రాంచి, ఏప్రిల్ 1: బిజెపి నేతలు గొప్పగా చెప్పుకొంటున్న ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ లోక్‌సభ ఎన్నికల తర్వాత అదృశ్యం అవుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ‘్భరత్ వెలిగిపోతోందం’టూ 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన నినాదం గాలి బుడగలా పేలిపోయిందని ఆయన అపహాస్యం చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, బిజెపి ఇస్తున్న అందమైన నినాదాలు ఈసారి కూడా పనిచేయవన్నారు. యుపిఎ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకంపై విశ్వాసం పెరగడంతో ప్రజలు కాంగ్రెస్‌కు వరసగా రెండు సార్లు అధికారం ఇచ్చారన్నారు. ‘గుజరాత్ అభివృద్ధి’ అంటూ గాలి నింపుతున్న బుడగలు పేలిపోకతప్పదన్నారు. యుపిఏ సర్కారు మూడోసారి అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును తప్పక ఆమోదిస్తామని రాహుల్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సుమారు 70 కోట్ల వరకూ ఉన్న శ్రమజీవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. భారత్‌ను అజేయ శక్తిగా రూపొందించాలంటే ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలని, మహిళా సాధికారతను ఆచరణలో సాధించాలని రాహుల్ అన్నారు.
ఇరానీ అభ్యర్థిత్వంపై
ఆప్ నేత విసుర్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఉత్తరప్రదేశ్‌లోని అమేధీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై బుల్లితెర నటి స్మృతి ఇరానీని నిలబెట్టాలన్న బిజెపి నిర్ణయంపై ఆప్ నేత కుమార్ విశ్వాస్ వ్యంగ్యోక్తులు విసిరారు. స్వతహాగా కవి, అసోసియేట్ ప్రొఫెసర్ అయిన కుమార్ విశ్వాస్ అమేధీ నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్మృతి ఇరానీ అభ్యర్థిత్వంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ‘ఇరానీ లేదా పాకిస్తానీ.. ఎవరైనా ఒకటేనని’ కుమార్ ఎద్దేవా చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల వేళ అమేధీలో గ్రామగ్రామానికి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. ఇప్పుడు ఇరానీనా.. లేక పాకిస్తానీనా, ఇటాలియనా లేక అమెరికన్‌నా అన్నది అక్కర్లేదు. అమేధీ ఈ పాటికే ఓ నిర్ణయానికి వచ్చేసింది’ అని ఆయన చలోక్తి విసిరారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై నటి స్మృతి ఇరానీని నిలబెట్టాలని బిజెపి సోమవారం నిర్ణయించింది. దీనిపై ఆప్ అభ్యర్తి విశ్వాస్ స్పందిస్తూ ‘అమేధీ, వారణాసి సీట్ల విషయంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరింది’ అని ఆరోపించారు. విశ్వాస్ ఇలా స్పందిస్తాడని ఊహించలేదని స్మృతి అన్నారు. ఆయనిలామాట్లాడారంటే మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె చెప్పారు. దీన్ని బట్టి ఆయన పరిజ్ఞానం చెప్పవచ్చని అన్నారు.