హైదరాబాద్, మార్చి 31: నగరంలో ఎక్కువ ప్రాబల్యం కల్గిన మజ్లిస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాను సోమవారం ప్రకటించింది. వీరిలో కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశమివ్వగా, మరికొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లుగా కొనసాగుతున్న వారికి ముచ్చటగా మూడోసారి కూడా అవకాశమిచ్చి, హ్యాట్రిక్ సాధించుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. చాంద్రాయణగుట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ మరోసారి అక్కడినుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన మజ్లిస్ అధిష్టానం యాకుత్‌పురా, చార్మినార్, బహద్దూర్‌పురా, మలక్‌పేట నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్‌ఖాన్, పాషాఖాధ్రి, మోజంఖాన్, అహ్మద్ బలాలాల పేర్లు ఖరారు చేసింది. వీరిలో పాషాఖాధ్రి, ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌లకు మరో సారి టికెట్ కేటాయించి హ్యాట్రిక్ దిశగా ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ప్రస్తుతం విరాసత్ రసూల్‌ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాంపల్లి నియోజకవర్గం నుంచి మేయర్ మాజీద్ హుస్సేన్ పోటీ చేస్తారన్న పుకార్లు షికారు చేసినా, ఎంతో కసరత్తు చేసినానంతరం అధిష్టానం మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్‌హుస్సేన్ పేరును ఖరారు చేసింది. దీంతో పాటు అఫ్సర్‌ఖాన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కార్వాన్ నియోజకవర్గానికి సంబంధించి ఈ సారి అఫ్సర్‌ఖాన్ అనారోగ్యం కారణంగా ఓ కార్పొరేటర్ భర్త కౌసర్ మోహియుద్ధీన్‌ని రంగంలో దింపుతున్నట్లు మజ్లిస్ పార్టీ ప్రకటించింది. వీటితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉన్న మజ్లిస్ నాయకత్వం సమర్థుడైన అభ్యర్థి కోసం అనే్వషిస్తున్నట్లు, ఒక వేళ అభ్యర్థిని గుర్తిస్తే రెండో జాబితాలో పేరును ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే శివార్లలోని రాజేంద్రనగర్ నుంచి కూడా గత 2009 ఎన్నికల్లో పోటీ చేసే రెండో స్థానంతో సరిపెట్టుకున్న మజ్లిస్ ఈసారి కూడా అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నియోజకవర్గానికి కూడా అభ్యర్థి పేరు ఖరారైతే ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గెలుపుకు ఎంతో అనుకూలంగా ఉన్న గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని నిలబెట్టాలా? లేదా? అన్న విషయంపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. దీనికి తోడు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై కూడా కనే్నసిన మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీని రంగంలో దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదనలకే పరిమితమైన పొత్తుల ప్రతిపాదన మున్ముందు కొలిక్కి వచ్చిన తర్వాత మరికొందరు అభ్యర్థులను మజ్లిస్ ప్రకటించే అవకాశామున్నట్లు సమాచారం.
రాజేంద్రనగర్ రంగంలో సున్నం ..?
గత ఎన్నికల్లో మజ్లిస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రాజేంద్రనగర్ నుంచి మురళీధర్‌రెడ్డి అనే అభ్యర్థిని నిలిపేందుకు మజ్లిస్ అధిష్టానం ఎంతో ఆసక్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో 2002లో పురానాపూల్ కార్పొరేటర్‌గా గెలుపొందిన సున్నం రాజ్‌మోహన్ ఆ తర్వాత డివిజన్ మహిళలకు రిజర్వు కావటంతో ఆయన సతీమణి సున్నం శ్రీలతను రంగంలో దింపి విజయకేతనం ఎగురవేసి, పార్టీని పటిష్టపరిచారు. మజ్లిస్ వ్యవస్థాపకులు సుల్తాన్ సల్లావుద్ధీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడిగా, నమ్మినబంటుగా వ్యవహరించిన సున్నం రాజ్‌మోహన్‌కు ఈ సారి రాజేంద్రనగర్ నుంచి అవకాశం కల్పించాలన్న విషయంపై తర్జనభర్జన జరుగుతున్నట్లు సమాచారం.
కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో కొత్తవారికి ఛాన్స్ * కొందరికి ముచ్చటగా మూడోసారి అవకాశం
english title:
m
Date:
Tuesday, April 1, 2014