
ఈ ఫొటోలో ఏం కనిపిస్తోంది? అంటే ఠక్కున ‘రామ్మాచిలుకమ్మా’ అంటూ వచ్చీరాని తెలుగులో పాట పాడేస్తారు. పరిశీలనగా చూడమంటే? కళ్లు చికిలించి చూసి మళ్లీ అదే మాట అంటారు. క్షుణ్ణంగా అధ్యయనం చేయమంటే? రామచిలుక కాదు.. ఎంచక్కా ‘అమ్మాయి’ కనిపిస్తుంది. 35 ఏళ్ల బాడీ పెయింటర్ జొహనె్నస్ స్కాటర్ కాల్పనిక భ్రమ ఇది. ఇటలీ వాసి అయిన ఈ కళాకారుడు - తన కళని సాకారం చేసుకోటానికి దేశ విదేశాలు తిరిగి ఎట్టకేలకు - ఒక మోడల్‌ని కనుగొన్నాడు. అందమైన ఆమె శరీరాన్ని చిలుకలా మలచటానికి కొద్ది గంటలు పట్టింది. అనుకున్న రూపం రావటంతో.. ‘క్లిక్’ చేశాడు. ఒక్కసారిగా ఆ ఫొటోల్ని జాగ్రత్త గమనించండి. రామచిలుక తలభాగం.. ఆమె ఎడమ చేయి. మరో భుజం.. కుడికాలు కలసి రెక్కలుగా ఏర్పడ్డాయి. కుడిచేతి వేళ్లు గోళ్లుగా మారాయి. ఎడమకాలు తోకలా మారింది. ఇందులో అంత వింత తోచాల్సిన అంశం ఏముంది? అని పెదవి విరిచేవారికి.. కష్టం అంతా ఆలోచనల్లోనే ఉంది. ముందుగా ‘నగ్నం’గా మారటానికి మోడల్ ఒప్పుకోవాలి. ఒకవైపు పెయింట్ చేస్తూంటే ఆరిపోతూంటుంది. చెమటలు పడతాయి. సరైన భంగిమ వస్తుందా? రాదా? అన్న ఆలోచన ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి నాలుగు వారాలు పట్టింది. పిక్చర్స్ చూసిన వారంతా ‘ఎక్కడ నుంచీ తీశారివి? ఏ అడవుల్లో దొరికిందీ చిలుక?’ లాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశార్ట. తీరా వాస్తవం తెలిసేప్పటికి.. ఆశ్చర్యంలో తలమునకలై.. ప్రశ్నలతో అతణ్ణి తడిపేశార్ట. జీవకళ ఉట్టిపడే.. అతడి పెయింటింగ్స్‌ని చూడటం మహద్భాగ్యంగా భావిస్తారు వీక్షకులు. ‘కాన్వాస్‌పై వేసిన పెయింటింగ్ కొంతకాలం చెక్కుచెదరదు. కానీ - బాడీ పెయింటింగ్ కొద్ది గంటలు మాత్రమే. ప్రకృతిని ప్రేమిస్తాను. రంగుల్ని అభిమానిస్తాను. నా కళలో ప్రవేశపెడతాను.. ఇదీ నా సూత్రం అంటాడితను. 2012లో జరిగిన వరల్డ్ బాడీ పెయింటింగ్ ఫెస్టివల్‌లో ఇతగాణ్ణి ఛాంపియన్‌గా ప్రకటించటంతో - స్కాటర్ పేరు విశ్వవ్యాప్తమైంది. గత సంవత్సరం ఇతడు వేసిన పెయింట్ - ట్రీ ఫ్రాగ్. ఫొటోలు అలరించటం లేదూ?!అతగాడు వేసిన సిత్రాలు తిలకించి ఆస్వాదించండి.