Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మృగరాజు - కథ

$
0
0

అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. దానికి ఆడంబరాలెక్కువ. ఇతర జంతువులు, పక్షుల ముందు గొప్పలకు పోయేది. ఉన్నదాంట్లో ఇంత తిని మిగిలింది దాచుకోకుండా, అప్పులు చేసేది. అప్పులు చేసి గొప్పలు చూపెట్టేది.
ఒకసారి ఆ కొంగ తన బిడ్డ పుట్టినరోజు ఘనంగా చేయాలనుకుంది. ఆ వేడుకకు మృగరాజు సింహాన్ని కూడా ఆహ్వానించాలనుకుంది. రాజుగారిని ఆహ్వానించి మామూలు భోజనం పెడితే బాగోదనుకుంది. పెద్ద విందు భోజనం ఏర్పాటు చేయాలనుకుంది. కానీ దాని దగ్గర అంత డబ్బు లేదు.
కొంగ తన మిత్రుడు గద్ద దగ్గరకు వెళ్లింది.
‘మిత్రమా! నేను నా బిడ్డ పుట్టినరోజు చేయాలనుకుంటున్నాను. ఆ వేడుకకు మన మిత్రులతోపాటు, మృగరాజు సింహాన్ని కూడా ఆహ్వానించాలను కుంటున్నాను. నా దగ్గర ఖర్చులకు డబ్బు లేదు. నువ్వు కాస్త సర్దావంటే కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను’ అంది కొంగ.
‘మిత్రమా! నీ బిడ్డ పుట్టిన రోజు జరుపుతానంటే నాకు తోచిన సహాయం తప్పక చేస్తాను. కానీ ఆడంబరాలకు వెళ్లకుండా ఉన్నదాంట్లోనే మనకు చేతనైనంత చేయొచ్చు కదా! అప్పు చేసి గొప్పలు చూపటం ఎందుకు?’ అంది గద్ద.
‘ఇదిగో... నువ్వు ఇస్తే ఇవ్వు. లేదంటే మరొకరిని చూసుకుంటా! నాకు నీతులు చెప్పనవసరం లేదు’ అంది వ్యంగ్యంగా కొంగ.
గద్ద మాట్లాడకుండా తన దగ్గర దాచుకున్న సొమ్ము లోంచి కొంత తీసి కొంగకు ఇచ్చింది.
కొంగ మరో మిత్రుడు నక్క దగ్గరకు వెళ్లింది.
‘నక్కబావా! నక్కబావా! నేను నా బిడ్డ పుట్టినరోజు వేడుక చేయాలనుకుంటున్నాను. కాస్త డబ్బులుంటే ఇవ్వు. త్వరలోనే తిరిగిస్తా’ అంది కొంగ.
అంతా విన్న నక్క కూడా ‘అప్పుచేసి చేయకుంటే, ఉన్న దాంట్లోనే నలుగుర్ని పిలిచి పెట్టొచ్చుగా!’ అంది.
కొంగ తనకు ఎలా చేయాలో తెలుసునని చెప్పింది. దాంతో నక్క తన దగ్గరున్న డబ్బులోంచి కొంత తీసి కొంగకి ఇచ్చింది.
మొత్తానికి సొమ్ములు పోగు చేసి మృగరాజుని చేరుకుని..
‘మృగరాజా! మృగరాజా! రేపు నా బిడ్డ పుట్టిన రోజు. మీరు రాణిగారితో, పిల్లలతో కల్సి వేడుకకు వచ్చి నా బిడ్డను దీవించాలి’ అంది కొంగ.
మృగరాజు సంతోషించాడు. అలాగే వస్తానని మాటిచ్చాడు.
కొంగ సంతోషంతో అక్కడి నుండి ఇంటికి చేరుకుంది. పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చూడసాగింది. మాంసం, పాయసం, పిండివంటలు, పళ్లు తెప్పించింది.
మరునాడు కొంగబిడ్డ పుట్టినరోజు వేడుకలో ఎక్కడ చూసినా అత్తరు వాసనలు, మరోవైపు మసాలా వాసనలు. వేడుక మొత్తం అడవిలోని పక్షులు, జంతువులతో కిటకిట లాడింది. అన్నీ మృగరాజు సింహం రాక కోసం ఎదురుచూడసాగాయి.
కొంగ, మృగరాజు ఘనమైన కానుక తీసుకొస్తాడనుకుంది. కానీ మృగరాజు చేతులు ఖాళీగానే ఉన్నాయి. భోజనానికి ఆహ్వానించింది. ఏదో తిన్నట్టు కెలికి అక్కడి నుండి సెలవు తీసుకుని ముందుకు కదిలాడు. వచ్చిన జంతువులు, పక్షులు లొట్టలేసుకుని తిన్నాయి.
కొంగ మృగరాజు ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది. అప్పుడు గద్ద, నక్క కొంగను చేరుకున్నాయి.
‘మిత్రమా! రాజుగారు ప్రతిరోజూ అనేక వేడుకలకు వెళుతుంటారు. వెళ్లినచోటల్లా భోజనం చేస్తే కడుపు పాడైపోతుంది. అలాగే పేదవారిని, ధనవంతులని ఒకేలా చూస్తారు. అందుకే ఏ వేడుకలకు కానుకలు తీసుకుపోరు. ఆయన దీవెనలే మనకు గొప్ప కానుక’ అంది గద్ద.
‘అంతే కదా!’ అంది నక్క.
ఇక చేసిన అప్పులు తీర్చలేక కొద్దిరోజుల్లోనే కొంగ బజారున పడింది. పదిమందిలో గొప్పలు చూపెట్టబోయి చులకనై పరువు పోగొట్టుకుంది. *

