
కొన్ని రోజులుగా - టాప్ ఊడిన నల్లాలాగ సాగుతూ వచ్చిన ఇంటి తగవు అమావాస్య నాటికి గాని తెమలలేదు. ఒక కొలిక్కి రాలేదు. అంతవరకూ గాలివాన కురుస్తూనే ఉంది. ఆ తగవు తీరిన తరవాత కుటుంబ పెద్ద కనకరాజుకి ఎనలేని తెరపి కలిగినట్లనిపించింది. సుఖమయమైన ఆ విశ్రాంత భావనతో బాటు, అతడిలో అతడికి తెలియకుండానే ఓ విధమైన వైరాగ్య చింతన చోటు చేసుకుంది. ఇకపై అన్నిటికీ, కావలసిన వాళ్లందరికీ కాస్తంత ఎడంగా ఉండాలన్న ఆలోచన కూడా లోతుగా నాటుకుంది. ఇంతకూ ఆ వచ్చిన తగవు ఎవరితోనని - స్వయాన తన స్వంత సుపుత్రుడితోనే!
తెర వెనుక నుండి ఇంటి కోడలు ఈత చాపకు నిప్పంటిస్తున్నట్లు నివురు ఎగదోస్తుండగా - ఒక్కగానొక్క పుత్రరత్నం చిట్టిబాబేమో పెళ్లాం వేస్తూన్న తాళానికి తగ్గట్టు లయ విన్యాసం చేస్తూండగా - కొంప దాదాపు కొల్లేరయి కూర్చుంది. అంతవరకూ తను చేస్తూన్న కలర్ పెయింటింగ్‌ల వ్యాపారం ఎదుగూ బొదుగూ లేకుండా ఉందని, ఇలా ఒంటెద్దు బండిలా సాగుతూ పోతే తన భవిష్యత్తు అంధకార బంధురమయి పోతుందని, ఊపిరి సలపనివ్వని రీతిన అదే హోరుగా పోరాడి, చిదుకులతో గూడు కట్టిన తల్లి పిచుకలా నానా విధాల కష్టపడి కట్టిన మిద్దె ఇంటిని అమ్మించేశాడు.
మిద్దింటి అమ్మకం పూర్తయిన తరవాత కనకరాజుని గుంజులాటకు లోను చేసిన సందేహం ఒక్కటే - కొత్త పెళ్లాం కాపురానికి రాక ముందు చిట్టిబాబు అదే ఇంట్లో ఉంటూ అదే రంగుల వ్యాపారం చేస్తూ సంతోషంగానే కదా ఉన్నాడు. అలాంటప్పుడు కొత్త పెళ్లాం గడప తొక్కిన తరవాతనే కొడుక్కి అంతటి వ్యాపార దీక్ష అంత అమాంతంగా ఎలా వచ్చేసిందో! కొడుకిక, అడ్డాల్లో ఉండే బిడ్డడు మాత్రం కాడని అతనికి నిక్కచ్చిగా అర్థమైంది. తనకు ఉద్యోగ విరమణ వయసు దగ్గర పడుతూందన్న వైనం తెలుసుకున్న తరువాతనే ఇంట్లో, ఇంటి ముంగిట్లో ఇంతటి రాద్ధాంతం - క్లస్టర్ బాంబులా పేలనారంభించిందంటే, దాని వెనుక మద్దిలపాలెం మట్టి గట్టంతటి కథా కమామీషూ గోప్యంగా దాగి ఉందన్నది ఆరు పదులు దాటుతూన్న కనకరాజుకి తెలియనిదా ఏమిటి?
తల్లి ప్రేమ మహా దొడ్డ ప్రేమన్నట్లు అట్టుడుకుతూన్న ఈ వ్యవహారాల్లోకి తలదూర్చి పరిస్థితిని సమస్థాయికి తీసుకురావడానికి భార్య పుష్పవతి ప్రయత్నించలేదు. దానికి మారుగా కొడుక్కి కొండంత వత్తాసు పలికింది. ‘అనుభవించవలసింది అంతా అనుభవించేసారుగా! ఇక వాడి భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించండి మరి. రేపు వాడికీ బిడ్డాపాపలూ కలుగుతారుగా. మరి ఈ చిన్నపాటి వ్యాపారంతో వాళ్లనెలా చూసుకుంటాడూ’ సహధర్మచారిణి పలికిన ఆ ఒక్క మాటతో కనకరాజు నోటికి మూత పడిపోయింది.
