
హైదరాబాద్, మార్చి 30: జయనామ సంవత్సర ఉగాదిలో అంతా జయమే జరుగుతుందని ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జరిగిన పంచాంగ శ్రవణంలో డాక్టర్ సాగి కమలాకర్ శర్మ తెలిపారు. రాజ్‌భవన్‌లో ఆదివారమే ఉగాది వేడుకలు నిర్వహించారు. గవర్నర్ దంపతులు ఇఎస్‌ఎల్ నరసంహన్, శ్రీమతి విమలా నరసింహన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి దంపతులు, డిజిపి బి ప్రసాదరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టప్రతి పాలన కావడంతో ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాలేదు. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, రిటైర్డ్ అధికారులు కుటుంబ సభ్యులతో పాటు హాజరయ్యారు. సాగి కమలాకర్ శర్మ పంచాగ పఠనం చేశారు. జయనామ సంవత్సరానికి నాయకులు రాజు, మంత్రి చంద్రుడని అనుకూల వాతావరణం ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లోనూ నాయకత్వం వహించే వారు కొత్త ఆలోచనలు చేస్తారని, శాంతిభద్రతలపై ఎక్కువ శ్రద్ధ చూపించాలని అన్నారు. ఇది ఆనందాన్ని కలిగించే సంవత్సరం అని అన్నారు. ఈ సంవత్సరం అందరూ విజయ మార్గంలో పయనిస్తారని తెలిపారు. చిరుధాన్యాలు బాగా పండుతాయని, వర్షాలు సమృద్ధిగా పడుతాయని అన్నారు. ధరలు పెరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
దీపికారెడ్డి శిష్య బృందంతో హరిహర వైభవం నృత్యరూపకం ప్రదర్శించారు. కళాకారులను గవర్నర్ సత్కరించారు. ఆహుతులందరి వద్దకు గవర్నర్ దంపతులు వెళ్లి పలకరించారు.
చిత్రం...
ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన జయనామ సంవత్సర ఉగాది వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న గవర్నర్ నరసింహన్ దంపతులు