
హైదరాబాద్, మార్చి 31: మహానగర ప్రజలకు పౌరసేవలు, అభివృద్ధి పనులు చేపట్డంలో కీలకపాత్ర పోషించే అతి ముఖ్యమైన మహానగర పాలక సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాన్ని చేధించింది. తొలుత రూ. 1250 కోట్ల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు ఎన్నికల సందడి రావటంతో కనీసం వసూళ్లను వెయ్యి కోట్లు దాటించాలన్న కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రయత్నాలు ఫలించాయి.
ఆర్థిక సంవత్సరం చివరిరోజైన సోమవారం ఉగాది పండుగ ఉన్నా, యదావిధిగా వసూళ్లు కొనసాగి, సాయంత్రం ఆరు గంటల కల్లా రూ. వెయ్యి 20 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు.
ఒకరోజు ముందు అంటే ఈ నెల 30వ తేదీ సాయంత్రం వరకు రూ. 879 కోట్ల మేరకు పన్ను వసూలు కాగా, ఆ తర్వాత గడిచిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోపే వసూళ్లు వెయ్యి కోట్లు దాటడటం పట్ల అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అవతరించిన నాటి నుంచి, గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత నేటి వరకు కూడా ఇదే రికార్డు స్థాయి వసూళ్లని అధికారులు వ్యాఖ్యానించారు.
ఈ వసూళ్లతో మున్ముందు గ్రేటర్‌లో పేరుకు తగినవిధంగా అభివృద్ధి పనులు చేపట్టే ఆస్కారమేర్పడిందని అంటున్నారు.
గత ఆర్థిక సంవత్సరం 2012-13లో మొత్తం రూ. 747 కోట్ల పన్ను వసూలు కాగా, ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజైన మార్చి నాటికి కేవలం రూ. 629 కోట్లు మాత్రమే వసూలైంది. 2013-14 ఆర్థికసంవత్సరానికి సంబంధించి సోమవారం చివరి రోజు సాయంత్రం వరకు రూ. వెయ్యి ఇరవై కోట్ల వరకు వసూలైంది. అంటే గత ఏడాది కలెక్షన్‌తో పోల్చితే ఈ సారి కార్పొరేషన్ గతంలో ఎన్నడూ లేని విధంగా అదనంగా రూ. 273 కోట్లు వసూలు చేసింది.
సోమవారం ఒక్కరోజే సుమారు రూ. 13 నుంచి రూ. 140 కోట్ల మధ్య పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఇందుకు క్షేత్ర స్థాయిలో పన్ను వసూలు చేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లతో పాటుజోనల్ కమిషనర్ల కృషి కూడా ఉందని ఉన్నతాధికారులంటున్నారు. సోమవారం అర్థరాత్రి వరకు ప్రత్యేక కౌంటర్లను అందుబాటులో ఉంచినందున కలెక్షన్ మరింత పెరిగే అవకాశాల్లేకపోలేవు.
ముఖ్యంగా ఈ సంవత్సరం ఆస్తిపన్ను బకాయిదారులకు సంబంధించి మొత్తం 761 సమస్యలున్నట్లు గుర్తించి, వీటిని పరిష్కరించేందుకు నిర్వహించిన ఆస్తిపన్ను పరిష్కారం కార్యక్రమం సత్పలితాలిచ్చి, ఇందులో మొత్తం 200 ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించటం కూడా కలెక్షన్ పెరిగేందుకు ప్రధాన కారణమన్నారు. దీంతో పాటు కమిషనర్, అదనపు కమిషనర్(ప్లానింగ్) వెంకట్రామిరెడ్డి పర్యవేక్షణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రయోగించిన ది ఔట్ రిచ్ బృందాలు ఎప్పటికపుడు బకాయిదారులతో సంప్రదింపులు చేస్తూ, అవసరమైతే ఆస్తులను జప్తులు చేయటం వంటి చర్యల వల్లే ఈ సారి రికార్డు స్థాయి వసూళ్లు సాధించామని అధికారులు పేర్కొన్నారు.