
శ్యామలాకోట సంస్థానానికి ఒకసారి ఒక వర్తకుడు వచ్చాడు. వ్యాపారం చేసుకుని స్థిరపడాలని అనుకుంటున్నానని, అందుకు అనుమతి ఇవ్వాలని రాణీ శ్యామలాదేవిని కోరాడు. ఆమె అంగీకరించటంతో -ఆనందంతో మూడు బొమ్మలు బహుమతిగా ఇచ్చాడు. రాణీ శ్యామలాదేవికి కోపం వచ్చింది. ‘నేనేం చిన్నపిల్లనా. బొమ్మలు బహుమతిగా ఇవ్వడానికి’ అంటూ తీవ్రస్వరంతో మందలించింది. వర్తకుడు వినయంగా నమస్కరించి -అమ్మా.. అవి మీ కోసం కాదు. పుట్టబోయే యువరాజు కోసం’ అన్నాడు. శ్యామలాదేవి ఆశ్చర్యంగా అతని వంక చూసింది. వర్తకుడు ‘అమ్మా, బొమ్మలను సరిగ్గా చూడండి. మూడింటికీ -చెవి వద్ద రంధ్రం ఉంది, గమనించారా?’ అన్నాడు. అయితే అన్నట్టు చూసింది శ్యామలాదేవి. చిన్న తీగను ఆమె చేతికిచ్చి మొదటి బొమ్మ చెవినుంచి తీయమన్నాడు. అది రెండో చెవి నుంచి బయటకు వచ్చింది. ‘కొంత మంది ఇలా విని అలా వదిలేస్తారు’ అన్నాడు. రెండో బొమ్మను తీసుకుని అదే తీగను చెవినుంచి తోసింది రాణీ శ్యామలాదేవి. అది నోటినుంచి బయటకు వచ్చింది. ‘కొంతమంది విన్నదాన్ని అలా పదిమందికీ చెబుతారు’ అన్నాడు. మూడోబొమ్మను తీసుకుని మళ్లీ చెవినుంచి తీగను పోనిచ్చింది. అది ఎటువైపునుంచీ రాలేదు. ‘కొంతమంది విన్నవాటిని అలాగే దాచుకుంటారు’ అన్నాడు. ఈసారి శ్యామలాదేవి ఆసక్తిగా ‘మరి ఏది మంచి బొమ్మ?’ అని ప్రశ్నించింది. వర్తకుడు తన సంచిలోంచి నాల్గవ బొమ్మ తీశాడు. దానికీ చెవి వద్ద రంధ్రం ఉంది. కానీ, తీగ ఒకసారి రెండో చెవినుంచి, మరోసారి నోటి నుంచి వచ్చింది. మూడోసారి బయటకు రాలేదు. వర్తకుడు రాణీ శ్యామలాదేవికి నమస్కరించి -‘అమ్మా.. కొన్నింటిని విని వదిలేయాలి. పనికొచ్చేవి విన్నపుడు పదిమందికీ చెప్పాలి. విన్నది రహస్యం అనిపిస్తే మాత్రం -మన నుంచి బయటకు రానివ్వకూడదు. మనిషి, ఈ బొమ్మలా ఉండాలి. ఇదీ మీకే..’ అన్నాడు వర్తకుడు. పుట్టబోయే యువరాజుకు తగిన బహుమతి ఇచ్చిన వర్తకుడికి పూర్తి స్వేచ్ఛనిస్తూ -సంస్థానంలో వర్తకం చేసుకోవచ్చని అనుమతినిచ్చింది రాణీ శ్యామలాదేవి.
*
=================
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు కూడా పంపించవచ్చు.