Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టాలెంట్ (కథానిక)

$
0
0

బెంగుళూరు నుండి కారులో శృంగేరి బయలుదేరాను. ప్రయాణంలో అనేక వింతలు అనేక అనుభవాలు. ఘాట్ రోడ్డు పాము మెలికలు తిరిగిన రోడ్డు మీద కారు ముందుకు సాగుతుంటే ఎత్తయిన వృక్షాలు రోడ్డుకి ఇరువైపులా ఉండి వింత అందాన్ని ప్రసాదిస్తున్నాయి. మీదకి వెళుతున్న కొద్దీ లోయలు ఆ లోయల్లో ఆకుపచ్చ తివాసీ పరిచినట్లు కనపడుతున్న వృక్షసంపద. ఆ కొండ ప్రాంతంలోనే కాఫీ, తేయాకు తోటలూ. చిరు రచయితగా బుడి బుడి అడుగులు వేస్తున్న నన్ను ఎంతో ఆనందపరుస్తున్నాయి.
శృంగేరి శారదా పీఠంలో శారదాదేవిని, మిగిలిన దేవతల విగ్రహాల్ని దర్శించుకున్న నాకు అక్కడి ధార్మిక వాతావరణం ననె్నంతో ఉత్తేజపరిచింది. ముఖ్యంగా అక్కడున్న కోనేరులో వందల కొలదీ చేపలు ఒడ్డుకి వచ్చాయి. యాత్రికులు వేసిన పేలాలు, మురీలు, ఒకదాన్ని మరొకటి పోటీపడి తోసుకుంటూ తింటున్నాయి. ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఆ చేపల సమూహం వాటి మీద నల్లచీర పరిచినట్టుంది.
ఆ చేపలకి తినుబండారాలు వేసి అది పోటీపడి తింటూ ఉంటే కేరింతలు కొడుతున్నారు. పది పనె్నండేళ్ళు ఉన్న అబ్బాయి, అమ్మాయి, ఆ పిల్లల తల్లి తల పక్కకి తిప్పి చూసింది. ఆమె కళ్లల్లో ఆనందంతో పాటు ఆశ్చర్యం. నేను అనుకోకుండా ఆమెను చూశాను. ఆమెను ఎక్కడో చూసినట్లనిపించింది.
‘‘మాష్టారూ! నన్ను గుర్తుపట్టరా?’’ నేనూ మీరు పనిచేసిన స్కూల్లోనే కొన్నాళ్లు పనిచేసిన దుర్గని’’ అని అంది. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నా ప్రశ్నకి, కుతూహలానికి సమాధానం దొరికింది.
‘‘బాగున్నావా దుర్గా! నిన్ను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఏం చూస్తున్నావు? ప్రశ్నల వర్షం కురిపించాను.
‘‘ఇప్పుడు నేను విజయవాడలో ఉమెన్స్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. మా వారు కూడా టీచింగ్ లైనులోనే ఉన్నారు’’ అని అంది.
‘‘నాకు తెలుసమ్మా! నీవు పైకివస్తావని అప్పుడే అనుకున్నాను. భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతావని’’ అని అన్నారు.
‘‘అదంతా మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మాస్టారూ!’’ అంది దుర్గ ఆ తరువాత పిల్లలిద్దరికో నన్ను పరిచయం చేసింది. పిల్లల క్రమశిక్షణ, వినయ విధేయతలు నాకు నచ్చాయి. నా నుండి వీడ్కోలు తీసుకుని వెళుతున్న దుర్గను చూస్తున్న నాకు గతం ఒక్కసారి కళ్లెదుట కదలాడింది. విద్యారంగంలో అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా? అప్పుడు ఉండేవారు స్కూల్లో రకరకాల మనస్తత్వాలు కలిగిన విద్యార్థులు. బుద్ధిగా చదువుకునే వారు కొందరైతే ఉపాధ్యాయులకి మారు పేర్లు పెట్టి అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువు మీద శ్రద్ధ కనపర్చని వారు ఉండేవారు.
