
‘విద్యలేని వాడు వింత పశువు.’ అనే సామెత ఇటీవల కాలంలో ఎక్కడా వినిపించదు. కారణం ప్రతి పిల్లాడు, పిల్ల, మూడేళ్ల వయసు నుంచి ఏదో విధంగా అ ఆ ఇ ఈ ...లు నేర్చుకోవటమో లేదా ఏ బి సి డి... లు మాట్లాడటమో జరుగుతున్నది. ఎవరికి తోచిన విధంగా వారు తెలుగు మీడియంలో కానీ, ఇంగ్లీషు మీడియంలో కానీ తమ తమ చదువును నేర్చు కుంటున్నారు. బాల్యంనుంచే ఈ విధంగా చక్కటి క్రమశిక్షణతో చదూకొంటే అన్ని కాంపిటీషన్ పరీక్షల్లో కూడా ర్యాంకుల పంట పండించేస్తుంటారు. పెద్దయ్యాక ఈ పునాదితో ఉద్యోగాల వేట తప్పి పెద్దపెద్ద కంపెనీల వారే మీ చుట్టూ తిరుగుతుంటారు. ‘మా కంపెనీలో చేరండి, మా ప్రాజెక్ట్ చేసి పెట్టండి...’ అని.
అదే కనుక, వాస్తుశాస్త్రాన్ని మీరు వుంటున్న ఇంటికీ, చదూకొనే గదికి అన్వయంచారనుకోండి మీ కఠోర దీక్షతో పాటు శాస్తబ్రద్ధమైన సహాయం మీకు లభిస్తుంది. మీకు తెలీని అతీంద్రియమైన శక్తితో చదువులో వృద్ధి, తెలివితేటలలో అభివృద్ధి కనిపిస్తుంది. దాని ద్వారా మీరు మీ కాలేజి లైఫ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
చదువుకుండే ప్రతి విద్యార్ధి, విద్యార్ధిని పగలుకాని, రాత్రికాని చదువుకునేపుడు ఈశాన్య దిక్కును కాని, ఉత్తర దిక్కును కాని, తూర్పు దిక్కును కానీ చూసే విధంగా కూర్చొని చదూకోవాలి. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే ఈశాన్య దిశలో తెలివితేటలను బాగా వృద్ధిచేసే అతీంద్రియమైన శక్తిదాగి వుందిట. పొరపాటున కూడా ఖాళీగా వున్న బ్లాంక్ గోడ దగ్గర కూర్చుని చదవకండి. దీనివల్ల మీకు చదువు అబ్బకపోగా మీ మైండ్ రకరకాలైన పిచ్చిపిచ్చి ఆలోచనలవైపు పరుగు తీస్తుంటుంది. చదువుపట్ల ఏకాగ్రత తప్పిపోతుంది. స్టడీ రూంలో మీ టేబుల్ ఉత్తరంవైపు భాగాన కాని, తూర్పువైపు భాగాన కాని వేసుకొని చదూతుంటే చదువులో, నోట్సు తయారీలో, కొత్త కొత్త ఐడియాలు మిమ్మల్ని మంచి మార్కులు సాధించే దిశగా తీసుకెళతాయ. గంటల కొద్దీ పగలనక రాత్రనక చదువుతుండే మీకు కళ్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా వుండేలా మీ స్టడీ టేబుల్‌ని చక్కటి గాలి వెలుతురు వచ్చే విధంగా పైన చెప్పిన దిశల్లో వేసుకోండి. స్టడీ టేబుల్‌మీద చక్కటి టేబుల్ ల్యాంప్ ఏర్పాటు చేసుకోండి. కానీ ఈ ల్యాంప్‌ని టేబుల్ మీద ఆగ్నేయ దిశలో బల్బ్ బయటికి కనిపించని విధంగా ఏర్పాటు చేసుకోండి. సమయాన్ని కచ్చితంగా పాటించేందుకు అను గుణంగా ఓ గోడ గడియారాన్ని తూర్పు లేదా ఉత్తరంవేపు గోడకు ఏర్పాటు చేసుకోండి.
ఏరోజు చదవాల్సిన పుస్తకాలు ఆ రోజు తీసుకొనే విధంగా బుక్స్‌వుంచే బీరువాను స్టడీ రూంలో నైరుతీ దిశగా వుంచాలి. వాస్తుశాస్త్ర ప్రకారం రోజులో కరెక్ట్‌గా చదూకోవాల్సిన టైం ఏదంటే ఉదయం పూట మాత్రమే. ఈ సమయంలో చదూకొంటే చాలా మంచిది. మైండ్ ఫ్రష్‌గా వుండి ఒకసారి చదవగానే మెదడులోకి సులభంగా వెళుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉదయస్తున్న సూర్యుని చూస్తూ చదూకొన్న వారి చదువులో అభివృద్ధి బాగుంటుంది. చదువు కొంటూ మధ్యలో వాటర్ తాగాలంటే దానికోసం కూడా మీరు ఈశాన్యం మూల డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసుకోండి.
