
గొంగళిలో తింటూ వెంట్రుకలు వచ్చాయని బాధపడితే ఎలా? ప్రస్తుతం అందాల నాయిక తాప్సీ పరిస్థితి అలాగే వుంది. సినిమాల్లో కథానాయికలు చూపిస్తున్న అంగాంగ ప్రదర్శనకు వ్యతిరేకంగా ఓ టీవీ షోలో ఆమె మాట్లాడాల్సి వచ్చింది. అమ్మాయిలను సినిమాలలో సెక్స్ వస్తువులుగా చూపిస్తున్నారని, ఇది చాలా దారుణమని, దీనివల్ల సంఘంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆ టీవీ షో సారాంశం. అయితే ఇదే విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పమని తాప్సీని అడిగారట. పాపం, ఏం చెబుతుంది? మొదటి చిత్రం నుండి తాను కూడా అదేవిధంగా అంగాంగ ప్రదర్శన చేస్తూ ఓ రకంగా గ్లామర్ డాల్‌గా సినిమాల్లో కనిపించిన తాప్సీకి ఈ ప్రశ్న ఇబ్బందికరమైనదే. కానీ, చెప్పక తప్పేటట్టు లేదు. సినిమాల్లో చూపిస్తున్నట్లుగా తాను అంగాంగ ప్రదర్శన చేయనని అంటే తాప్సీకి మరో అవకాశంరాదు. అవకాశాల కోసం ఇప్పుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పటానికి కూడా జంకుతోందట. సినిమాల్లో చూపించే అర్ధనగ్న దృశ్యాలవల్లే సమాజంలో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని చెప్పే ధైర్యమూ లేదు. ఏం చేయాలి చెప్మా అని ఆలోచిస్తోందట పూర్ తాప్సీ!
అలా.. అన్నానా?
టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమంత ఇటీవల నోరుజారిందట. సహజంగా ఆ మధ్య అనేకమందిపై వ్యాఖ్యానాలు చేసిన సమంత ఈసారి తనపై తానే మాటజారింది. విషయంలోకి వెళితే బాలీవుడ్‌లో కంగనా రౌనత్ నటించిన ‘క్వీన్’ చిత్రం విజయవంతమైంది. ఈ చిత్రంతో కంగన స్టార్‌డమ్ మరింత పెరిగిపోయింది. అదే చిత్రాన్ని ఇప్పుడు దక్షిణాదిలో కూడా నిర్మిస్తున్నారు. ముఖ్యంగా తమిళం, తెలుగుల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయక ఎవరా అని అనే్వషణ చేస్తున్నారు. ఈ సినిమాను చూసిన సమంత కూడా తాను ఆ చిత్రంలో నటించాలన్న కోరికతో ఉన్నానంటూ చెప్పింది. ఒకానొక సమయంలో ఆ పాత్రపై మనసు పారేసుకున్నాను అనికూడా చెప్పింది. ఇదే అవకాశంగా కొన్ని పత్రికలు సమంత ‘క్వీన్’ చిత్రంలో పారితోషికం లేకుండా నటిస్తోందని ప్రచారం చేశాయి. దీంతో అవాక్కైన సమంత నేను అలా అన్నానా అంటూ నాలిక్కరచుకుందట. అలాంటి పాత్రల్లో నటించాలన్న కోరిక మాత్రం ఉంది కానీ, ఏదో దేశానికి త్యాగం చేసినట్టుగా ఉచితంగా మాత్రం నటించనని మరోసారి ఎదురుదాడి చేసింది. అందుకే అంటారు, అవ్వా కావాలి బువ్వా కావాలి అని.
అబ్బే.. అందుకోసమే!
రస్నా బేబిగా మంచి గుర్తింపు పొందిన అంకిత తెలుసు కదా! ఆ మధ్య కొన్ని సినిమాల్లో హడావిడి చేసిన అమ్మడు ఆ తరువాత తనతో నటించిన నవదీప్‌ను పెళ్లిచేసుకునే ప్రయత్నమే చేసింది. శ్రీప్రియను నటుడు కార్తీక్ వద్దన్నట్లుగా వ్యతిరేకత రావడంతో మళ్లీ తన దారి తాను చూసుకుంది. కెనడాకు చెందిన ఓ ధనవంతుడిని పెళ్లిచేసుకుని వెళ్లిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక అంకిత గొడవ తీరిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చేసింది. త్వరలో పెళ్లిచేసుకోబోతున్నానని, అందుకోసం తెలుగు కుర్రాడిని వెతుకుతున్నానని చెప్పింది. ఇదేంటి? గతంలో పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది కదా! మళ్లీ ఇదేం ట్విస్టు? అని అడిగితే ఓహో.. మీరు అలా అనుకున్నారా? అంటూ విషయం చెప్పుకొచ్చింది. అప్పట్లో పెళ్లి చేసుకోవడానికి వెళ్లలేదట. పైచదువులు చదువుకోవడానికి వెళ్లిందట. ఇప్పుడు అవన్నీ పూర్తయి చక్కగా పెళ్లిచేసుకోవడానికి ముస్తాబై వచ్చిందట. ఎవరేదడిగినా అబ్బే.. చదువుకోసమే వెళ్లానని చెబుతోంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరని సామెత ఉండనే ఉంది గదా మరి!