ఆ రోజుల్లో ప్రభుత్వం నేచురల్ సైన్స్‌లో లైంగిక విజ్ఞానం ఒక చాప్టర్‌లో పొందుపర్చారు. అదీ టెన్త్‌క్లాస్‌లో మొక్కల్లో పరాగసంపర్కం, పరపరాగ సంపర్కం గురించి బోధిస్తున్నప్పుడు మానవ శరీరంలో ముఖ్యమైన లైంగికావయవాల గురించి బోధించడం ఎంతో ముఖ్యమని ప్రభుత్వం అనుకుంది. దానివలన బాలబాలికల భావిజీవితంలో ఎంతో ఉపయోగం ఉందన్నదే ప్రభుత్వ భావన. కొండనాలికకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారైంది. విద్యావిధానంలో ఈ లైంగిక విజ్ఞానబోధన టెన్త్‌క్లాస్‌కి నేచురల్ సైన్స్ బోధించడానికి కొత్తగా జాయినైన దుర్గకి అప్పగించారు. అది కో ఎడ్యుకేషన్ పాఠశాల. అలాంటి పాఠశాలలో ఆమె టెన్త్‌క్లాస్ వాళ్ళకి నేచురల్ సైన్స్‌లో లైంగిక విజ్ఞానం చాప్టర్ బోధించడానికి నడుం కట్టిందంటే నల్లేరు మీద నడకే. చాలా సాహసపూరితమైన చర్య కూడా.
కౌమారం వయస్సు. ప్రారంభ యవ్వనావస్థలకి చేరుకుంటున్న అమ్మాయికి, అబ్బాయిలకి, స్ర్తి, పురుష లైంగికావయవాల గురించి వాటి పనితీరు, శరీరంలో వచ్చిన మార్పులు గురించి దుర్గ బోధించడానికి సాహసించిందంటే అది ప్రశంసనీయమైన విషయమే.
పాఠం బోధిస్తున్నప్పుడు అబ్బాయిలు కొందరు ఆమెను అల్లరి పెట్టడానికి, వినోదించడానికి కొంటె ప్రశ్నలు వేసేవారు. అయితే ఆమె జంక లేదు, తొణకలేదు. ఆ సమయంలో ఆమె ఒక ఉపాధ్యాయురాలు. విద్యార్థుల సందేహాలు తీర్చడమే తన బాధ్యతని అనుకునేది. నిర్భయంగా సిగ్గుపడకుండా వాళ్ళ సందేహాలు నివృత్తి చేసేది.
వయస్సులో చిన్నదైనా దుర్గ విద్యాబోధన మెచ్చుకోకుండా ఉండ లేకపోయేవారు మిగిలిన ఉపాధ్యాయులు. ఎందుకంటే లైంగిక విద్య బోధించడానికి మగవాళ్లే సందేహపడతారు. సంకోచిస్తారు. అటువంటిది దుర్గ సాహసిస్తోందంటే ఆమె ధైర్యం, కృషి మెచ్చుకోవాల్సిందే.
ఆనాడు కనుక విద్యార్థులు ఆమె లైంగిక విద్య బోధిస్తుంటే కొంటె ప్రశ్నలు వేసి వేధించి వినోదించే వారు కాని ఈ కాలం విద్యార్థులయితే ఆలోచించడానికే భయమేస్తోంది. ఆమె మీద అత్యాచారం చేయడానికి కూడా వెనుకాడరేమోనని నాకు అనిపిస్తోంది.
ఒకసారి స్ట్ఫారూంలో ‘ఏవోయ్! గోపాలం ప్రభుత్వానికి బుద్ధిలేదు కాని ఈ లైంగిక విద్యను ఈ కౌమార ప్రారంభ యవ్వనావస్థలో విద్యార్థులకి బోధించడం ఏమిటోయ్? ఇలాంటి విషయాలు ఎవ్వరూ బోధించినప్పటికీ మన పరిసరాలలో జంతువులు, పక్షుల కలయిక చూసి తెలుసుకుంటారు. ఇది ప్రకృతి ధర్మం. ఆకలి వేసినప్పుడు అన్నం ఎలా తింటామో, కామం విషయంలోనూ అంతే. ఇది ఎవ్వరూ చెప్పనక్కరలేద’ని తెలుగు మాస్టారు అన్నారు.
అతని మాటల్లో కొంత సత్యమున్నప్పటికీ పూర్తిగా నేను ఏకీభవించ లేకపోయాను. ఎంత ప్రకృతి ధర్మమైనా, ఇక్కడ లైంగిక కార్యకలాపాలు ముఖ్యం కాదు. మానవ శరీరంలో మిగిలిన అవయవాల లాగానే లైంగికావయవాలు కూడా పాఠ్యాంశంలో చేర్చడం అనివార్యమే.
అయితే అర్థం చేసుకున్న వారు అర్థం చేసుకుంటాడు. అల్లరి పెట్టి వినోదిద్దాం అనుకునే వాళ్ళు వినోదిస్తారు. ప్రభుత్వ ఆలోచన మంచిదే అని నేను అనుకునే వాడిని.
ఆ తరువాత దుర్గ మరొక ఊరికి ట్రాన్స్‌ఫరై వెళ్ళిపోవడం ఆ తరువాత నేను రిటైరైన తరువాత ఇన్ని సంవత్సరాలకి దుర్గ ఇలా తిరిగి కనిపించింది. మొత్తానికి దుర్గ టాలెంట్ ఉన్న ధైర్యస్తురాలే. అందుకే జీవితంలో అందివచ్చిన అన్ని అవకాశాలు వినియోగించుకుని ఉన్నత పదవిలో ఉంది అని అనుకున్నారు.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి,
విజయనగరం. సెల్ నెం: 08922-231605