క్రాస్ వెంటిలేషన్ కోసం స్టడీ రూంలో పెద్దగా వుండే చక్కటి కిటికీలను అమర్చండి. పరీక్షలంటే ఎప్పుడూ భయపడొద్దు. కచ్చితమైన వాస్తు సూత్రాలు పాటిస్తూ మీ చదువు కొనసాగిస్తే పరీక్షలకే మీరంటే భయం పుట్టు కొస్తుంది. చదువులో చాలా చురుకుగా వుండేందుకు మెడిటేషన్ కాసేపు చేస్తూ వుండండి. మెడిటేషన్ చేసుకునేందుకు ఈశాన్య భాగాన్ని ఉపయోగించుకోండి. శరీరాన్ని పరీక్షల సమయంలో జాగ్రత్తగా కాపాడుకోండి. దాని కోసం చిన్నపాటి వ్యాయామాలు గదిలో నైరుతీ దిశగా చేస్తూవుండండి.
చదువులో పైకి వినిపించే విధంగా చాలా పెద్దగా అరుస్తూ చాలా మంది విద్యార్ధి, విద్యార్ధినులు చదువు తుంటారు. మనం ఎంత పెద్దగా అరుస్తూ చదివాం అన్నది కాదు మనకు కావాల్సింది. ఎన్ని అక్షరం ముక్కలు మన మెదడులోకి ఎక్కాయా అన్నది మనకు కావాలి. దీని కోసం స్టడీ టేబుల్ పైన బొంగులతో తయారుచేసిన రెండు ఫ్లూట్స్ (పిల్లనగ్రోవి)ని ఎర్రని రిబ్బన్‌తో కట్టి తూర్పు లేదా పడమర దిశవైపు చూసే విధంగా 45 డిగ్రీల కోణంలో వేలాడదీయండి. చదువుకుండే మీరు చదువు మధ్యలో అప్పుడప్పుడూ దాని వంక చూస్తూ వుండండి. ఇలా చేయటం వలన మీలో చదువుపట్ల దీక్షాదక్షత పెరుగుతుంది. మీ స్టడీ రూంలో ఎప్పుడూ మంచి వైబ్రేషన్స్ వుండేందుకు రూం మధ్య గర్భంలో గాజు పాత్రని పసుపుతో కలిపిన నీటితో నింపి దాంట్లో ఎర్రని, తెలని, పసుపు రంగు ఇంకా రకరకాల రంగుల పూలని వుంచండి. ఇలా చేయటం వలన మీలోని బద్ధకం పోయ చురుకుతనం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.
మీ స్టడీ రూంలో తూర్పు. ఉత్తర దిక్కుల్ని పొరపాటున కూడా మూసివేయకండి. కరెంట్ పోయనా మీ చదువు నిరాటంకంగా సాగేందుకు రూంలో ఇన్‌వర్టర్‌ని ఆగ్నేయ భాగంలో కాని, వాయవ్య భాగంలో కాని వుంచండి. పగిలిన అద్దాన్ని చదూకొనే టేబుల్ మీదకాని, స్టడీ రూంలో కాని వుంచకండి. భయంకరమైన డ్రాగన్ బొమ్మలు, జంతువుల తలలు, పాము చర్మాలు ఇతరత్రా కూృరమైన జంతు జాలాల బొమ్మలని గోడలకు అతికించకండి. మీ స్డడీ టేబుల్ క్రింద చెత్తని జమచేయకండి. ప్రతిరోజూ మీ రూంని శుభ్రంగా చిమ్మిం చండి. స్టడీ రూంలో టాయలెట్ డోర్ వైపు చూస్తూ చదవకండి. గదిలో ఉత్తరం వైపు, తూర్పు వైపు ఎక్కువగా కిటికీలు వుండేలా ప్లాన్ చేసుకోండి. పడమరవైపు కిటికీలు కనుక వున్నట్లయతే నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే వాటిని తెరచి మూసేస్తుండండి. దక్షిణంవైపు కిటికీలు వుంటే వాటి గురించి మరిచిపోండి. వాటిని తెరవనే వద్దు.
స్టడీ టేబుల్‌ని చతురస్రంగా కాని దీర్ఘచతురస్రంగా కాని వుండేలా చూసి కొనుక్కోండి. ఉత్తరంవైపు గోడకు తెల్లటి స్వచ్ఛమైన అద్దాన్ని బిగించండి. మీరు ప్రతి రోజు చదువు మొదలుపెట్టే ముందు ఆ అద్దంవైపు కాసేపు చూసి ఆ తర్వాతే చదువుకోండి. ఇలా చేయటం వలన మీలో చదువుపట్ల ఆసక్తి, పట్టుదల పెరుగుతుంది. మీ స్టడీ టేబుల్‌కి మీముందువున్న గోడకి కనీసం ఐదు అడుగుల దూరం వుంచండి. దీనివల్ల మీరు చదువుతూ నిద్రాదేవి ఒడిలోకి జారిపోవటం జరగదు. మీకు హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతిబంధకంగా మారు తోందంటే మీ ఇంటి వాస్తు సరిగా లేనట్టే. ఎలాగంటే వాయవ్యం మూల ఆగ్నేయం మూలకంటే ఎత్తుగా వుంటే ఇలాంటి సమస్యలే చదువుకి పడుతుంటుంది. వాస్తు శాస్త్ర ప్రకారం పసుపురంగు. వైలెట్ రంగులు స్టడీ రూంకి కచ్చితమైన రంగులు. ఈ రంగులు వేయటం వలన చదువులో తెలివితేటలు, ఏకాగ్రత పెరుగుతాయ.
ఇలాంటి ఎన్నో వాస్తు విషయాలు చదువులో కచ్చితంగా పాటించి మంచి మార్కులతో, ర్యాంకులతో నెంబర్ వన్ స్థానాన్ని వశపరుచుకోండి. బెస్ట్ ఆఫ్ లక్..
*