ఏది ఏమైతేనేం - కొడుకూ కోడళ్ల ప్రవర్తనతో, భార్య ఉపేక్షతో విసుగెత్తిపోయిన కనకరాజు మనసున బాంధవ్యాల పట్ల ఒక అనూహ్యమైన అభావాన్ని పెంచుకున్నాడు. నేడు బంగారం వంటి మిద్దె ఇంటిని అమ్మించేశాడు. రేపు పెళ్లాం మాటల నవనీత తైలం పూసుకొని వచ్చి, మరింకేదో తేల్చమని మొరాయించినా మొరాయిస్తాడు. వాడి కోర్కెలోని సాధ్యాసాధ్యాల్లోకి వెళ్లకుండా పక్కబలంగా నిల్చోవడానికి వాడి బంగారు తల్లి ఉండనే ఉంది కదా! కావున - ఇల్లమ్మింతర్వాత వచ్చిన డబ్బలో సగం సొమ్ముని తన వాటాగా తీసుకొని, ఇకపై కొడుకూ కోడలితో కలసి ఉండే ఆస్కారం లేనే లేదని పరోక్షంగా తేల్చి వేస్తూ సింగారనగరులో ఒక సింగిల్ రూము ఫ్లాట్ తీసుకొని సహధర్మచారిణితో సహా మకాం మార్చి వెళ్లిపోయాడు కనకరాజు. చిట్లిన అద్దమూ, విరిగిన మనసూ మళ్లీ అతుక్కోవడం అంత సులభసాధ్యం కాదు కదా!
వాస్తవం చెప్పాలంటే - తను విడిగా వెళ్లిపోవడాన్ని చూసి కొడుకూ కోడలూ చింతిస్తారన్న ఆలోచన కనకరాజుకి ఏ కోశానా కలగలేదు. అటువంటి సున్నిత భావం ఇకపైన కలగదు కూడాను. అటువంటి ఆత్మసమర్థనల వల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ ఉండబోదని అతనికి బాగానే తెలుసు. తననూ పుష్పవతినీ తమతో ఉండమని అడగటం అంటే- నోటితో నవ్వి నొసటితో వెక్కిరించటం అన్నమాటే! అతడు అనుకున్నది ఊహాగానం కాదని, అక్షరాలా నిజమని కొన్ని రోజుల్లోనే తేలిపోయింది. తామిద్దరమూ సింగిల్ రూము ఫ్లాటుకి వెళ్లిపోయింతర్వాత కోడలు పిల్ల తన ఇంటి తరఫు వాళ్లతో బాటు ఇరుగు పొరుగు స్ర్తిలనూ పిలిచి వాళ్లు కొత్తగా కొనుక్కున్న టూ బెడ్‌రూమ్ ఫ్లాటులో విందు భోజనం ఏర్పాటు చేసింది. తమను పిలవడమూ పిలవకపోవడమూ అన్న మాటను పక్కనుంచి - మాట వరసకైనా తమకు ఒక చిన్నపాటి కబురంపితే తమ పరువుని తాము కాపాడుకుందురు కదా! పెద్దతరం వాళ్ల మనోభావాలను మన్నించేపాటి సమయమూ తీరికా ఇప్పటి తరం వాళ్లకెక్కడుందని. కొడుకూ కోడళ్ల వైఖరికి పుష్పవతి ఈసారి నిజంగానే ఖిన్నురాలవు తుందనుకున్నాడతను. కాని భార్య విడ్డూర వ్యాఖ్యానం విని అతడికి దిమ్మ తిరిగినట్టనిపించింది. యువతీ యువకుల మధ్య మనమెందుకండీ - పానకంలో పుడకలా! అంటూ ఎదుర్రాయి వినిరింది.