మన సాహితీమూర్తులు

పండిత పూర్ణకవి
పింగళి లక్ష్మీకాంతం

‘‘పింగళి లక్ష్మీకాంతం ప్రథమ శ్రేణి కవి, విమర్శకులు, మేధావి, అధ్యాపకులు, నిర్వహణాదక్షుడు. మహాభారంతపైన పట్టు, అధికారం ఉన్న పండితుడు. అంతేకాదు, కట్టమంచి రామలింగారెడ్డి ఆదరణను చూరగొన్న వ్యక్తి’’ అని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
కార్యదర్శిగా ఉన్న దేవులపల్లి రామానుజరావు అన్న మాటలు ఇవి. బహుభాషా పండితోత్తముడు రాజకీయ దురంధరుడు పివి.నరసింహారావు ఒకసారి పింగళి లక్ష్మీకాంతాన్ని ఉద్దేశిస్తూ తెలుగుభాషా సారస్వతాభివృద్ధికి గణనీయమైన సేవ చేసిన వ్యక్తి. ఆయన రచనలు, సాహిత్య విజయాలు, తెలుగుభాష మాట్లాడే ప్రజలను ఎల్లప్పుడూ
ఉత్తేజపరుస్తూనే ఉంటాయన్నారు.

ఉత్తమ నటుడుగా, కవిగా, విద్వాంసుడిగా గుర్తింపబడుతూ, తెలుగువారికి, సాహితీవేత్తల ఆదరణాభిమానాలు పొందిన వారు లక్ష్మీకాంతం. తరతరాలుగా అణిగి ఉన్న కవితాశక్తి పింగళి వారి వంశానికి అబ్బింది. మహామేధావి గురువుల్ని మించినట్లు శతావధాని లక్ష్మీకాంతంగా వెలుగులోకి వచ్చారు. ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం మేళవించి చెప్పగల పూర్ణకవి పింగళి లక్ష్మీకాంతం.
గౌతమ గోత్రజ్ఞులైన పింగళి అసలు మహారాష్ట్ర దేశం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఒకప్పుడు వలస వచ్చారని, పింగళి మోరోపంతు, పింగళి అక్కన్న, లక్ష్మీబాయి వాళ్ళ పూర్వులని పింగళి వెంకయ్యపంతులు వంశ చరిత్రలో చెప్పుకున్నారు. వారిలో ఒక శాఖ చల్లపల్లి సంస్థానంలో మంత్రిత్వంలో చేరారు. ఆ వంశంలో పింగళి వెంకయ్య, పింగళి లక్ష్మీకాంతం తండ్రి వెంకటరత్నం, తల్లి కుటుంబమ్మ. వారికి 1892న జనవరి 10వ తేదీన చట్టూర్పులో లక్ష్మీకాంతం జన్మించారు. రేపల్లెలో, బందరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేసారు.
పింగళి లక్ష్మీకాంతం 16వ సంవత్సరం గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో వేమవరంలో శతావధానానికి తిరుపతి వెంకటకవులు వీరిని వెంట పెట్టుకుని వెళ్లారు. 1927 వరకు ఆంధ్రదేశంలో కవి సింహం వలె వీరవిహారం చేసారు. బందరు, విజయవాడ, ముదునూరు, తోట్లవల్లూరు, పెదపులివర్రు, నెల్లూరు, ఏలూరు మొదలగు పలుచోట్ల శతావధానం చేసి ఆంధ్ర పండితుల మెప్పు పొందారు. ఉద్యోగరీత్యా మద్రాసులో ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో పండితులుగా ఉంటూ భారతాన్ని పరిశోధన చేసారు. అప్పుడే బగ్జార్గల్ నవల, బ్రిటీష్ చరిత్ర అనువాదం చేశారు. సౌందర్యానందం, అశ్వఘోషుడు రచించినదని అనువదించారు. కాటూరి వారి సహాయంతో పూర్తి చేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు పండితులుగా ఉద్యోగం కొనసాగించారు.
