
హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో దెబ్బతిన్న పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ బలహీన పడిందన్న భావనను ప్రజల నుంచి తొలగించేందుకు వివిధ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే ఎస్‌సి, ఎస్‌టిల వైపు దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం అధికారంలోకి వస్తే బిసినే ముఖ్యమంత్రిగా చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి నూకలు చెల్లాయని తెలుసుకున్న చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాఉండగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి మంగళవారం పార్టీ ప్రచార కమిటీ సభ్యులతో, పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీని బలోపేతం చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఎస్‌సి, ఎస్‌టిలను ఆకర్షించేందుకు ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రజలకు వివరించాలని వారు ఈ సందర్భంగా భావించారు.
4న కర్నూలు నుంచి..
సమావేశానంతరం జెడి శీలం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4న కర్నూలు నుంచి సదస్సులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 4న కర్నూలులో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం అనంతపురంలో 4 నుంచి 6 గంటల వరకు సదస్సు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 7వ తేదీన ఉదయం కడపలో, సాయంత్రం చిత్తూరులో, 8న ఉదయం నెల్లూరులో, సాయంత్రం ప్రకాశం (ఒంగోలు)లో, 9న ఉదయం గుంటూరులో, సాయంత్రం విజయవాడలో, 12న ఉదయం పశ్చిమ గోదావరి (్భమవరం)లో, సాయంత్రం కాకినాడలో సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. 13వ తేదీన ఉదయం సాయంత్రం విశాఖపట్నంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో కలిపి సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కే ఎందుకు ఓటు వేయాలన్న అంశంపై ఎస్‌సి, ఎస్‌టిలకు తెలియజేసేందుకే ఈ సదస్సులని ఆయన చెప్పారు.
కార్యకర్తలతో మమేకమై
అంతకు ముందు ఎపిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలతో మమేకమై ముందుకు సాగుతున్నామని అన్నారు. అనాదిగా ఎస్‌స్, ఎస్‌టిలు కాంగ్రెస్‌కే అండగా ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ముందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. సీమాంధ్రలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు 1160 దరఖాస్తులు, 25 లోక్‌సభ సీట్లకు 176 దరఖాస్తులు అందాయని ఆయన చెప్పారు.
బలంగా ఉన్నాం: కొండ్రు
మాజీ మంత్రి కొండ్రు మురళి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. బలంగా ఉంది కాబట్టే సీమాంధ్రలో ప్రతి నియోజకవర్గానికి 5 నుంచి 15 వరకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
chitram...
మంగళవారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీమాంధ్ర పిసిసి నేత రఘువీరారెడ్డి