* * *
ఉద్యోగ విరమణ చేసిన తరవాత కనకరాజు మాటలతో ‘ఇదీ’ అని చెప్పలేని ఓ విధమైన అసహాయ స్థితికి లోనయాడు. బెల్లంకొట్టిన రాయి వంటి ఒంటరితనం అతణ్ణి పరివేష్టించినట్లయింది. అనే్నళ్ల సర్వీసు తరవాత కలివిడి లేని జీవితానికి అంత త్వరగా అలవాటు పడటం అంటే మాటలు కాదు కదా! ఎట్టకేలకు గుండెను దిటవు పర్చుకునేందుకు సర్వసన్నద్ధుడయ్యాడు కనకరాజు. గతాన్ని తలచి తలచి వగచడం వల్ల, పెళుసైన మనోభావాల మబ్బుల మధ్య నలిగిపోతూ కాలం గడపడం వల్ల ఎవరికేం లాభం? ఆ ప్రయత్నంలోని కొనసాగింపుగా అతడు అనకాపల్లిలో ఆముదాల అంగడి వీధిలో ఉంటూన్న తన పెదతండ్రి కొడుకు సోమన్న ఇంటికి భార్యతోసహా బయల్దేరాడు. అప్పుడప్పుడు మానసిక స్వాంతనకై సముద్రం మధ్యలో స్థలాంతర గమనం చేసే ద్వీపంలా, మనిషికి సహితం కొత్తగాలి కొత్త మార్పూ ఎంతైనా అవసరం కదా! కొత్తగాలి సోకితే ఆకాశం సహితం కొత్తగా కనిపించవచ్చు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉత్తేజకరంగా గోచరించవచ్చునేమో!
రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుండి ఉద్యోగ విరమణ చేసిన సోములుకి బిడ్డల్లేరు. అయినా పైబడ్తూన్న వయసుని ఆమడ దూరానికి నెట్టి, అడపాదడపా ఎదురవుతూన్న ఒడిదుడుకుల్ని ఖాతరు చేయకుండా అన్నయ్య వదినలిద్దరూ చీకూ చింతా అంటే ఏమిటో తెలియని రీతిన సంసారం సాగిస్తూ వర్షాకాలపు చెరువులా నిండుగా ఉంటారు. అదే నిండు మనస్సుతో కనకరాజునీ పుష్పవతినీ వెలుగొందే కళ్లతో ప్రత్యుత్థానం చేసి ఇంట్లోపలకు తీసుకెళ్లారు దంపతులిద్దరూ. పెకలించి విసిరివేయబడ్డ ఏకదళ వృక్షాల్లా మనుగడ సాగిస్తూన్న ఆ ఇద్దరు జీవన సహచరులకీ బంధుజనం పలకరింపు చల్లగా సోకిన తొలకరి చిలకరింపు వంటిదే కదా! అచ్చట్లూ ముచ్చట్లూ అయింతర్వాత, పానీయాలు తాగి ప్రయాణ బడలిక తీరింతర్వాత సోములు దంపతులిద్దరూ కలసి వాళ్లకు ఇల్లంతా తిప్పి చూపించారు. పూజ గదిలో కూర్చుండబెట్టి తాతల కాలం నాటి నుంచీ సేవిస్తూన్న దైవ చిత్రాల మహాత్మ్యం గురించి వివరించి చెప్పారు. వంశపారంపర్యంగా ఇంట్లో పూజింపబడుతూన్న పంచలోహాల ప్రాశస్త్యం గురించి మైమరపించేలా వివరించి, ఒళ్లు గగుర్పొడిచేలా చేశారు. ముత్తాతల కాలం నుంచీ పదిలపర్చుకుంటూ వస్తూన్న మూడు వెండి గినె్నల్ని, ఒక బంగారు గినె్ననూ చూపించి కనకరాజు దంపతుల్ని ఆశ్చర్యాంబుధిలో ముంచి తేల్చారు. ముఖ్యంగా కనకరాజు వాటిని చూసి సన్నటి నిట్టూర్పు విడిచాడు. అటువంటివి తన వద్దా ఉండేవి. కాని భార్యామణి వాటినన్నిటినీ కుమార రత్నానికిచ్చేసింది.
