
హైదరాబాద్, ఏప్రిల్ 1: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బావమరిది, ప్రముఖ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖరారు అయింది. అయితే ఎంపిగా పోటీ చేయాలా? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? అనేది ఆయన ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. బిజెపితో టిడిపికి ఎలాగు పొత్తు ఉంటుంది కావున ఎన్డీయే అధికారంలోకి వచ్చే పక్షంలో ఎంపిగా పోటీ చేయడం వల్ల కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని నందమూరి కుటుంబం బాలకృష్ణపై వత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో రాజకీయంగా ఎదగాలంటే ఎంపి కన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఉత్తమమని బాలకృష్ణ శ్రేయోభిలాషులు సూచిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు వాదనల మధ్య బాలకృష్ణ మాత్రం ఎంపిగానా? ఎమ్మెల్యేగానా దేనికి పోటీ చేయాలనేది ఇంకా తేల్చుకోలేక పోతున్నట్టు టిడిపి వర్గాల సమాచారం. ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లా నుంచి ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని ఇప్పటికే బాలకృష్ణకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అయితే కృష్ణా జిల్లా నుంచి కాకుండా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బాలకృష్ణ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఇలా ఉండగా, తాను దేనికి పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయించాల్సి ఉంటుందని మంగళవారం ‘లెజెండ్’ సినిమా యూనిట్‌తో కలిసి సింహాచలం దర్శనానికి వచ్చిన సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబు, అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలని బాలకృష్ణ ఒకరిపై ఒకరు తోసేసుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు పార్టీ ప్రచారం కోసం బాలకృష్ణ చేసిందేమి లేదు. బాలకృష్ణ అయినా మరొకరు అయినా పార్టీ కోసం ప్రచారం చేయాల్సిందేనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలలో కూడా గూడార్థం ఉందని విశే్లషిస్తున్నారు. కేవలం తనకు కావాల్సిన టిక్కెట్ తీసుకుంటే సరిపోదు, పార్టీ కోసం రాష్టమ్రంతా తిరిగి ప్రచారం చేయాలని బాలకృష్ణను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.