న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సార్వత్రిక ఎన్నికలు దగ్గపడ్డంతో ఈ ఎన్నికల్లో ఖర్చు చేసే సుమారు 30 వేల కోట్ల రూపాయల్లో మూడో వంతు లెక్కల్లోకి రాని డబ్బే ఉండవచ్చని ఓ సర్వే అంచనా వేసింది. ఎన్నికల్లో మొత్తం వ్యయం 30 వేల కోట్ల రూపాయలుంటుందని అంచనా. ప్రభుత్వ వ్యయంతో పాటుగా పార్టీలు, వాటి అభ్యర్థులు చేసే ఖర్చు ఇందులో ఉంది. భారత దేశంలో ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న అత్యధిక మొత్తం ఇదే. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి 8 వేల కోట్లనుంచి పది వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, అభ్యర్థులు వ్యక్తిగత స్థాయిలో పది వేలనుంచి 13 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయనున్నట్లు మేధావి వర్గం అయిన సిఎంఎస్ నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. అధికారికంగా చేసే ఖర్చుతో పాటుగా లెక్కల్లోకి రాని ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయి.
తమ సంస్థ నిర్వహించిన అధ్యయనం గురించి సిఎంఎస్ చైర్మన్ ఎన్ భాస్కర్ రావు మాట్లాడుతూ, అంచనా వేసిన 30 వేల కోట్ల రూపాయల ఖర్చులో లెక్కల్లోకి రాని సొమ్ము మూడింట ఒక వంతుదాకా ఉండవచ్చని, ఇందులో చాలా భాగం ఓటర్ల సమీకరణకోసం, ‘ఓటుకు నోటు’ కోసం చేసే ఖర్చు ఉంటుందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌తో పాటుగా ప్రభుత్వ వ్యవస్థలు చేసే ఖర్చు 7నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలుండగా, మీడియా ప్రచారాల ఖర్చు ఆరునుంచి 7 వేల కోట్ల దాకా ఉండవచ్చని ఆ సర్వే పేర్కొంది.
తొమ్మిది విడతలుగా జరిగే లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 7నుంచి మే 12 మధ్య జరగనున్నాయి. ఇతర ఖర్చుల్లో నామినేషన్లు, ఎన్నికల ఖర్చు, అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలకు ముందు చేసే వ్యయం, ఎన్నికల గురించి ప్రభుత్వ ప్రచారాలపై చేసే ఖర్చులాంటివి ఉన్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఖర్చు మరింత పెరగనుంది. ఎన్నికలకు మూడు నాలుగు రోజుల ముందు ఓటుకు నోటు ధోరణి పుంజుకోవడం తాము తరచూ చూస్తున్నామని, నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల ప్రచార ధోరణులను చాగ్రత్తగా పరిశీలిస్తున్న భాస్కర్ రావు చెప్పారు.2014 లోక్‌సభ ఎన్నికల్లో వ్యయం 30 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తుండడంతో దేశంలోని మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లలో ప్రతి ఓటరుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేసినట్లవుతుంది. 2009 ఎన్నికల్లో ఖర్చయిన మొత్తం 10-12 వేల కోట్లతో పోలిస్తే ఈ సారి ఎన్నికల వ్యయం చాలా ఎక్కువేనని ఆయన చెప్పారు. సిఎంఎస్ ఎన్నికల నిర్వహణను గమనించడం ప్రారంభించిన 1996లో ఎన్నికలకోసం అయిన ఖర్చు కేవలం 2500 కోట్లేనని కూడా ఆయన చెప్పారు. రాజకీయాల్లో పోటీ పెరగడమే ఎన్నికల వ్యయం గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణమని, ఇది చివరికి అవినీతి పెరడానికి దారితీస్తోందని భాస్కర్ రావు చెప్పారు.
ఎన్నికల ఖర్చుపై సిఎంఎస్ సర్వే
english title:
m
Date:
Wednesday, April 2, 2014