అయితే - వాటన్నింట్లోకల్లా వాళ్లనెక్కువగా అబ్బురపరచి ఆకట్టుకున్నది ఆ ఇంటి పెరడు తోట.
పచ్చగా విశాలంగా వ్యాపించి, గగనతలం వేపు తొంగిచూస్తూ ఏదో ఒక రోజు ఇంద్రుడి నందనవనంలోకి సహితం ప్రాకి పోతుందేమో ననిపించేటట్లుంది. పెరడంతా ఎంత పచ్చగా ఎంత చక్కగా ఉందంటే - అనకాపల్లి ఊరంతటికీ కావలసిన చల్లదనాన్ని ఆ ఇంటి పెరడు తోటే పంచుతున్నట్లనిపించింది. కొన్నాళ్లుగా కొడుకూ కోడలి పదునైన కోర్కెల రాపిడితో నలిగిపోయిన కనకరాజు మాత్రమే కాదు. అతడి భార్య పుష్పవతికి సహితం ఆ కొత్త వన పవనాలు, ఉత్సాహపూరిత పరిసరాలు, నిత్య తోరణాల్లా తారసిల్లే సోమన్న దంపతుల నగుమోములు ఎనలేని ఓదార్పు నిచ్చాయి. ఎంతగా అంటే- అక్కడే వాళ్లతోనే కలకాలమూ ఉండిపోవాలన్నంతగా!
* * *
అనకాపల్లి చేరిన నాల్గవ రోజు, వాళ్లన్న సోములు అతణ్ణి చావడి వీధిలో ఒకానొకప్పుడు టౌను హాలుగా పరిగణించబడే సభాస్థలికి తీసుకువెళ్లాడు. అక్కడ రివాజుగా మూడు నెలలకొకసారి ఆ ఊరి విశ్రాంత ప్రభుత్వోద్యోగుల కలయిక జరుగుతుంటుంది. అదీ ఇదీ అన్న మినహాయింపు లేకుండా అగ్రజ పౌరులందరూ అక్కడ గుమిగూడి చర్చించుకుంటారు. మోతాదుని మరీ మించనివ్వకుండా మనసులు విప్పి మాట్లాడుకుంటారు. ఆ ఒక్క సమయంలో మాత్రం వాళ్లందరూ తాము విశ్రాంత ఉద్యోగులమన్న అనపాయ వాస్తవాన్ని విస్మరిస్తారు. అన్నదమ్ములిద్దరూ కుడి ద్వారబంధం నుండి హాలులోకి ప్రవేశించి, మూడవ వరుసలో చోటు చూసుకుని కూర్చున్నారు. కూర్చున్న వెంటనే అప్పుడక్కడ పెన్షనర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూన్న పొడవాటి వ్యక్తిని చూసి హతాశుడై పోయినట్లు చూస్తూండిపోయాడు కనకరాజు. తమ్ముడి అబ్బురపాటుని గమనించి సోములడిగాడు. ‘అదేవిట్రా కనకయ్యా - అంతలా ఆశ్చర్యపోతూ చూస్తున్నావు! మీ జంట నగరాల్లో ఇటువంటి పెన్షనర్ల సమావేశాలు జరగవా ఏమిటి? సమస్యలు చర్చించుకోరా?’
‘విషయం అది కాదురా అన్నయ్యా! ఆ మాట్లాడుతున్నది మరెవ్వరో కాదు. నేను సీనియర్ గ్రేడు అసిస్టెంటుగా ఉన్నప్పుడు ఈయనేమో మా పేబిల్ బ్రాంచీకి సెక్షన్ ఆఫీసరు. ఆ తరవాత బదిలీలపై పలు ప్రాంతాలకు వెళ్లిపోయి మళ్లీ కనిపించలేదు. ఈపాటికి చాలా సంవత్సరాలే గడిచిపోయాయి. వయసు కూడా మీద పడ్డట్టుంది. ఇప్పుడు గాని వెళ్లి పలకరిస్తే గుర్తుపట్టగలరో లేదో!’
‘దానిదేముంది - పలకరించి చూస్తే తెలిసిపోతుందిగా!’ కనకరాజు తలూపుతూ స్వగతంలా అన్నాడు. ‘ఎట్టకేలకు రాష్ట్ర పర్యటన పూర్తి చేసుకొని ఈయనిక్కడికి వచ్చి స్థిరపడ్డారన్న మాట. ఆ తరవాత సీట్లో సరిగ్గా సర్దుకొని కూర్చొని రామానుజాచార్యుల ప్రసంగాన్ని వినసాగాడు కనకరాజు. ‘అందుకే నేనంటున్నది - బిడ్డల్ని కన్నాము కదానని, పెంచి పెద్ద చేసిందీ మనమే కదానని గొప్పగా ఫీలయిపోతూ వాళ్లపైన అలవికాని ఆశల్ని పెట్టుకొని అంగలార్చకూడదని. ఇంకా చెప్పాలంటే - లేనిపోని ఆశలతో వాళ్ల వెంటబడటం, వాళ్ల నీడన ఉండాలనుకోవడం మనకు మర్యాద కూడా కాదంటాను. పెంచి పెద్ద చేశామా - మన బాధ్యతల్ని మనం నెరవేర్చామా. అంతే సంగతులు! బాత్ ఖతమ్’
‘అంటే కుర్రకాయలు మనింట్లో పుడ్తారు. మన కష్టార్జితాన్ని కరిగించి పెద్దవాళ్లవుతారు. పెద్ద చదువులు చదువుతారు. కాని వయసు మీదకొచ్చిన తరవాత, కంటిచూపు మందగించిన తరవాత వాళ్లను వెతుక్కుంటూ వెళ్తే తల్లిదండ్రుల్ని సహితం భరించలేరు. వద్దనలేక పొగబెట్టినట్లు పెళ్లాంతో జతకట్టి పలాయనం చిత్తగించేట్లు చేస్తారు. ఇదేనా అనుబంధం. ఇదేనా దాని నిర్వచనం?’ సభా మండపం మధ్య నుండి లేచి ఒక పెద్దాయన ఆ ఒక్క ప్రశ్నా వేసి, కాస్తంత ఆయాసపడ్తూ మళ్లీ కూర్చున్నాడు.
దానికి ప్రసంగకర్త రామానుజాచార్యులు నవ్వి, సభా మందిరాన్ని నిదానంగా కలియజూసి, అలవోకగా బదులిచ్చాడు. ‘రాఘవయ్యగారూ! మళ్లీ అదే మాట నా నోట వచ్చేలా నా పైన వత్తిడి తెస్తున్నారు. నేను చెప్పేది పూర్తిగా వినండి. విన్న తరవాత కూడా మీకు కష్టం కలిగితే నేను క్షమాపణ కోరుకుంటాను. మొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే - మన ఉనికి వాళ్లకు ఆటంకంగా ఉందని తోచినప్పుడు - మన అలికిడి వాళ్లకు శివపూజలో చొరబడ్డ ఎలుగుబంటి వ్యవహారంలా ఇబ్బంది కలిగిస్తుందనుకుంటున్నప్పుడు, ఇంకా కొడుకూ కోడళ్ల వెంట వెళ్లడానికి ప్రయత్నించడం ఎందుకంట? అసలు యుక్తవయసులో ఉన్న వాళ్ల స్వేచ్ఛా వాయువుల్ని హరించే అధికారం మనకెవరిచ్చారంట?’