లక్ష్మీకాంతం చెళ్ళపిళ్ల వెంకటశాస్ర్తీ వద్ద సంప్రదాయబద్ధంగా శుశ్రూష చేస్తూ విద్యా సముపార్జనలో గురువులుగా మెప్పుపొందారు. ఒకమారు క్లాసులో పింగళిని చెళ్లపిళ్ల ప్రశ్న వేసారు. ‘నదికి, కాలువకి తేడా ఏమిటని అడిగితే, క్లాసులో పిల్లలు పొంతన లేని సమాధానం ఇచ్చారు. లక్ష్మీకాంతం మాత్రం ‘నది స్వభావ సిద్ధంగా పుట్టింది, కాలువ మాత్రం మనుష్యులు తవ్వింది’ అని చెప్పగానే ‘నీవు పింగళి సూరన్న అంతటి వాడయ్యేటట్లున్నావే’ అని ఆశీర్వదించారు. అప్పటి వరకు శిష్యులంతా పండితులం కావాలనుకునే వారే కాని, కవిని కావాలని కోరటం పింగళిలోని శ్రద్ధ్భాక్తులు వెంకటశాస్ర్తీని ఆకర్షించింది. తాను రాసిన నాటకాలలో వేషధారణ ఇస్తూ నటించే అవకాశం కల్పించారు. అప్పుడే పద్యాలు ఘంటాపథంగా చెప్పగలగడం తోడ్పడింది. 1912 నుండి 1927 వరకు నాటకాలు వేసారు. భాషా సేవకులుగానే నాటకాలు వేయడం ధ్యేయంగా పెట్టుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీడరుగా తన పర్యవేక్షణలో 70 మంది పండితుల్ని తీర్చిదిద్దారు. 1938 ప్రాంతంలో చెళ్లపిళ్ళ, శ్రీపాద, రాయుడుశాస్ర్తీ, జనమంచి శేషాద్రిశర్మ, నారాయణదాసుకు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చు సందర్భంలో లక్ష్మీకాంతం ఆ సమావేశంలో ప్రదర్శించిన నేర్పును హర్షిస్తూ సిండికేటు వారు మెచ్చుకుంటూ తీర్మానం చేసారు. వారు పదవీ విరమణ పిదప విజయవాడ ఆకాశవాణిలో స్పోకెన్ వార్డు ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆ తరువాత డీన్‌గా వెంకటేశ్వరుని విశ్వవిద్యాలయంలో ఉన్నారు. అప్పటి నుంచి తిరుపతిలోనే ఉంటూ ‘ఆంధ్ర సాహిత్యశిల్ప సమీక్ష’ ‘కుమార వ్యాకరణం’ అంటూ రెండు గ్రంథాలు రచించి ప్రచురించారు. ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర’ 800 పేజీలు రాసారు. ఆ సుదీర్ఘ చరిత్ర పూర్తికాకుండానే 1972 జనవరి నెలలో పరమపదించారు.
ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు అకాడమీ డైరెక్టరు ఇలా అన్నారు. ‘‘లక్ష్మీకాంతం శిష్యులలో నేనూ ఒకడ్ని, తెలుగు శిష్ట వ్యవహారిక భాషావాద ప్రాచుర్యానికి వారు అమూల్యమైన సేవ చేసారు. తెలుగు పాఠ్య పుస్తకాలు వెలువడటం లక్ష్మీకాంతం కృషి ఫలితమే. పాఠ్యగ్రంథాలు రాసే విధానం నేర్పే ‘స్టైల్ వర్క్‌షాప్’ను తిరుపతిలో వారు నిర్వహించి, పాఠ్యపుస్తకాల వివాద సమస్యను ఏకగ్రీవకాల తీర్మానం ద్వారా ఆమోదించే పరిష్కార మార్గం చూపారు’ అని అన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖాధిపతి దివాకర్ల వెంకటావధాని మాట్లాడుతూ ‘పింగళి గారు ప్రొఫెసర్లకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శిష్య ప్రశిష్యులే, అందువల్ల ఆయనను ‘‘గురునాం గురు’’ అని సంబోధిస్తున్నానని పేర్కొనడం వారి ప్రతిభకు తార్కాణం.
పద్య కవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యం ఇచ్చిన ఘనత వీరిది. అవధానాన్ని పామరులు సైతం ఆనందించేలా తీర్చిదిద్ది కీర్తి గడించిన పింగళి లక్ష్మీకాంతం సదా చిరస్మరణీయులు.

