
హైదరాబాద్, మార్చి 30: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే సవాళ్లను, సమస్యలను అధిగమించగలుగుతామని బిజెపి జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లే ప్రస్తుతం దేశం పురోగతి సాధించలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఆదివారం ‘విజన్ ఫర్ బెటర్ ఇండియా’ అంశంపై బిజెపి నేత వెంకయ్య నాయుడుతో రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక, ఫార్మా, వైద్య, వ్యవసాయ, ఐటీ, సినీ రంగ ప్రముఖులు చర్చాగోష్టి జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ, బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీ నాయకత్వంలోనే దేశం పురోగతిలో పయనిస్తుందన్న నమ్మకం అన్ని వర్గాలలో ఏర్పడిందన్నారు. దేశ సంపద అన్ని వర్గాలకు చెందాలని కమ్యూనిస్టులు అంటున్నారని, సంపదను సృష్టించకుండా పంచడం ఎలా సాధ్యపడుతుందని ఆయన ప్రశ్నించారు. దేశం కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ ఉన్నంత మాత్రాన తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవిర్భావం అనేక సమస్యలతో, సవాళ్ళతో కూడుకున్నదని అన్నారు. భవిష్యత్ భారతం ఎలా ఉండాలన్న దానిపై ఆలోచనపరులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు వెల్లిబుచ్చే సూచనలను బిజెపి విజన్ డాక్యుమెంట్‌లో పొందుపర్చడానికి కృషి చేస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. వివిధ రంగాలకు చెందిన నిపుణుల ఇచ్చే సలహాలు, సూచనలను పాటించి వాటికి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చారు.
వ్యవసాయరంగ ప్రముఖుడు నరేంద్రనాథ్ మాట్లాడుతూ, వ్యవసాయరంగంపై అధ్యయనం చేసిన స్వామినాథన్ కమిటి చేసిన సిఫారసులను అమలు చేయడం అటుంచి కనీసం వాటిపై చర్చ కూడా జరగలేదని అన్నారు. దేశంలో 64 శాతం రైతాంగం తమకు ఇతర రంగాలలో అవకాశాలు లేకపోవడం వల్లే ఈ రంగాన్ని వదిలిపెట్టలేకపోతున్నారని అన్నారు. బిట్స్ పిలాని డైరెక్టర్ విఎస్ రావు మాట్లాడుతూ, దేశాభివృద్ధి విద్యారంగం అభివృద్ధితోనే ముడిపడి ఉన్నప్పటికీ, ఈ రంగానికి జిడిపిలో మూడు శాతం నిధులను మాత్రమే కేటాయించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటి అధ్యయనం చేసి ఆ రోజులలోనే విద్యారంగానికి జిడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలని సూచించారని ఆయన గుర్తుచేసారు. ఫార్మా రంగానికి చెందిన డాక్టర్ రమేష్‌బాబు మాట్లాడుతూ, ఫార్మా రంగంలో ఎగుమతులతోనే సంతృప్తి చెందకుండా, పరిశోధనలు, అభివృద్ధి పట్ల దృష్టి కేంద్రాకరించాలని సూచించారు. హార్డ్‌వేర్ రంగ ప్రముఖుడు జెఎ చౌదరి మాట్లాడుతూ, రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందినంతగా, హార్డ్‌వేర్ రంగం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఇప్పటికీ హార్డ్‌వేర్ రంగం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చౌదరి అన్నారు. పారిశ్రామికవేత్త డివి మనోహర్ మాట్లాడుతూ, కెజి బేసిన్‌లో అపారమైన చమురు నిల్వలు ఉన్నా, తగినంతగా ఫలితాలను సాధించలేకపోయామని, రాష్ట్రానికి రావాల్సిన వాటాను, రాయల్టీలను సాధించుకోలేకపోయామని అన్నారు. ఇన్‌ఫోటెక్ చైర్మన్ బివిఆర్ మోహన్‌రెడ్డి, సినీ రంగ ప్రముఖులు సి కల్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణ, మహిళా పారిశ్రామికవేత కరుణ గోపాల్, ఇటీవల బిజెపిలో చేరిన సుధీష్ రాంబొట్ల పాల్గొన్నారు.
చిత్రం..‘విజన్ ఫర్ బెటర్ ఇండియా’ అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన చర్చాగోష్టిలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ నేత వెంకయ్య నాయుడు