హైదరాబాద్, మార్చి 30: శ్రీ రామభక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ 78వ వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 12 వరకు అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామకల్యాణ మహోత్సవాన్ని వచ్చే నెల 8న వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాంపల్లిలోని గూడ్స్‌షెడ్డు వద్దనున్న శ్రీ రామహనుమాన్ మందిరంలో నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన ఈ నెల 31వ తేదీ ఉదయం అయిదున్నర గంటలకు గణపతిహోమం నిర్వహించి ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యాహవచనము, మంటపారాధన, అఖండదీపం, కలశస్థాపన తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఉత్సవాలు జరిగినన్ని రోజులు ప్రతిరోజు దేవాలయం ఉదయం 5 నుంచి ఏడు గంటల వరకు ప్రభాతసేవ, ఏడున్నర గంటలకు గోపూజ, సామూహిక లలితా సహస్రనామ పారాయణం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, వాల్మీకి రామాయణ పారాయణం, చండీ పారాయణ, యజుర్వేద పారాయణ కార్యక్రమాలు జరుగనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఆంజనేయస్వామి ఆకుపూజ, పది నుంచి పదకొండున్నర గంటలకు శ్రీరామసహస్రనామార్చన, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అలాగే నిత్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం అయిదున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు పప్పు నాగేశ్వరరావుచే శ్రీ మద్వాల్మీకి రామాయణ పురాణ ప్రవచనం, ఆరు గంటల నుంచి హనుమత్ సేవ, ఆ తర్వాత సహస్రనామార్చన, నివేదిక, హారతి, మంత్రపుష్పం, తీర్థ్రప్రసాద వినియోగం, ఎనిమిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు భగవత్సంబంధిత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 8వ తేదీన ఉదయం పది గంటలకు దేవాలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము జరుగుతాయన్నారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు పల్లకీ ఊరేగింపు, చెండ్లాడింపు, మేజువాణి కార్యక్రమాలను నిర్వహించి, మరుసటి రోజైన 9న శ్రీరామ పట్ట్భాషేక మహోత్సవం కార్యక్రమాలతో పాటు అదేరోజు రాత్రి ఏడు గంటలకు పురవీధుల్లో శ్రీ సీతారాముల స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
శ్రీ రామభక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ 78వ వసంత నవరాత్రి ఉత్సవాలు
english title:
vasantha navarathri
Date:
Monday, March 31, 2014