- అడపా రామకృష్ణ

జోకులు కేకులు

మహేష్ : చాలా ఎక్కువ కట్నంతో అనుష్కని పెళ్లి చేసుకుంటున్నావా? అయితే అనుష్క చాలా డబ్బుగలదై ఉంటుంది.
రాగేష్ : అదేం కాదు... ఆమె నల్లగా కురూపిలా ఉంటుంది. అందుకే ఎక్కువ కట్నం అడిగినా ఇస్తున్నారు.

అరుదైన పాతచిత్రం

1972లో న్యూఢిల్లీలో ఆసియా-72 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఖాదీ హస్తకళల ప్రదర్శనలో పొందూరు (శ్రీకాకుళం జిల్లా) ఖాదీ మహిళా కార్మికులు తాము రాట్నం (చరఖా)పై తీసిన నూలు (దారం) చిలపలను ప్రధాని ఇందిరాగాంధీకి
సమర్పించారు. ఈ చిలపలను తిలకించి
పులకించిపోయారు.
ఈ సందర్భంగా మహిళా కార్మికులు బాసా అచ్చియ్యమ్మ, దున్న అచ్చియ్యమ్మలను ఇందిరాగాంధీ అభినందించారు. ఖాదీ పరిశ్రమ వికాసానికి అన్నివిధాల సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉదంతం ఖాదీ చరిత్రలో ఒక మైలురాయిగా పేర్కొంటారు.

- వాండ్రంగి కొండలరావు, పొందూరు, (శ్రీకాకుళం జిల్లా). సెల్ నెం: 9490595391

మనోగీతికలు

జయహో!
వాడు విడిపోతున్నందుకు పండుగ చేసుకున్నాడు
భవితలో బ్రతకలేక చతికిలపడిపోతాడని తెలీదు
ఉమ్మడిగా సాగలేక వేరవుతోన్న తమ్ముడు వాడు
పోతూ పోతూ నా ఆశల సౌధాన్ని కైవసం చేసుకుని
నా చిరునామాకు ఎగనామం పెట్టినవాడు
నా కలల్ని సమాధి చేసి నిశీధిలోకి తోసేసాడు
నా అస్తిత్వాన్ని నిర్యాణం చేసి
పునర్నిర్మాణ ప్రణాళికలు గీస్తున్నాడు
నేడు తెలుగునాడుకు గూడు లేదు
నీడకు భద్రత భరోసా కల్పిస్తామని
ప్రకటనల ప్రహసనంలో వర్తమానం-
కలుపుమొక్కల్లా పుట్టుకొస్తున్న
రాజకీయ పార్టీల్లో
ఏ పిలుపు విని ప్రజల
మద్దతు తెలుపుతారో
అలుపెరుగని ఏ సైనికునికి
గెలుపుగుర్రం ఎక్కిస్తారో
సున్నితంగా సునిశితంగా
విశే్లషించాల్సిన సమయమిది-
నేటివరకూ సాటిలేని ఉగాది కోయిల
రేపటి నుండీ పోటీ ఎదుర్కోవాలి-
ఆత్మగౌరవ పదం గర్వంగా లాస్యించే వేళ
రాజకీయ క్రీడలూ క్రీనీడల మధ్య
తెగిన గుండెతో నిండుగా పోరాడాలి-
సరికొత్త ఆంధ్రావనికి రూపురేఖలు దిద్దాలి
గాయాల నుండి విజయ గేయాలు రచించుకోవాలి
జయహో!!

- జోగారావు గుండాన, సెల్ నెం: 9490185708

జయకు స్వాగతం
కాలచక్రం గిర్రున తిరిగింది
విజయలో విలవిలలాడింది,
ఏడాది పొడుగుతా
విలయతాండవం చేసింది
విగత జీవుల కుప్పలు మిగిల్చింది
విద్రోహల విచ్ఛిత్తితో
విద్వేషాల సెగల పొగలతో
వికటాట్టహాసం చేసింది
కులమతాల మధ్యనే కాదు -
ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి
విషనాగై విషాన్ని చిమ్మి
శాంతిని అగ్నికి ఆహుతి చేసి
ప్రకృతిని వికృతం చేసి,
వీరవిహారం చేసింది
శిశిరం తొలగి వసంతోదయమైనా,
విరిగిపడిన, మొదలు తెగిన
మొండి చెట్లు, తేనెపట్లు, వేపపూత, మావిచిగురు
కోయిల పంచమరాగాలు
కానరాదు - వినగరాదు
ఎటుచూసినా -
నిరాశా, నిస్పృహ విస్ఫలింగాలు అయినా-
మానవుడెపుడూ ఆశాజీవి!
సమతాభావం పూస్తుందనీ,
మమతల హృది చిగురిస్తుందనీ,
ప్రేమకోయిన కూస్తుందనీ,
ఇలలో వెనె్నల విరియుననీ
స్వాగతించె జయ ఉగాదికి జయహో అని.

- ఏ.సీతారామారావు, విజయనగరం-535002. ఫోన్ : 08922-237122.

మంచిమాట
తొలిమాట అమ్మ నేర్పిస్తుంది
మలిమాట గురువు ద్వారా వస్తుంది
చల్లని మాట అమృతం కన్నా తీపినిస్తుంది
ఆత్మీయుల మాట ఆదరణను కల్పిస్తుంది
ఒక మాట ప్రాణాన్ని కాపాడేట్టు చేస్తుంది
చురుకైన మాట చిరాకును తెప్పిస్తుంది
కఠినమైన మాట కనికరాన్ని దాచేస్తుంది
సరైన మాట ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది
సూటిపోటి మాట అశాంతికి దారి తీస్తుంది
సరికాని మాట నిజాన్ని దూరం చేస్తుంది
మంచిమాట జీవితకాలం నిలుస్తుంది
దుఃఖాన్ని మరిపించి ఓదార్పునిస్తుంది
అందుకే.....
మనమందరం
మంచి మాటనే ఎంచుకుందాం

- అయర్ శివాజీపట్నాయక్, కాశీబుగ్గ, సెల్ నెం. 9949024136

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.

కథానిక
english title: 
kadhanika
author: 
- గూడూరు గోపాలకృష్ణమూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles