న్యూఢిల్లీ, మార్చి 31: తెలంగాణలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కె.జానారెడ్డి జోస్యం చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలు, అభ్యర్థుల ఎంపిక, సిపిఐతో సీట్ల సర్దుబాటు తదితర ఆంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 శాతం సీట్లు గెలుచుకుంటుందని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తమకే ఆధిక్యత లభిస్తుందన్నారు. సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో పని చేసేందుకు సిద్ధపడేవారందరూ తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
జాబితా మరింత ఆలస్యం
తెలంగాణలో శాసనసభ, లోకసభ నియోజకవర్గాల నుండి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల జాబితా రెండు,మూడు రోజుల తరువాత వస్తుందని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి వెళ్లడించారు. టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉత్తం కుమార్ సోమవారం దిగ్విజయ్ సింగ్‌తో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ఉత్తం కుమర్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, సోమవారం రాత్రి కొందరి అభ్యర్థిత్వంపై ఒక స్పష్టత రావచ్చునన్నారు. అభ్యర్థులందరి ఎంపికకు రెండు,మూడు రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. కాగా, ఇటీవల తెరాసకు గుడ్‌బై చెప్పిన చెరకు సుధాకర్ త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని తెలిసింది. సోమవారం ఇక్కడికి వచ్చిన ఆయన ఒకటి, రెండు రోజుల్లో దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకుని కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం.
*జానారెడ్డి జోస్యం
english title:
jana reddy
Date:
Tuesday, April 1, 2014