ఈసారి మరొక పెద్దాయన లేచి నిల్చున్నాడు. ‘్భలే పసందుగా సెలవిచ్చారండి రామానుజాచార్యులు గారూ! ఇంట్లో ఒక మూలన అదీను శారీరకంగా నిస్సహాయ స్థితికి చేరుకున్న పిదప ముసలి తల్లిదండ్రులు వొదిగి పడుకుంటే యువతీ యువకులకు భంగపాటు కలుగుతుందా! సుఖం తొణికిన స్వప్నంలా తరిగిపోతుందా! నాకెందుకో - మీ మాటలు వింటుంటే గుండెనెవరో పిండుతున్నట్లనిపిస్తోంది రామానుజా చార్యులుగారూ!’ ఆ మాటతో సభా మండపం నలుమూలలా గుసగుసలు. వింతవింత చప్పుళ్లు. అవన్నీ అక్కడి వాళ్ల హృదయ స్పందనలకు సంకేతాలని గ్రహించాడు కనకరాజు. ఆచార్యులు మాత్రం తొణకలేదు. బెణకలేదు. అదే ప్రసన్న వదనంతో సభను నియంత్రించడానికి ముందుకొచ్చాడు. ‘శాంతి శాంతి! ముందు కూర్చోండి. ఒకరి తర్వాత ఒకరుగా చెప్పండి. అందరూ వినాలంటే. అందరూ అర్థం చేసుకోవాలంటే. ఆవేశానికి లోను కాకుండా మాట్లాడుకోవాలి. ఆ మాటకొస్తే ఆవేశపడే వయసూ కాదు మనది. షుగర్‌తోపాటు బి.పి. కూడా పెరిగి ఎండుటాకుల్లా అల్లల్లాడిపోతాం. నేననేది సావధానంగా గమనించాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. మన ఉనికి, మన చూపు సహితం యుక్త వయసులో ఉన్న వాళ్ల స్వేచ్ఛాయుత జీవితానికి అడ్డంకిగా నిలుస్తుందన్నది వాళ్ల ప్రగాఢ విశ్వాసం. ఈ కాలపు యువతీ యువకుల స్వేచ్ఛాయుత జీవితానికి మన అలికిడి అడ్డుపుల్లగా మారితే - వాళ్ల యవ్వన జీవన సౌందర్యం హరించిపోయినట్లే కదా! అందుకనే కదా నేనంటున్నది మనం మన పరిధిలో ఉంటూ, అకారణంగా అతిగా వాళ్లపైన ఆధారపడకుండా మన హుందాతనాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటేనే సర్వులకూ శ్రేయస్కరం’
ఆ మాటలు విని కనకరాజు ఉన్న పళాన కనుబొమరెగరేసి చూశాడు.
ఈ మాజీ సెక్షన్ ఆఫీసరు ఏదో పెద్ద మనిషి కదానని - పెద్దరికం ఉన్న పెద్ద మనిషిలా అనుగ్రహ భాషణం చేస్తాడు కదానని ఓపిగ్గా కూర్చుంటే - ఇలాగా తక్కిడిబిక్కిడిగా మాట్లాడతాడు! కన్నవాళ్ల ఉనికి వల్ల కొడుకుల జీవితానందం హరించుకు పోతుందంటే, మరి వీళ్ల తల్లిదండ్రులు కూడా ఒకనాడు యవ్వన దశలో ఉన్నవాళ్లేగా. ఇప్పటి యువకుల్లాగే ఆనాడు వాళ్ల అమ్మానాన్నలు కూడా ఆనందాల హరివిల్లు కోసం వెంపర్లాడి ఉంటే, కాస్తో కూస్తో వెనకేసుకోవాలన్న మాట మరచి, ఎడాపెడా ఖర్చు చేసుంటే, వీళ్లిప్పుడు పెద్ద చదువులు చదివి ప్రయోజకులయేవారా! కొత్త పెళ్లాల పక్కన వెచ్చగా పడుకోగలిగేవారా! అక్కడికొచ్చిన వృద్ధ విశ్రాంత జీవులకు ఊరటగా ఆసరాగా రెండు మాటలు మాట్లాడతానుకుంటే - ఇలాగా విడ్డూరంగా గబ్బిలంలా తలకిందులుగా మాట్లాడతాడు. వయసు పైనబడితే మనుషులిలానే తయారవుతారేమో!
