కెపిహెచ్‌బికాలనీ, మార్చి 31: పలు బస్తీలలో ఉచిత వైద్య శిబిరాలతో పాటు పేదలకి ఇతర సేవలందిస్తున్న ఆదరణ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కూకట్‌పల్లి నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు అన్నారు. కెపిహెచ్‌బికాలనీ 2వ రోడ్డులో గల ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆదరణ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా గొట్టిముక్కల పద్మారావు పాల్గొన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడానికి స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా.అరిగెల రఘునాధ్‌బాబు మాట్లాడుతూ ఆదరణ ఫౌండేషన్ వివిధ ప్రాంతాలలో కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం కార్యక్రమంలో పలువురు సీని కళాకారులచే ప్రముఖులకు జ్ఞాపికలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదరణ జనరల్ సెక్రటరీ మెరీజోన్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సురేష్‌బాబు, వెంకటేశ్వర్‌రావు, శ్యాంసన్, నపారి చంద్రశేఖర్, సునీల్‌రెడ్డి, బొట్టు విష్ణు, అభిలాష్ పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారం
వనస్థలిపురం, మార్చి 31: కులమతాలకు అతీతంగా మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తానని ఎల్‌బి.నగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి చెప్పారు. ముస్లిం సంక్షేమ సంఘం, క్రిస్టియన్స్ సంక్షేమ సంఘాల వేర్వేరు సమావేశాలలో ఆయన మాట్లాడుతూ, ఎల్‌బి.నగర్‌లో నివాసం వుండే క్రిస్టియన్ కులస్తులకు శ్మశానవాటిక, ముస్లింలకోసం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పదవిలో వున్నా లేకున్నా తన జీవితం ప్రజలకు అంకితమని, సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానన్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో వుండి పనిచేస్తానని అన్నారు. బిఫారం అంటే అర్థం తెలియని కొందరు తనకే టికెట్ వచ్చిందని కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని, అలాంటి వదంతులను నమ్మవద్దని పిలుపునిచ్చారు. సమావేశంలో ముస్లిం, క్రిస్టియన్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు టి.యాదగిరిరెడ్డి, తోట వెంకటేశ్వర్లు, ఎస్.రామ్మోహన్‌రెడ్డి, శ్రీ్ధర్‌గౌడ్, ఎం.సదాశివుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు.