హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ విడిపోతున్న ఈ సమయంలో ఒకవైపు తెలంగాణలో, మరోవైపు సీమాంధ్రలో భాషా సాంస్కృతిక అంశాలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌లోని భాషా సాంస్కృతిక వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ వేదిక గౌరవాధ్యక్షుడు చుక్కా రామయ్య, అధ్యక్షుడు జయధీర్ తిరుమల రావు ఈ మేరకు ఆదివారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఎన్నికల సమయం కావడం వల్ల భాషా సాంస్కృతిక విధానంపై అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల ద్వారా తమ విధానాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. భాషా సాంస్కృతిక రంగాలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించని పార్టీలను తిరస్కరించాలంటూ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భాషా, సాంస్కృతిక రంగాల పురోభివృద్ధికోసం ఒక కమిటీ వేసి, ఈ కమిటీ ఇచ్చే సిఫార్సులను అమలు చేయాలని కోరారు. చిన్ని రాష్ట్రాల్లోనే భాషా సంస్కృతిక వికాసానికి అవకాశం ఉంటుందని దేశానికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల భాషా సాంస్కృతిక నినాదంతో ఏర్పడ్డ టిఆర్‌ఎస్ స్పష్టమైన ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంగా ఉన్న సమయంలోనూ భాషా సాంస్కృతిక విధ్వంసం జరుగుతూ ఉన్నప్పటికీ చలనం లేకుండా ఉండిపోయిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రజల భాషలోనే పాలన జరగాలని తిరుమలరావు పేర్కొన్నారు. భాషా సాంస్కృతిక మంత్రిత్వ రంగానికి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ అంశంలో అవగాహన ఉన్నవారినే మంత్రిగా నియమించాలన్నారు. విద్యాబోధన తెలంగాణ భాషలోనే జరగాలన్నారు. రెండు రాష్ట్రాల అవసరాలను తీర్చే విధంగా సమగ్ర తెలుగు నిఘంటువుని తెలంగాణ రాష్ట్రంలో రూపొందించాలన్నారు. కేంద్రం ప్రకటించిన ‘విశిష్ట తెలుగు భాషా అధ్యయన కేంద్రా’నికి వెంటనే భవనాన్ని కేటాయించాలని, దీనికోసం వందకోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు.
రెండు ప్రాంతాల్లో పరిరక్షణ చర్యలు కమిటీ ద్వారా అధ్యయనం ఎన్నికల ప్రణాళికల్లో చేర్చాలి పరిరక్షణ వేదిక డిమాండ్
english title:
b
Date:
Monday, March 31, 2014