ఆ తీరున చూస్తే ఆయనకేం - జీవితం వడ్డించిన విస్తరి! ఏ లోటూ లేకుండా భార్యామణి తోడుతో నల్లేరుపైన నడకలా కాలం గడిపేస్తున్నాడు. మరి ఎన్నో ఇళ్లల్లో కొడుకుల్ని నమ్ముకుని, సంపాదనంతా వాళ్ల బంగరు భవిష్యత్తు కోసం గుమ్మరించి చేతులు కాలిన తర్వాత బుద్ధులు తెచ్చుకొని, నడిరోడ్డున నెత్తిపైన చేతిగుడ్డ కప్పుకొని అసహాయంగా కూర్చున్న అగ్రజ పౌరులెంత మంది లేరని. వాళ్లందరి గురించీ ఈయనకు తెలుసా! ఇంకా నయం! కొడుకులు పెద్దయింతర్వాత వాళ్లకిక తల్లిదండ్రులతో సంబంధమే ఉండబోదని ఒక చట్టపూర్వకమైన కొత్త నిర్వచనం లేవదీయలేదు.
కనకరాజుకి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. సీసపు ద్రావకంలా ఒళ్లంతా నిర్వీర్యత ప్రవహిస్తున్నట్లనిపించింది. ఆరిపోతూన్న గాయాన్ని ఎవరో కలుక్కున కెలికినట్లనిపించింది. సోమన్నకు చెప్పి ఇంటికి బయల్దేరడానికి లేచాడు. అప్పుడు ఇంకెవరో ప్రశ్న లేవదీయడం విని ఆగాడు. ‘వ్యక్తిగతం అనుకోకపోతే ఒకటి చెప్తారా?’ రామానుజాచార్యులు అడగమన్నట్లు తలూపాడు. ‘ఇంతకూ మీకు బిడ్డలున్నారాండీ! ఉంటే ఎంతమంది కొడుకులో ఎంతమంది కూతుళ్లో చెప్తారాండీ’
‘ఒక కూతురుంది. ఆయిల్ ఫీల్డులో పని చేస్తూన్న అల్లుడితో అస్సాంలో ఉంటోంది’
‘అదన్నమాట సంగతి! కొడుకులు లేరు కాబట్టి వాళ్ల ఆగడాల గురించి మీకు అంతగా తెలియదన్న మాట. రెక్కలు విచ్చుకోనంత వరకూ కుక్కిన పేనులా పడి ఉంటారు. ఉద్యోగాలు వచ్చి పెళ్లాలు పక్కలకు చేరింతర్వాత చూడాలి కదా. నా సామిరంగా! ధక్షా ధ్వర ధ్వంసిలా పేట్రేగిపోతారు. పెద్దల్నీ తోబుట్టువుల్నీ నలుసులా ట్రీట్ చేస్తారు. పనస తొనల కన్న పంచదారల కన్న చెలి మాట తీపురా - అని వేమన కవీంద్రుడు ఊరకనే అన్నాడూ!’
స్వతహాగా ఉద్వేగభరితుడైన కనకరాజు ఇక ఊరకుండలేక పోయాడు. ఉప్పొంగిన ఉక్రోశాన్ని ఆపుకోలేక పోయాడు. ఛటుక్కున కదలి సమావేశ ప్రాంగణం మధ్యకు రివ్వున నడచి వెళ్లాడు. రామానుజాచార్యుల్ని సరాసరి సూటిగా చూస్తూ వేగిరపాటుతో మాట్లాడసాగాడు. తమ్ముడి ప్రవర్తన సోములుకి మిక్కిలి అసహనం కలిగించింది. రామానుజాచార్యులు పెద్ద మనిషి. కాస్తంత పెద్ద హోదాలో రిటైరైన వ్యక్తి. అతను రామానుజాచార్యులతో మాట్లాడే ధోరణి అంతకంటే నచ్చలేదు. అందునా కనకరాజు తమ పెన్షనర్ల అసోసియేషన్‌లో సభ్యుడు కాడన్న ప్రాథమిక వాస్తవాన్ని సహితం విస్మరించాడు. ఒక విధంగా తమ్ముడి ప్రవర్తన సభా మర్యాదకు భంగపాటే! ఇలా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు, కనకరాజు రామానుజాచార్యులతో సంభాషణ ముగించి ముఖం అదోలా గంభీరంగా పెట్టి వచ్చి కూర్చున్నాడు. సోములు సాధ్యమైనంత నిదానాన్ని కొని తెచ్చుకుంటూనే అడిగాడు. ‘అదేవిటి? నువ్వెందుకలా ఎమోషనల్ అయిపోతున్నావు కనకా! ఆయనకు కొడుకులు లేకపోవడమూ, కూతురు పట్ల మక్కువ ఎక్కువగా చూపించడమూ... అవన్నీ ఆయన స్వంత విషయాలు. స్వంత అనుభవాలు. తన అభిప్రాయాలతో మనల్ని అంగీకరించమని ఆయనేమీ బలవంతపెట్టలేదుగా!’
‘ఆయనతో వాదోపవాదాలకు దిగింది ఆయన అభిప్రాయాల్ని ప్రశ్నించడానికి కాదు. ఇక్కడి వాళ్లెవరికీ తెలియదనుకొని బండరాయి లాంటి పెద్ద అబద్ధాన్ని ఫిరంగిలా పేల్చారు’ సోములు బదులివ్వకుండా వౌనంగా వినసాగాడు. ‘అదేవిట్రా అన్నయ్యా - అలా వౌనం వహించావు. అదేవిటని అడగవేం!’
‘వింటూనే ఉన్నాగా; చెప్పు మరి’
‘రామానుజాచార్యులుకి ఒక కూతురు మాత్రమే కాదు. కొడుకులు కూడా ఉన్నారు. ఒకరు కాదు. ఇద్దరు కాదు. మొత్తం ముగ్గురూ. తండ్రీ కొడుకుల మధ్య ఏం జరిగిందో తెలియటం లేదు. ముగ్గురు కొడుకులూ చేస్తున్నవి తట్టాబుట్టా పట్టుకు తిరిగే ఉద్యోగాలూ కాదు. ఒకతను ఐటిలో. మరొకతను స్టేట్ సర్వీస్. మూడవతనేమో సెంట్రల్ సర్వీసు. గర్వపడకపోయినా పోయె కనీసం తనకు వంశోద్ధారకులున్నారని చెప్పుకోవద్దూ’
‘నువ్విక్కడాగు కనకా! వాళ్లమధ్య ఏం జరిగిందో నీకు తెలియదన్నావు కాబట్టి మిగతాది నేను చెప్తాను. మళ్లీ ఎమోషనల్ అవకుండా వింటావా?’ కనకరాజు ఊ కొట్టాడు. ‘రామానుజాచార్యులు భార్యకి కేన్సర్ సోకింది. పరిస్థితి సీరియస్‌గా మారింది. మెడికల్ ఖర్చులు విపరీతంగా పెరిగి పోవడం వల్ల, భార్యను ముంబాయి, ఢిల్లీ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లవలసి రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాడు. అప్పుడు వెనుకాడుతూనే ముగ్గురు కొడుకుల్నీ డబ్బు సర్దమని అడిగాడు. ముగ్గురు కొడుకులూ కూడబలుక్కుని ఒకచోట కలుసుకుని తల్లి వైద్య ఖర్చుల వాటాను సమానంగా పంచుకునే కసరత్తులో మునిగారు. వాళ్ల ముగ్గురి మంతనాలూ పూర్తయి ఒక కొలిక్కి వచ్చేలోపల తల్లి ప్రాణాలు విడిచింది. అప్పట్నుంచీ రామానుజాచార్యులు కొడుకులందరికీ నీళ్లు వదిలేశాడు. అంతేకాదు. ఆయనెక్కడికి వెళ్లినా తనకు కొడుకులెవ్వరూ లేరనే చెప్తుంటాడు. మేమూ అలాగా అని బుర్రాడిస్తూనే ఉంటాం. ఆయన గతం గురించి మేమేమీ ఎరగనట్టు, ఆయన ఒంటరితనం పట్ల సానుభూతి చూపిస్తూనే ఉంటాం. అలా చెప్తూ తిరగడం ఆయనకు అదొక విధమైన మానసిక తృప్తి’.
*
=================
పాండ్రంకి సుబ్రమణి
ఫ్లాట్ నెం.33. రోహిణి అపార్ట్‌మెంట్ (బిల్డింగ్-898)
7-1-32ఎ, లీలానగర్, అమీర్‌పేట, హైదరాబాద్- 500 016.
99088 14 674