృత్యాలయ్యాయి
దుఃఖిత హృదయాలతో నిండిన
మట్టి బతుకులు అలాగే ఉన్నాయి
నిరాశా మోడులపై
ఆశల పల్లకిని మోస్తూ
ఎల్లెడెలా
నిరుద్యోగులు నిండిపోయారు
ఓ కోయిలా..! జాగ్రత్త సుమా!
ఇక్కడ విషాదధ్వాంతములు
దారినిండా పరుచుకున్నాయి
గ్లోబలిజం పదునెక్కి
కార్పొరేట్ రంగం దోచుకెళ్తోంది
పాశ్చాత్య వామోహం
ఆధునికంగా రాటుదేలి
మరింతగా వెర్రితలలు వేస్తోంది
ప్రజాస్వామ్యం రుజాగ్రస్తమైంది
అందుకే..
ఓ కోయిలా..! జాగ్రత్త సుమా!
ఎలాగూ ఎన్నికలు తెచ్చావు
గత చరిత్రను పాతిపెట్టి
దారిలో పరుచుకున్న
విషాద ధ్వాంతములపై
వెలుగు దివ్వెలు నింపి
జయజయ ధ్వానాలతో
నూతన రాగాలను పంచు!
కొత్త నాగరికతా
ప్రపంచాన్ని సృష్టించు
భరతమాత హృదయ సుమాలలో
సురభిళ పరిమళాలద్దు
‘జయ’వత్సరంలో
నూతనోత్సాహాన్ని నింపు
మా అందరికీ ఆనందాన్ని పంచు!

సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు
అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా.
సెల్ నెం: 9491357842

కలియుగ ఉగాది
పల్లవి: కలియుగ ప్రారంభమే క్రొత్త సంవత్సరాది
తెలిపిన నవ వసంత కాలచక్ర గమనముగ
చరణం: చైత్రమాసమేతెంచె శుద్ధ పాఢ్యమి రోజున
పత్రహరిత వర్ణాల కలశ స్థాపనగ
మైత్రితో విశ్వమంత నవరాత్రుల పూజగాన
చిత్రమైన షడ్రుచుల పండుగ ప్రసాదముగ
చరణం: పంచాంగ శ్రవణమే విను వారి చిత్తాన
మంచిగ తిథి వార యోగ నక్షత్ర కరణగ
పంచిన నవనాయకుల ఆధిపత్యములుగాన
ఉంచిన ద్వాదశ రాశుల గ్రహబల సంచారముగ
చరణం: ఉగాది వేడుకలే సంస్కృతీ సంప్రదాయాన
జగతి జీవరాశుల జీవన ప్రమాణముగ
సాగే ఆనందమంత సృష్టికర్త బ్రహ్మగాన
స్వాగతించే సీతారామ్ సకల జయప్రదముగ

నల్లగొండ సీతారామ్
గుంటూరు. ఫోన్: 0863 2350498

ఇంక ఆపు...
నేతల నోట నానినాని
పదాలు పాచిపట్టి పోయాయ్!
‘నేరం రుజువు చేస్తే రాజీనామా’
అదికాదు గానీ ఇంకోమాట చెప్పు!
‘చట్టం తనపని తాను చేసుకుపోతుంది’
చెయ్యనివ్వాలిగా?
‘స్ర్తి జనోద్ధరణే నా ధ్యేయం’
‘ఉద్ధరించబడిన’ స్ర్తిలంతా
పాపం దుబాయ్‌లో ఉన్నారుగా!
‘ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు’
ఈమాట వినీవినీ
యాక్..! వాంతొస్తోంది!
‘చివరి రక్తంబొట్టు వరకు ధారపోస్తా’
ఎవరికి? కుటుంబానికా?!
‘ఇవి ప్రజలకే అంకితం’
ఏవీ? అధిక ధరలూ, అరాచకాలూనా!
‘నా మీద బురద చల్లారు’
ఏదీ! మొన్న ‘వరదల’ బురదా?
‘ఉక్కుపాదంతో అణచివేస్తాం’!
ఆర్డరిచ్చిన ఉక్కుపాదాలు ఇంకా రాలేదా?
‘చట్టం ఎవరికీ చుట్టం కాదు’
నిజమా?!
‘మీకే కనక చిత్తశుద్ధి ఉంటే...’
ఓటేస్తామా! బాసూ!?
‘దీన్ని నేను ఖండిస్తున్నా’
అంతేనా!
‘తీవ్రంగా ఖండిస్తున్నా’
ఇంక ‘ఆపు’!!
భువనగిరి శేషమాంబ,
విజయవాడ.
సెల్ నెం: 9492811338

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

కథ
english title: 
orey kanna story
author: 
డాక్టర్ దుట్టా శమంతకమణి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>