
ఆదివారం అనుబంధంలో ‘ఆంధ్రాయణం’ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు వెనుక పరిస్థితులు, రాజకీయ చతురతలు చక్కగా విశే్లషించారు. ముఖ్యంగా అప్పటి లేఖల్లో నేతల మనోభావాలు స్పష్టం చేశాయి. ఈ వారం కథ ‘తిలా పాపం తలా పిడికెడు’ ద్వారా చిత్రరంగంలోని వ్యాపార ధోరణులను ఎండగడుతూ వారిని సంస్కరించే విధానం కూడా స్పష్టం చేశారు. రచయిత్రికి అభినందనలు. హిచ్‌కాక్ ప్రెజెంట్స్ ద్వారా అందిస్తున్న మల్లాది కథలు అద్భుతం. ఈ వారం కవితల్లో ‘తండ్రి పరిమళం’ ఆకట్టుకొంది. పజిల్ ద్వారా గళ్లు పూర్తి చేయడం కష్టంగా వున్నా ఇష్టంగా ఉంటోంది.
-పి.విజయలక్ష్మి (కాకినాడ)
స్ఫూర్తి
స్ఫూర్తికథ ఎప్పటిలానే కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉంది. అయితే పూజల వల్ల పిల్లలు చక్కగా ఎదుగుతారనడాన్ని హేతువాదులు నిరసించినా సామాన్య ప్రజలు ఒప్పుకుంటారు. ‘లోకాభిరామమ్’లో సాంబారు ప్రసక్తి చదివాక దశాబ్దాల క్రితం రాజమండ్రిలో అందరూ మెచ్చుకునే వరదరావు హోటల్ సాంబారు జ్ఞాపకం వచ్చింది. నిజం ఎంతో తెలియదు కాని ఉడుకుతున్న సాంబారులో రొయ్యపొట్టు మూట ఉంచేవారనీ మూటలోని సారం సాంబారులో వ్యాపించి ఆ రుచి వచ్చేదని చెప్పేవారు.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
విశ్వం
విశ్వమంతా మన గుప్పెట్లో.. మనిషికి అంతర్జాలం వచ్చాక తన జీవన విధానంలో మార్పు వచ్చింది. ఇంకా మనం విశ్వాంతర్జాలం అందుకో బోతున్నాం అంటే కూర్చున్న చోటి నుంచే విశ్వాన్ని మనం వీక్షించబోయే మధుర క్షణాలు రాబోతున్నాయి. 2015 జూన్ నాటికి వందల సంఖ్యలో చిన్నచిన్న ఉపగ్రహాలను భూమి ఉపకక్ష్యలోకి పంపేందుకు రంగం సిద్ధమవటం సంతోషదాయకం.
-ఈవేమన (శ్రీకాకుళం)
అవుటర్‌నెట్
వాస్తు వాచకంలో భూ పరీక్షకు గమనించవలసిన ముఖ్యాంశాలు అందరికీ చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. ఇంటర్‌నెట్ సదుపాయాలను మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్న అమెరికాలో ఓ స్వచ్ఛంద సంస్థ ఎం.డి. ఐ.ఎఫ్, దాని పనితీరును వివరించిన ఈ వారం స్పెషల్ గొప్ప థ్రిల్లింగ్‌ని కలిగించింది.
-టి.సాయి సంతోషిణి రీతిక (అనకాపల్లి)
స్పెషల్ తేనె
టర్కీలో స్పెషల్ తేనె ఖరీదు కేజీ వచ్చేసి 2.5 లక్షల రూపాయలని తెలిసి ఆశ్చర్యపోయాం. అమెరికాలో అల్కట్రాజ్ జైలు ప్రత్యేకతలు, స్విట్జర్లాండ్‌లో ఒక మహా పర్వతంపై 13 వేల అడుగుల ఎత్తునున్న పూరిగుడిసె దృశ్యాలు అబ్బురపరిచాయి. సముద్రంలో భయంకరంగా కనిపించే కొన్ని రకాల చేపల ముఖాలు వింతగొలిపాయి.
-తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి (మల్కాపురం)
వయస్కాంతం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బోటిక్స్‌లలో 1.6 మిలియన్ కేంద్రాల్లో వాడేవి అనేక రసాయనాలతో కూడిన ప్రమాదకర పదార్థాలేనని ఈ వారం స్పెషల్ ‘వయస్కాంతం’ ద్వారా తెలుసుకున్నాం. సహజసిద్ధంగా పెరిగే వయసును జయించాలంటే చికిత్స కూడా సహజసిద్ధంగానే ఉండాలని గ్రహించగలగాలి. ‘కావచ్చు’ మనల్ని నిజ జీవితంలో అనేక సందర్భాలలో ఏ విధంగా కాపాడుతుందో ‘స్ఫూర్తి’ ద్వారా చక్కగా తెలియజేసినందుకు రచయితకు ధన్యవాదాలు. బౌద్ధాలయంలో పులుల్ని పెంచే బౌద్ధ సన్యాసి తనకున్న లుకేమియా వ్యాధిని జయించి నేటికీ జీవించి వున్న వైనాన్ని ‘పులుల ఆలయం’ ద్వారా ఆనందపరవశుల మయ్యాం.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)
సండే గీత
చిన్న సమస్యను భూతద్దంలో చూసి వెరవడం అవివేకం. దాన్ని చక్కగా అర్థం చేసుకొని జీవితాన్ని చక్కదిద్దుకోవడం ఉత్తమం అని ‘సండే గీత’లో హృద్యంగా చెప్పారు. అలాగే ‘వినదగు’ శీర్షిక చాలా బాగుంటోంది. వెంకటేశ్ ‘కుంచెం తేడాగా’ కార్టూన్లు తాజాగా కడుపుబ్బ నవ్విస్తున్నాయి. సినిమా తీయడం ఒక యజ్ఞమే కాదు. పలు సమస్యలతో నిండిన వ్యాపకం అంటూ సాగిన వ్యాసం వినోదాత్మకంగా ఉంది.
-డాక్టర్ శివభూషణం (కర్నూలు)
కుంచెం తేడాగా..
కార్టూన్లు ఆలోచింపజేసేవిగా ఉంటూ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. అన్నీ వచ్చునన్న అహంకారం, నిర్లక్ష్యం మనిషిని ఎలా వెనుక పడవేస్తాయో, అలాగే జీవితంలో కష్టపడ్డవానికి తగిన ఫలితం ఏదో నాటికి తప్పకుండా ప్రాప్తిస్తుందని ‘సిసింద్రీ’ కథ తెలియజేసింది. అన్ని శీర్షికలు బాగుంటున్నాయి.
-ఎన్.సురేందర్‌రావు (కరీంనగర్)
విశ్వాంతర్జాలం
ఈ వారం స్పెషల్ ద్వారా ఇంటర్నెట్‌ను తలదనే్న అద్భుతమైన వ్యవస్థ అవుటర్‌నెట్ గురించి ఆసక్తిదాయకమైన ఎన్నో విషయాలను తెలియజేసి మమ్ములను ఆనందింపజేసిన రచయితకు ధన్యవాదాలు. అవుటర్‌నెట్ ప్రాజెక్టు లీడ్ సయ్యద్ కరీం తదితరుల టీం వర్క్ విజయవంతం అవుతుందని, అవుటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. ‘ఏమి లోకమిది’ శీర్షికలో ఫ్లోరిడాకు చెందిన ఎమిలీ కింగ్ ఓ ప్లాస్టిక్ డిజైన్‌కు ప్రాణం పోసి ముద్దే చేతగాని మొద్దబ్బాయిలు, అమ్మాయిల ఇబ్బందులు తొలగించేందుకు మేక్ అవుట్ ప్రాక్టీస్ పిల్లోను సృష్టించిన వైనాన్ని తెలుసుకుని ఆశ్చర్యచకితులమయ్యాం.
-గోపాల్ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు)
సూపర్బ్
‘బ్రతుకు భరోసా’ ముఖచిత్ర కథనం సూపర్బ్. ఈ వారం స్పెషల్ ప్రత్యేకంగా వీధి వ్యాపారులకు సుమారు కోటి మందికి దేశంలో ప్రముఖ నగరాలైన ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో వున్న చిన్న వ్యాపారులందరికీ ఈ చట్టం రూపుదిద్దుకోవడం హర్షణీయం. అలాగే ‘అక్షరాలోచనాలు’ శీర్షికలో ప్రచురించిన ‘జీవనయాత్ర’ కవిత ఆలోచింపజేసేదిగా ఉంది. -మహమ్మద్ రఫీ (శ్రీకాకుళం)