తెలీని దొంగలు
స్ఫూర్తి

సువిఘ్న ఆ ఇంట్లో అందరికన్నా ఎక్కువ జాగ్రత్త కల మనిషి. తన వస్తువులన్నీ పొందికగా తనకి కేటాయించిన స్థలంలో ఉంచుకుంటుంది. ఏదైనా ఊరు వెళ్తే తన కుటుంబ సభ్యులు అందరూ తీసుకెళ్లే వస్తువుల జాబితాని రాసుకుని, తిరిగి వచ్చేప్పుడు మళ్లీ ఆ జాబితా ప్రకారం సర్ది ఏవీ మిస్ కాకుండా జాగ్రత్త పడుతుంది. పదేళ్ల సువిఘ్న తన ఈడు పిల్లల్లా కాక, పై క్లాస్‌కి వెళ్లేప్పుడు పాత నోట్ బుక్స్‌లోని వాడని కాగితాలని చింపి, పుస్తకంగా కుట్టుకుని రఫ్ వర్క్‌కి వాడుతుంది. తండ్రితో చెప్పి, తమ ఇంట్లో ఫైర్ ప్రూఫ్ లాకర్‌ని పెట్టించి తమ బర్త్ సర్ట్ఫికెట్స్, ఎల్లైసీ పాలసీలు, పాస్‌పోర్ట్‌లు లాంటి ముఖ్యమైన కాగితాలు అందులో ఉంచేలా చేసింది. అలాంటి లాకర్‌ని తన ఫ్రెండ్ ఇంట్లో చూసింది.
సువిఘ్న నాయనమ్మ ఓసారి వేసవి సెలవులకి వారింటికి వచ్చింది. సువిఘ్నలోని ఈ మంచి గుణాలు ఆవిడని ఆకర్షించాయి. ఆ రోజు బాత్‌రూమ్‌లో కొత్త సబ్బుకి అరిగిపోయిన సబ్బు ముక్కుని అతికించింది సువిఘ్న. అది చూసి ఆవిడ మనవరాలిని పిలిచి చెప్పింది.
‘నీలో అనేక మంచి లక్షణాలు ఉన్నాయి. నీకు చెందిన వస్తువుల విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటావు! అవి పోకుండా, పాడవకుండా చూస్తావు. కానీ నువ్వు మరో విలువైన ఆస్తి విషయంలో నీ తెలివితేటలని చూపించడం లేదు. దాంతో వాటిని దొంగలు నీకు తెలియకుండానే ఎత్తుకుపోతున్నారు’
నాయనమ్మ చెప్పిన మాటల గురించి సువిఘ్న కొద్ది క్షణాలు ఆలోచించి తల అడ్డంగా ఊపి చెప్పింది.
‘నాకు తెలిసి అలాంటిదేం జరగడం లేదు’
‘ఆ విలువైనవేమిటో తెలిస్తే తప్ప అవి ఉన్నాయో పోతున్నాయో నీకు తెలీదు’
‘ఏమిటవి?’ సువిఘ్న ఆసక్తిగా ప్రశ్నించింది.
‘ఆధ్యాత్మికంగా విలువైనవి’
‘అంటే?’
‘నువ్వు దైవభక్తితో, మంచితనంతో సంపాదించుకునే పుణ్యరాశిని నీకు తెలియకుండానే దొంగలు ఎత్తుకెళ్తున్నారు’
‘నాకు అర్థమయ్యేలా చెప్పు’
‘ఆ దొంగ కోపం. నువ్వు కోపంతో పోట్లాడినప్పుడల్లా పుణ్యరాశి తరుగుతుంది. అలాగే నువ్వు లోభం, ద్వేషం, అసూయ, అహంభావం లాంటి గుణాలతో ప్రవర్తించినప్పుడల్లా అవి నీ పుణ్యరాశిని దొంగిలిస్తాయి. ప్రతీ మనిషి జాగ్రత్తగా కాపాడుకోవల్సింది ఆధ్యాత్మిక నిధినే. లౌకిక సంపద జీవితకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక సంపద ఎన్నో జన్మలు వెంట వస్తుంది’
‘నేను అలా ప్రవర్తించినప్పుడల్లా నువ్వు నాకు ఆ విషయం గుర్తు చేస్తూండు’ సువిఘ్న అభ్యర్థించింది.
*
-మల్లాది వెంకటకృష్ణమూర్తి

చేసి చూద్దాం

వేడి నీరు
నీటిలో వేడి విస్తరించిందంటే, వేడినీరు తేలికై చన్నీటి పైన తేలుతుంది. ఒక దీర్ఘ చతురస్రాకారపు గాజు తొట్టెలో చన్నీటిని తీసుకోవాలి. ఒక చిన్న సీసాలో కొద్దిగా ఎర్ర ఇంకు చుక్కలు వేయాలి. ఈ సీసాలో వేడినీరు పోయాలి. మరుగునీరు పోయకూడదు. ఈ సీసాకు మూతపెట్టాలి. ఈ సీసాను గాజు తొట్టెలోని చన్నీటిలో తొట్టె అడుగు భాగంలో వుంచాలి. జాగ్రత్తగా సీసా మూతను తొలగించాలి.
సీసాలోని రంగునీరు చురుగ్గా గాజు తొట్టెలోని చన్నీటిపైకి విస్తరిస్తుంది. కొద్ది నిముషాలు గడిచేసరికి ఈ రంగునీరు తొట్టెలోకి కిందకు దిగుతుంది. మిగిలిన నీటితో ఐక్యం అయిపోతుంది. అన్ని పదార్థాల మాదిరి నీరు కూడా చిన్న చిన్న కణాలయిన అణువులచే నిర్మితమై వుంటుంది. నీటిలోని వేడి ఈ అణువుల వేగాన్ని పెంచుతాయి. ఈ అణువులు ఒకదాని కొకటి దూరంగా విడిపోతూ విస్తరించుకుంటాయి. ఇలా అణువులు విడిపోవడంవలన ఆ నీటి సాంధ్రత తగ్గిపోయి చన్నీటి ఉపరితలం పైకి వస్తాయి. వేడినీటిలోని వేడి చన్నీటికి కూడా అందడం వలన వేడినీటి ఉష్ణోగ్రత చన్నీటి ఉష్ణోగ్రత సమానం అయిపోతాయి. దానితో రంగునీరు చన్నీటిలో కిందికి దిగనారంభిస్తుంది. అంతే కాదు చన్నీటితో కలిసిపోతుంది.
-సి.వి.సర్వేశ్వరశర్మ

సిసింద్రి
english title: 
sisindri
author: 
పైడిమర్రి రామకృష్ణ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>