మేడ్చల్, మార్చి 31: తమ ప్రేమని ఇరుకుటుంబాల పెద్దలు అర్థం చేసుకోలేదని మనస్థాపంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. వివరాలు- కుత్బుల్లాపూర్- సూరారం అరవైగజాల కాలనీలో వుండే లక్ష్మీనారాయణ కుమారుడు చంద్రశేఖర్ (23) సంవత్సరం నుంచి అదేకాలనీకి చెందిన ప్రసన్నకుమారి (19)ని ప్రేమించాడు. ప్రేమ విషయం తండ్రికి చెప్పగా, చెల్లెళ్ల వివాహం తర్వాత ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపిస్తానని హామీ ఇచ్చాడు. అయితే చంద్రశేఖర్, ప్రసన్నకుమారి శనివారం అదృశ్యమయ్యారు. ఇరు కుటుంబాలు గొడవపడి దుండిగల్ పిఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో గుండ్లపోచంపల్లి స్టేషన్ సమీపంలో పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి మృతదేహాలను చూపించగా తమ పిల్లలవేనని భోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన
నలుగురి సస్పెన్షన్‌కు సిఫార్సు
వికారాబాద్, మార్చి 31: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేసినట్లు వికారాబాద్ సబ్‌కలెక్టర్, ఎన్నికల అధికారి ఆమ్రపాలి కాట తెలిపారు. సస్పెన్షన్‌కు సిఫార్సు జాబితాలో శేరిలింగంపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 12వ పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన దానయ్య, మొయినాబాద్‌లో ఎంఆర్‌పిగా పనిచేస్తూ 14 నెంబరు పోలింగ్ స్టేషన్‌లో డ్యూటీ పడిన కె.ప్రభాకర్‌రెడ్డి, మరో ఎంఆర్‌పి డి.శివారెడ్డి, శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేటలో హిందీపండిట్‌గా పనిచేస్తూ 11వ పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎండి సహేర్ ఉన్నారని తెలిపారు.
వీరు సమయపాలన పాటించకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడం, ఎన్నికల కమీషన్‌కు పంపాల్సిన డాక్యుమెంట్స్ సకాలంలో సిద్ధం చేయకపోవడం లాంటి వాటిలో నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇక మున్ముందు ఎవరు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.